- కరీంనగర్ బల్దియా డ్రాఫ్ట్ లిస్టు ప్రకటనలో జాప్యం
కరీంనగర్, వెలుగు: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలు మున్సిపాలిటీల్లో ముసాయిదా ఓటర్ల జాబితాను గురువారం ప్రదర్శించారు. కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్, చొప్పదండి, జమ్మికుంట మున్సిపాలిటీల్లో వార్డులు, ఓటర్ల ముసాయిదా జాబితాను అధికారులు ప్రదర్శించారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో మాత్రం రాత్రి 9 దాటినా డివిజన్ల వారీగా ముసాయిదాను ప్రదర్శించలేదు.
కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో 66 డివిజన్లు ఉండగా పురుషులు 1,69,763 మంది, స్త్రీలు 1,70,969 మంది, ఇతరులు 43 మంది కలిపి మొత్తం 3,40,775 మంది ఓటర్లు ఉన్నట్లు వెల్లడించారు. అయితే రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకారం.. డివిజన్లవారీగా ముసాయిదా జాబితాను ప్రదర్శించాల్సి ఉండగా రాత్రి వరకు ఎలాంటి జాబితాను వెలువరించలేదు.
- హుజూరాబాద్ మున్సిపాలిటీ పరిధిలో 30 వార్డులు ఉండగా 14,395 మంది పురుషులు, 15,200 మంది మహిళలు, నలుగురు ఇతరులు.. మొత్తం 29,599 మంది ఓటర్లు ఉన్నట్లు మున్సిపల్ ఆఫీసర్లు వెల్లడించారు. జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలో పురుషులు 16,870 మంది, మహిళలు 17,724 మంది, ఇతరులు ఒకరు.. మొత్తం 34,595 మంది ఓటర్లు ఉన్నట్లు తెలిపారు. చొప్పదండి పరిధిలో 14 వార్డుల్లో పురుషులు 6,743 మంది, 7,173 మంది మహిళలు కలిపి మొత్తం 13,916 మంది ఓటర్లు ఉన్నట్లు మున్సిపల్ కమిషనర్ నాగరాజు వెల్లడించారు. ఓటర్ల జాబితాపై అభ్యంతరాలుంటే ఈ నెల 4లోపు ఫిర్యాదు చేయొచ్చని చెప్పారు.
రామగుండం కార్పొరేషన్‌లో..
గోదావరిఖని, వెలుగు : రామగుండం కార్పొరేషన్ పరిధిలోని 60 డివిజన్లకు సంబంధించిన ముసాయిదా ఓటర్ల జాబితాను కమిషనర్, అడిషనల్ కలెక్టర్ జె.అరుణశ్రీ విడుదల చేశారు. జాబితాలో పేర్లు, అడ్రస్‌లపై ఏవైనా అభ్యంతరాలుంటే లిఖిత పూర్వకంగా బల్దియా ఆఫీస్‌లో ఫిర్యాదు ఇవ్వాలని రామగుండంలో 60 డివిజన్ల వ్యాప్తంగా మొత్తం 1,82,976 మంది ఓటర్లు ఉండగా, ఇందులో 91,395 మంది పురుషులు, 91,551 మంది మహిళలు, 30 మంది థర్డ్ జెండర్స్ ఉన్నారు.
వేములవాడ/కోరుట్ల/సుల్తానాబాద్, వెలుగు : వేములవాడ మున్సిపాలిటీ డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్‌ను కమిషనర్ అన్వేష్ విడుదల చేశారు. ఏమైనా అభ్యంతరాలుంటే ఈ నెల 10 లోపు ఫిర్యాదు చేయాలని నోటీసులో పేర్కొన్నారు. మున్సిపాలిటీలో మొత్తం 40,877 మంది ఉండగా.. పురుషులు 19,585, మహిళలు 21,279, ట్రాన్స్జెండర్లు 18 మంది ఉన్నట్లు నోటీసులో తెలిపారు.
కోరుట్ల మున్సిపాలిటీ పరిధిలో 33 వార్డులకు సంబంధించి ముసాయిదా ఓటరు జాబితాను మున్సిపల్ కమిషనర్ రవీందర్ విడుదల చేశారు. సుల్తానాబాద్ పరిధిలోని 15 వార్డులకు గానూ 16,824 మంది ఓటర్లతో ముసాయిదా జాబితాను విడుదల చేశారు. ఏమైనా అభ్యంతరాలుంటే ఈనెల 4 లోపు లిఖితపూర్వకంగా అర్జీలు అందజేయాలని కమిషనర్ రమేశ్ తెలిపారు.
