ఆముదం, ఆవ, నువ్వులు, వేప నూనెతో.. ప్రాజెక్టు ఆవిరి నష్టాలకు చెక్!

ఆముదం, ఆవ, నువ్వులు, వేప నూనెతో.. ప్రాజెక్టు ఆవిరి నష్టాలకు చెక్!
  • తెలంగాణ, ఏపీల్లోని ప్రాజెక్టుల్లో ఏటా 107 టీఎంసీల నీళ్లు ఆవిరి
  • శ్రీశైలం నుంచే అత్యధికంగా 15 టీఎంసీల నష్టాలు .. సాగర్​ నుంచి 10 టీఎంసీలు లాస్​
  • ఐఐటీ పంజాబ్, గీతం వర్సిటీ రీసెర్చర్ల స్టడీలో వెల్లడి

హైదరాబాద్​, వెలుగు: ప్రాజెక్టుల్లో నీటి వాడకంతో పాటు కొన్ని ఆవిరి నష్టాలూ ఉంటాయి. భారీ ప్రాజెక్టుల నుంచి పెద్దమొత్తంలో నీరు ఆవిరైపోతుంది. ప్రాజెక్టుల్లో ఇలాంటి ఆవిరి నష్టాలను నివారించవచ్చని ఐఐటీ శాస్త్రవేత్తలు తేల్చారు. తెలంగాణ, ఏపీల్లోని ప్రాజెక్టుల నీటి ఆవిరిపై ఐఐటీ పంజాబ్​, హైదరాబాద్​ గీతం యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్​ మణిపాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన నలుగురు రీసెర్చర్లు ఇటీవల పరిశోధనలు చేశారు. 

రెండు రాష్ట్రాల్లో కలిపి 107 టీఎంసీలకుపైగా నీళ్లు ఆవిరి రూపంలోనే నష్టపోతున్నట్టు నిర్ధారించారు. ఆ  నష్టాలను మన ఇంట్లోనే దొరికే నూనెలతో చెక్​ పెట్టొచ్చని చెబుతున్నారు. ఆముదం, ఆవ, నువ్వుల నూనె, వేప నూనెతోనే ఆ నష్టాలను పూడ్చొచ్చంటున్నారు. ఆయా నూనెలను స్టీరైల్​ఆల్కహాల్​, సిటైల్​ ఆల్కహాల్​ అనే రసాయనాలతో కలిపి ప్రాజెక్టుల్లో చల్లితే.. అవి నీటిపై తేలి, ఆవిరి నష్టాలను 30 నుంచి 60 శాతం వరకు తగ్గిస్తాయని  స్టడీలో తేలినట్లు వెల్లడించారు. 

 నాగార్జునసాగర్​, శ్రీశైలం, మంజీరా, శ్రీరాంసాగర్, ఏపీలోని కండలేరు, మద్దువలస, తాండవ, సోమశిల ప్రాజెక్టుల ఆవిరిపై పరిశోధించి ఈ విషయం తేల్చారు. 

అత్యధికంగా శ్రీశైలంలోనే.. 

నీటి ఆవిరి నష్టాలు అత్యధికంగా శ్రీశైలంలోనే ఉన్నట్టు పరిశోధనలో తేలింది. ఏటా ఈ ప్రాజెక్టు నుంచి15 టీఎంసీల వరకు జలాలు ఆవిరి రూపంలో నష్టపోతున్నట్టు రీసెర్చర్లు తేల్చారు. ఆ తర్వాత శ్రీరాంసాగర్​ ప్రాజెక్టులో 12 టీఎంసీలు, నాగార్జునసాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 10 టీఎంసీలు, సోమశిలలో 10 టీఎంసీల చొప్పున జలాలు ఆవిరి రూపంలో పోతున్నట్టు గుర్తించారు. కండలేరు, మద్దువలస, తాండవ, మంజీరా నదుల్లో నష్టం తక్కువగానే ఉన్నట్టు గుర్తించారు. 

అయితే,  ఒక చదరపు మీటరు నీళ్లకు 26.57 మిల్లీగ్రాంల సిటైల్​ ఆల్కహాల్​/స్టీరైల్​ ఆల్కహాల్​, ఏదో ఒక నూనె మిశ్రమాన్ని కలిపితే.. ఆవిరి నష్టాలు 30 శాతం తగ్గుతాయని చెబుతున్నారు. 5  లీటర్ల నీటిని ఆదా చేసేందుకు కేవలం ఒక్కపైసా ఖర్చవుతుందని, అతి తక్కువ ఖర్చుతోనే నీటి ఆవిరి నష్టాలను తగ్గించొచ్చని సైంటిస్టులు అంటున్నారు. 

అయితే, ప్రస్తుతం ఏపీ, తెలంగాణలోని ఈ 8 ప్రాజెక్టులపైనే చేసిన సైంటిస్టులు.. భవిష్యత్తులో దేశంలోని మరిన్ని ప్రాజెక్టులపైనా రీసెర్చ్​ నిర్వహిస్తామని వెల్లడించారు.