Gautam Gambhir: టీ20 ప్రపంచకప్ 2026లో టీమిండియా విశ్వవిజేతగా నిలిచింది. నిన్న (ఆదివారం) అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఫైనల్లో సమష్టిగా రాణించిన భారత జట్టు 96 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ను చిత్తుగా ఓడించింది. ఈ గెలుపుతో ముచ్చటగా మూడోసారి టీ20 ప్రపంచకప్‌ను సొంతం చేసుకోవడంతో పాటు వరుసగా రెండోసారి టైటిల్ గెలిచిన జట్టుగా.. అలాగే సొంతగడ్డపై టైటిల్ అందుకున్న టీమ్‌గా రికార్డు సృష్టించింది. ఈ మ్యాచ్ అనంతరం కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌తో కలిసి హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఈ విజయంపై సంతోషం వ్యక్తం చేశారు. ఈ ట్రోఫీని మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, నేషనల్ క్రికెట్ అకాడమీ డైరెక్టర్ వీవీఎస్ లక్ష్మణ్‌లకు అంకితం ఇస్తున్నానని ప్రకటించాడు. భారత క్రికెట్ కోసం రాహుల్ భాయ్ చేసిన కృషి ఎప్పటికీ వెలకట్టలేనిది.. నేషనల్ క్రికెట్ అకాడమీని వీవీఎస్ లక్ష్మణ్ నడిపిస్తున్న తీరు వల్లే మనకు ఇలాంటి అద్భుతమైన యంగ్ క్రికెటర్లు దొరుకుతున్నారని గంభీర్ చెప్పుకొచ్చాడు.
మనం గతంలో వ్యక్తిగత మైలురాళ్లను (హాఫ్ సెంచరీలు, సెంచరీలు) అతిగా సెలబ్రేట్ చేసుకునే వాళ్లం.. నా దృష్టిలో మైలురాళ్లు ముఖ్యం కాదు.. ఐసీసీ ట్రోఫీలు మాత్రమే ముఖ్యమని కోచ్ గౌతమ్ గంభీర్ వెల్లడించాడు. మనం రికార్డులను సెలెబ్రేట్ చేసుకోవడం ఆపేసి.. ట్రోఫీలను సెలెబ్రేట్ చేసుకోవాలని సూచించాడు. టైటిల్సే అన్నిటి కంటే ముఖ్యం. నేను కోచ్‌గా ఉన్నంత కాలం టీమ్ ఇదే సిద్ధాంతాన్ని ఫాలో అవుతుందని పేర్కొన్నారు. న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా సిరీస్‌ల ఓటమి తర్వాత మేం చాలా విమర్శలను ఎదుర్కొన్నాం.. అప్పుడు నాకు మొదట ఫోన్ చేసి సపోర్టుగా నిలిచింది జై షా భాయ్.. ఆయన నాపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞుడిని అని గంభీర్ పేర్కొన్నారు.
ప్లేయర్సే కోచ్‌ను, కెప్టెన్‌ను గొప్పవారిగా మార్చివేస్తారు.. స్టేడియంలోకి వెళ్లి పోరాడి ట్రోఫీని గెలిచింది మా ఆటగాళ్లే అని గౌతమ్ గంభీర్ చెప్పారు. ఈ విజయం క్రెడిట్ మొత్తం భారత ఆటగాళ్లదే.. ఇందులో కోచ్‌గా నాది, కెప్టెన్‌గా సూర్య గొప్పతనం ఏం లేదని తేల్చి చెప్పారు. ప్లేయర్స్ అద్భుతంగా రాణించడంతోనే మాకు ఈ విధమైన గుర్తింపు లభించిందన్నారు. టీమ్ లో ప్రతీ ఒక్కరు మ్యాచ్ విన్నర్లే.. ఫైనల్లో సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ ఆడిన తీరు అద్భుతం అని కొనియాడాడు.
Gautam Gambhir said, "for a long time in Indian cricket, we've celebrated milestones. Milestones don’t matter, trophies do. We should start celebrating trophies".#INDvsNZpic.twitter.com/YK7knisRpu
— Khan (@ccricket713) March 8, 2026
