కేసులు పెట్టి జైలుకు పంపుతవ్​.. అంతకుమించి నువ్వేం జేస్తవ్

V6 Velugu Posted on May 04, 2021

  • చావనైనా చస్త.. ఆత్మగౌరవాన్ని కోల్పోను: కేసీఆర్​పై ఈటల ఫైర్​
  • ఇన్నేండ్ల తమ్ముడు ఇప్పుడు దెయ్యం అయిండా అని ప్రశ్న
  • సీఎం చెప్తే కలెక్టర్​ ఎట్లాంటి రిపోర్టయినా ఇస్తరు
  • ఎమ్మెల్యే పదవికి రాజీనామాకైనా రెడీ.. 
  • భూముల వ్యవహారంపై లీగల్​గా కొట్లాడ్తా
  • నాకు సంబంధంలేని భూములపై ఎంక్వైరీ చేస్తున్నరు... 
  • వారి శక్తినంతా ప్రయోగిస్తున్నరు
  • విచారణ ఆఫీసర్లకు వావివరసలు తెలియవు
  • కేసీఆర్​ ఫామ్​హౌస్​కు ఎన్ని అసైన్డ్​ భూముల నుంచి రోడ్లు తీయలే..

‘‘ఒక పని ఎత్తుకుంటే వాడ్ని మీరు ఎట్ల ఖతం పట్టిస్తరో నాకు తెలుసు. అయినా చావునైనా భరిస్త తప్ప నా ఆత్మగౌరవాన్ని కోల్పోను. సంపాదించుకున్న ఆస్తిని గుంజుకుంటరు కావచ్చు. అంతకంటే ఎక్కువ చేసేది ఏముంది?”

మంత్రులెవరూ ఆత్మగౌరవంతో లేరు

‘‘ఇయ్యాల ఒక్కడ్నే ఉండొచ్చు.. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు సానుభూతి తెలుపకపోవచ్చు. నేను చేస్తున్న పని ఆత్మగౌరవ సమస్య” అని ఈటల రాజేందర్ అన్నారు. ‘‘మేము ఎందుకు దూరం అయ్యామో మీ అంతరాత్మకు తెలుసు. మేం చెడు పని చేసి దూరం కాలేదు. మంత్రుల లెక్క చూడకపోతెమాయే. మనుషులుగా చూడాలని కోరుకున్నం. మీ దగ్గర  ఉన్న మంత్రులెవరూ కూడా ఆత్మగౌరవంతో ఉన్నామని అంతరాత్మతో కూడా అనరు. బయట గొప్పలు  చెప్పుకోవచ్చు. నీ దగ్గర ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు గొప్ప గౌరవంతో ఉన్నామని ఎవరూ అనుకోవడంలేదు” అని కేసీఆర్ పై ఫైర్ అయ్యారు. తాను ముక్కుసూటి మనిషిని కాబట్టి బయటకొచ్చి చెప్పగలిగానని, అడ్జస్ట్ కానంత మాత్రాన చట్టం, సిస్టం పక్కన పెట్టి వేధిస్తున్నారని మండిపడ్డారు.

హైదరాబాద్‌, వెలుగు: చావనైనా చస్తానని, ఆత్మగౌరవాన్ని మాత్రం కోల్పోనని మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ స్పష్టం చేశారు. ‘‘కేసులు పెడుతవ్‌.. జైలుకు పంపిస్తవ్‌. నా బిజినెస్‌ మొత్తం సీజ్‌  చేయిస్తవ్​.. ఆస్తులు గుంజుకుంటవ్​ కావొచ్చు.. అంతకు మించి నువ్వేం చేస్తవ్ ​నన్ను” అని కేసీఆర్​పై మండిపడ్డారు. అరెస్టులు, కేసులకు భయపడేంత చిన్నవాడ్ని కాదన్నారు. తనకు సంబంధం లేని భూములపై ఎంక్వైరీ చేస్తున్నారని, తనపై శక్తినంతా ప్రయోగిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్‌తో అడ్జస్ట్‌ కానందుకే  తనను వేధిస్తున్నారని ఆరోపించారు. ‘‘19  ఏండ్ల పాటు తమ్ముడిగా ఉన్న ఈటల- ఒక్కసారిగా దెయ్యం అయిండా..? రాజకీయాల్లోకి వచ్చినప్పుడు కట్టుబట్టలతో వచ్చిన. మళ్లీ ఆ స్థాయికి పోవడానికి సిద్ధమే. నా ఆత్మను మాత్రం అమ్ముకోను’’ అని చెప్పారు. భూముల వ్యవహారంపై హైకోర్టుకు వెళ్లి లీగల్​గా కొట్లాడుతానన్నారు. తన ఆస్తులపై సిట్టింగ్‌ జడ్జితో ఎంక్వైరీ చేయించాలని డిమాండ్​ చేశారు.  దేవరయాంజాల్​ భూములపై ప్రత్యేక కమిటీ వేయాలన్నారు. సోమవారం మేడ్చల్‌ –మల్కాజి​గిరి జిల్లాలోని శామీర్‌పేట్‌లో ఈటల రాజేందర్​ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమేనని, తన ప్రజల సలహాలు తీసుకున్నాక రిజైన్‌ చేస్తానని స్పష్టం చేశారు. తనపై చర్యలు తీసుకుంటున్నప్పుడు, ఉక్కుపాదం మోపుతున్నప్పుడు, తానెవరో సీఎం కేసీఆర్​కు గుర్తుకు రాలేదా అని 
ప్రశ్నించారు. ‘‘నేను పార్టీలు పెడ్తానని ఎప్పుడూ చెప్పలే. పార్టీ మారుతాననీ చెప్పలే. కానీ కేబినెట్‌‌ నుంచి బర్తరఫ్‌‌ చేశారు” అని ఈటల అన్నారు. తనపై ఇలాంటి ప్రచారానికి ఒడిగట్టడం కేసీఆర్‌‌ గౌరవం, స్థాయిని పెంచదన్నారు. కేసీఆర్‌‌తో అడుగులో అడుగేశాక.. 24/7 పల్లెల్లో,ప్రజల్లో, రోడ్లపైనే ఉన్నామని,  కేసీఆర్‌‌తో అడుగేశాక పైసా వ్యాపారం చేయలేదని అన్నారు.  
సంబంధంలేని భూములపై ఎంక్వైరీ చేస్తున్నరు
తనకు సంబంధం లేని భూములపై ఎంక్వైరీ చేస్తున్నారని, భూములు కొలుస్తామని కనీసం నోటీసు కూడా ఇవ్వలేదని ఈటల మండిపడ్డారు. ‘‘ఈటల అనే మామూలు మనిషి మీద తన శక్తినంతా ప్రయోగిస్తున్నరు. ల్యాండ్‌‌, రెవెన్యూ, ఏసీబీ, ఫారెస్ట్‌‌ డిపార్ట్‌‌మెంట్లను వాడుతున్నరు.  అసైన్డ్‌‌ భూములను కొనుక్కుంటే శిక్షకు అర్హుడిని. అందులో షెడ్లు కట్టినా శిక్షకు అర్హుడినే. నాకు సంబంధంలేని భూములపై ఎంక్వైరీ చేస్తున్నరు. వందల మంది అధికారులు, పోలీసులను పెట్టి భూములు కొలవడం ప్రజాస్వామిక విధానమా?’’ అని చెప్పారు. 
సీఎం చెప్తే కలెక్టర్, ఏసీబీ ఏ రిపోర్టయినా ఇస్తది
ఎంక్వైరీ చేసిన అధికారులకు వావివరస  కూడా లేదని ఈటల మండిపడ్డారు. ‘‘జమునా హ్యాచరీస్‌‌ చైర్మన్‌‌ నేను కాదు. నాకు సంబంధంలేదు. దాని చైర్మన్‌‌ జమున. నా పేరు ఎట్ల పెడ్తరు. అధికారులకు వావివరస కూడా లేదు. సీఎంకు కూడా కొడుకులు, బిడ్డలు ఉంటరు. ఆయనకు వావివరస  తెలియదా? మీ అధికారులు ఇచ్చిన దాన్ని మీకు పంపిస్త. 66 ఎకరాల భూమి కబ్జా పెట్టారని రిపోర్ట్‌‌ ఇచ్చారు. సీఎం చెప్తే కలెక్టర్, ఏసీబీ ఏ రిపోర్ట్‌‌ అయినా ఇస్తది. చెట్లు కొట్టినందుకు ఒక కేసు. రోడ్డు వేసినందుకు మరో కేసు అని అంటున్నరు. నా వివరణ అడగలేదు. కలెక్టర్ రిపోర్ట్‌‌ అధికారికంగా అందలేదు. అడగకుండానే నా ఇంటి చుట్టూ వందల మంది పోలీసులను పెట్టి ఏ క్షణమైనా అరెస్ట్‌‌ అయితరని, పెద్దపెద్ద కేసులు పెడుతరని  ప్రచారం చేస్తున్నరు” అని అన్నారు. కేసులు పెట్టుకోండని సవాల్​ విసిరారు. ‘‘కేసీఆర్‌‌ శిష్యరికంలో ధర్మం, చట్టాన్నే నమ్ముకున్న.  తప్పకుండా కోర్టుకు పోత. లీగల్‌‌గా ఫైట్‌‌ చేస్త. భూములు కొలిచినప్పుడూ నోటీస్‌‌ ఇవ్వలేదు. రిపోర్ట్‌‌ వచ్చాకా నోటీస్‌‌ ఇవ్వలేదు. కోర్టు దోషిగా తేలిస్తే శిక్షకు సిద్ధంగా ఉన్న. నీ ఫామ్‌ హౌస్‌కు ఎన్ని అసైన్డ్‌ భూముల నుంచి రోడ్లు తీయలే? వ్యక్తులు ఉంటరు.. పోతరు. పార్టీలూ ఉంటయి పోతయి. కానీ వ్యవస్థ, ప్రజలు శాశ్వతం. 5 పైసల భూమి తీసుకోలేదు. ఐదు పైసల రాయితీ తీసుకోలేదు.. ’’ అని ఆయన స్పష్టం చేశారు. 
పౌల్ట్రీకి నాలా ఉండదు.. నాలా లేదని నోటీసా?
‘‘పౌల్ట్రీ వ్యవసాయం కిందికి వస్తది. నాలా కన్వర్షన్‌‌ అక్కర్లేదు. అలాంటిది పౌల్ట్రీకి  నాలా లేదని నోటీస్‌‌ ఇచ్చారు. వుమెన్​ ఎంటర్​ప్రెన్యూర్, వ్యాపారం చేస్తున్న నా భార్యపై ఇలాంటి పని చేయడం తగునా..?” అని ఈటల ప్రశ్నించారు. ‘‘మీరు వెయ్యేండ్లు ఉంటరా.. ప్రజాగ్రహానికి ఎలా గురవుతరో నిన్ననే ఎన్నికల రిజల్ట్స్‌‌లో చూసినం. అణచివేత చెల్లదు” అని హెచ్చరించారు.  ‘‘ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ నిర్ణేతలు. ఇట్లాంటివి చేయకండి. ఇలా చేసినా తట్టుకుని నిలబడే శక్తి ఈ సమాజం నాకు ఇచ్చింది. అరెస్టులు, కేసులకు భయపడేంత చిన్నవాడు కాదు ఈటల. సాంబశివుడు చనిపోయినప్పుడు శవం దగ్గరికి పోయి స్టేట్‌‌మెంట్‌‌ ఇస్తే నాపై నయీం ఎన్నో అరాచకాలు చేశాడు.  చంపడానికి రెక్కీ చేసిండు. హంతక ముఠా చంపుతానంటే భయపడలేదు. ఇయ్యాల ఇలా చేస్తే భయపడ్తనా..? ఆ ధైర్యం లేకపోతే దివంగత సీఎం రాజశేఖర్‌‌ రెడ్డి శక్తి, ప్రలోభాల ముందు ఎందుకు ఉండేవాడిని. అప్పటి టీఆర్‌‌ఎస్‌‌ ఎమ్మెల్యేల్లో.. మిగిలే వారిలో నేనొక్కడిని అని మీ అంతరాత్మకు తెలుసు’’ అని ఈటల  అన్నారు.
ఆలయ భూములు కావని దివాన్‌‌ కమిటే చెప్పింది
‘‘దేవరయాంజాల్​లో దేవాలయాల భూములు కబ్జా పెట్టారంటున్నరు. నేను కొన్నప్పుడు దేవాలయ భూములు కావు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు అడిగినం. రాజశేఖర్‌‌ రెడ్డి వచ్చినంక ఆయన్ను అడిగినం. ఎంక్వైరీ చేయాలని కోరినం.  దేవాలయ భూములు అయితే వెనక్కి తీసుకోవాలని చెప్పిన. అప్పుడు దివాన్‌‌ కమిటీ వేశారు. ఇవి ప్రభుత్వ, దేవాలయ భూములు అనడానికి ఆధారాలు లేవని ఆ కమిటీ రిపోర్ట్‌‌ ఇచ్చింది. పరిష్కరిస్తామని  వైఎస్సార్​ హామీ ఇచ్చారు. ఇంతలోనే చనిపోయారు. రోశయ్య, కిరణ్‌‌ కుమార్‌‌ రెడ్డి ఉన్నప్పుడు, తెలంగాణ వచ్చాక  కేసీఆర్‌‌ దృష్టికి కూడా తీసుకపోయినం” అని ఈటల  అన్నారు. ‘‘అవి కాస్ట్​లీ భూములు కాబట్టి, ఒట్టిగుంటే ఏమొస్తదని షెడ్డు కట్టుకున్నం. షెడ్డు కిరాయికి కూడా ఇచ్చిన. అక్కడ ప్రజల కోసమైనా కమిటీ వేసి స్పీడ్‌‌గా న్యాయం చేయండి’’ అని ఆయన  
స్పష్టం చేశారు.  
సివిల్‌‌ సప్లయ్​పైనా ఆరోపణలు చేస్తరు
‘‘నాపై సివిల్ సప్లై వ్యవహారంలోనూ ఆరోపణ చేస్తరు. 2014లో రైస్‌‌ మిల్లర్ల దగ్గర బియ్యం తీసుకున్నం. అప్పుడు ఎమ్మెస్పీల కొనలేదని కేంద్రం చెప్పింది. ఎమ్మెస్పీ సర్టిఫికెట్‌‌ ఎక్కడ తెస్తమని, బౌండరీస్‌‌ లేవని, నచ్చకపోతే మా బియ్యం మాకు ఇవ్వమన్నం. అప్పటి ఎంపీ వినోద్‌‌ నేతృత్వంలో ఎంపీలందరం 20 సార్లు కేంద్ర మంత్రి రాంవిలాస్‌‌ దగ్గరికి వెళ్లినం. దాంట్లో నేనేదైనా తప్పు చేస్తే ఏ శిక్షకైనా సిద్ధం” అని ఈటల అన్నారు. ‘‘ఈటల   ప్రేమకు లొంగుతుండే. ఇట్లాంటి చర్యలకు లొంగను. కేసులు పెడుతవ్‌‌.. జైలుకు పంపిస్తవ్‌‌. నా బిజినెస్‌‌ మొత్తం సీజ్‌‌ అయితయ్‌‌. కానీ నా ఆత్మను మాత్రం అమ్ముకోను..’’ అన్నారు. 
ప్రజలతో చర్చించి రాజీనామాపై నిర్ణయం
‘‘ఎమ్మెల్యేగా టీఆర్‌‌ఎస్‌‌ నుంచి బీఫామ్ ఇచ్చినంత మాత్రాన అందరూ  గెలువరు. ప్రజల ప్రేమ కూడా పొందాలి.  కారు గుర్తు మీద గెలిసివవ్​.. రాజీనామా చేయాలి అంటరు. సిద్ధమే. చేసేముందు హుజూరాబాద్‌‌ ప్రజల సలహా తీసుకుంట” అని ఈటల చెప్పారు. పదవుల కోసం పెదవులు మూసేటోడ్ని కాదని అన్నారు. 

ఈటలకు గన్​మెన్, కాన్వాయ్​ తొలగింపు 
ఈటలను కేబినెట్ నుంచి ఆదివారం బర్తరఫ్​ చేసిన ప్రభుత్వం సోమవారం ఉదయం గన్ మన్లను తొలగించింది.  కాన్వాయ్​ వెహికల్స్ ను వెనక్కి తీసుకుంది. కేబినెట్​ నుంచి బర్తరఫ్ చేసినందన రాజేందర్ వద్ద ఉన్న గన్ మన్లు, ప్రొటోకాల్ వెహికల్స్ ను వెనక్కి తీసుకోవాలని సంబంధిత ఆఫీసర్లకు ఉన్నతాధికారులు ఫోన్ చేశారు. దీంతో ఆఫీసర్లు ఈటల వద్దకు వెళ్లి..  వెహికల్స్ ను ప్రొటోకాల్ డిపార్ట్ మెంట్ కు అప్పగిస్తున్నట్టు అంగీకార పత్రంపై సంతకాలు తీసుకున్నారు. 

Tagged , eetela rajendar angry, eetela hot comments, cm kcr and minister ktr, eetela latest comments, today eetela

Latest Videos

Subscribe Now

More News