హోరాహోరీగా... పలు జిల్లాల్లో కాకా క్రికెట్‌‌ టోర్నీ ఫైనల్స్‌‌

హోరాహోరీగా...  పలు జిల్లాల్లో కాకా క్రికెట్‌‌ టోర్నీ ఫైనల్స్‌‌
  • జిల్లా స్థాయిలో గెలిచిన  టీమ్స్‌‌కు ట్రోఫీ అందజేత
  • రాష్ట్రస్థాయికి ఎంపికైన పలువురు క్రీడాకారులు

వెలుగు నెట్‌‌వర్క్‌‌ : విశాక ఇండస్ట్రీస్‌‌, హెచ్‌‌సీఏ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లాల్లో జరుగుతున్న కాకా వెంకటస్వామి మెమోరియల్‌‌ టీ 20 క్రికెట్‌‌ టోర్నీ హోరాహోరీగా సాగుతోంది. కొన్ని జిల్లాల్లో ఇప్పటికే ఫైనల్స్‌‌ ముగియగా.. మరికొన్ని జిల్లాల్లో శుక్రవారం ఫైనల్‌‌ మ్యాచ్‌‌లు జరిగాయి. ఉమ్మడి జిల్లా లెవల్‌‌లో గెలిచిన టీమ్స్‌‌కు ప్రైజ్‌‌లు అందజేశారు. అలాగే రాష్ట్ర స్థాయిలో జరిగే టోర్నీకి ఉమ్మడి జిల్లా తరఫున ఆడేందుకు క్రీడాకారులను ఎంపిక చేశారు. 

కరీంనగర్​ జిల్లా అలుగునూరులో జరుగుతున్న కాకా మెమోరియల్‌‌ టీ-20 ఫైనల్‌‌లో కరీంనగర్‌‌ టీమ్‌‌ విజేతగా నిలిచింది. శుక్రవారం కరీంనగర్‌‌, రాజన్న సిరిసిల్ల జిల్లా జట్ల మధ్య ఫైనల్‌‌ మ్యాచ్‌‌ జరిగింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌‌కు దిగిన కరీంనగర్ టీమ్‌‌ నిర్ణీత 20 ఓవర్లలో 170 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌‌కు వచ్చిన రాజన్న సిరిసిల్ల టీమ్‌‌ 125 పరుగులకే ఆలౌట్‌‌ అయింది. దీంతో కరీంనగర్‌‌ టీమ్‌‌ విజయం సాధించింది. కాగా కరీంనగర్‌‌ ఉమ్మడి జిల్లా తరఫున రాష్ట్ర స్థాయికి ఎంపికైన క్రీడాకారుల పేర్లను కరీంనగర్‌‌ క్రికెట్‌‌ అసోసియేషన్‌‌ జనరల్‌‌ సెక్రటరీ మురళీధర్‌‌రావు ప్రకటించారు. 

కాకా మెమోరియల్ క్రికెట్‌‌ టోర్నీలో భాగంగా మూడో రోజు ఉదయం ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్‌‌ జట్లు తలపడ్డాయి. మొదట బ్యాటింగ్‌‌కు దిగిన ఆసిఫాబాద్‌‌ టీమ్‌‌ 19.2 ఓవర్లలో 126 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌‌కు వచ్చిన ఆదిలాబాద్‌‌ జిల్లా 15.5 ఓవర్లలోనే టార్గెట్‌‌ను చేరుకొని విజయం సాధించింది. మధ్యాహ్నం మంచిర్యాల, నిర్మల్‌‌ జిల్లా జట్లు తలపడగా... మంచిర్యాల జిల్లా జట్టు మొదట బ్యాటింగ్‌‌కు దిగి 18 ఓవర్లలో 178 పరుగులు చేసింది. తర్వాత నిర్మల్‌‌ టీమ్‌‌ 14 ఓవర్లలో 95 పరుగులకే ఆలౌట్‌‌ అయ్యారు. దీంతో మంచిర్యాల టీమ్‌‌ విజయం సాధించింది. మంచిర్యాల, ఆదిలాబాద్‌‌ జిల్లా జట్లు శనివారం ఫైనల్‌‌ మ్యాచ్‌‌లో తలపడనున్నాయి.

 కాకా వెంకటస్వామి మెమోరియల్‌‌ క్రికెట్‌‌ టోర్నీ డిస్ట్రిక్ట్‌‌ లెవల్‌‌లో మహబూబ్‌‌నగర్‌‌ టాప్‌‌లో నిలిచింది. శుక్రవారం ఉదయం నాగర్‌‌కర్నూల్‌‌, నారాయణపేట మధ్య మ్యాచ్‌‌ జరుగగా... బ్యాటింగ్‌‌కు దిగిన నాగర్‌‌కర్నూల్‌‌ 20 ఓవర్లలో 148 రన్స్‌‌ చేసింది. తర్వాత నారాయణపేట 19.4 ఓవర్లలో 97 రన్స్‌‌కు ఆలౌట్‌‌ కావడంతో నాగర్‌‌కర్నూల్‌‌ టీం విజయం సాధించింది. రెండో మ్యాచ్‌‌లో మహబూబ్‌‌నగర్‌‌, నారాయణపేట పోటీ పడగా.. నారాయణపేట మొదట 20 ఓవర్లలో 124 పరుగులు చేసింది. ఛేజింగ్‌‌కు దిగిన మహబూబ్​నగర్‌‌ 12.4 ఓవర్లలోనే టార్గెట్‌‌ను చేధించించింది. మొత్తం టోర్నీలో నెట్‌‌ రన్‌‌ రేట్‌‌ ఆధారంగా మహబూబ్‌‌నగర్‌‌ టాప్‌‌ ప్లేస్‌‌లో నిలువగా.. నాగర్​కర్నూల్‌‌ సెకండ్‌‌ ప్లేస్‌‌లో నిలిచింది. 

వరంగల్‌‌లో జరిగిన కాకా వెంకటస్వామి మెమోరియల్‌‌ క్రికెట్‌‌ లీగ్‌‌లో భూపాలపల్లి జట్టు ఘన విజయం సాధించింది. శుక్రవారం జనగామ జిల్లా వంగాలపల్లిలో జరిగిన ఫైనల్‌‌ మ్యాచ్‌‌లో భూపాలపల్లి, హనుమకొండ జట్లు తలపడ్డాయి. టాస్‌‌ గెలిచి బ్యాటింగ్‌‌ ఎంచుకున్న హనుమకొండ టీం 105 పరుగులు సాధించింది. అనంతరం బరిలోకి దిగిన భూపాలపల్లి జట్టు టార్గెట్‌‌ను ఛేదించి విజేతగా నిలిచింది. గెలిచిన టీమ్‌‌కు వరంగల్‌‌ జిల్లా క్రికెట్‌‌ అసోసియేషన్‌‌ సెక్రటరీ చాగంటి శ్రీనివాస్‍, ఉపాధ్యక్షులు అచ్చ వెంకటేశ్వర్‍రావు, ఆర్‍.రఘురాం, తోట రాము మెమొంటోలు అందజేశారు.

సంగారెడ్డిలోని ఎస్‌‌వీఎం గగన్‌‌ గ్రౌండ్‌‌లో శుక్రవారం మెదక్‌‌, సంగారెడ్డి టీమ్స్‌‌ మధ్య ఫైనల్‌‌ మ్యాచ్‌‌ జరిగింది. ఇందులో సంగారెడ్డి జట్టు 10 పరుగుల తేడాతో విజయం సాధించింది. గెలిచిన జట్టుకు ఉమ్మడి మెదక్ జిల్లా అసోసియేషన్ ఉపాధ్యక్షులు మధుమోహన్‌‌రెడ్డి, సభ్యులు శ్రీనాథ్‌‌రెడ్డి, రఘుపతి, మధు, విజయ్ బహుమతి అందజేశారు.

నిజామాబాద్‌‌లో శుక్రవారం జరిగిన ఫైనల్‌‌ మ్యాచ్‌‌లో నిజామాబాద్‌‌, కామారెడ్డి టీమ్స్‌‌ పోటీ పడగా.. మొదట బ్యాటింగ్‌‌ చేసిన కామారెడ్డి 20 ఓవర్లలో 133 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌‌ చేసిన నిజామాబాద్‌‌ టీం 18.1 బంతుల్లో 136 పరుగులు చేసి విజయం సాధించింది. గెలిచిన టీంకు రైతు కమిషన్‌‌ సభ్యుడు గడుగు గంగాధర్, టీజీవో జిల్లా అధ్యక్షుడు కిషన్‌‌ బహుమతి అందజేశారు.