మరో 48 గంటలు అప్రమత్తంగా ఉండాలి

మరో 48 గంటలు అప్రమత్తంగా ఉండాలి

రాబోయే 48 గంటలు  భారీ వర్షాలు పడే అవకాశమున్నందున ప్రజలందరూ మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు మంత్రి ఈటెల. అధికారులకు తోడుగా ప్రజాప్రతినిధులు కూడా రంగంలోకి దిగి సహాయం అందించాలన్నారు.  ఇప్పటికే రెండు కమాండ్ కంట్రోల్ సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు. సిఎస్ ఆధ్వర్యంలో కంట్రోల్ సెంటర్ నడుస్తుందన్నారు. అన్ని జిల్లాల కలెక్టర్లతో సమాచారం సేకరించి ప్రత్యేక బృందాలను పంపిస్తున్నారన్నారు. అవసరం ఉన్న చోట ప్రజలను షెల్టర్ లకు తరలించి, భోజన సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు.

కరీంనగర్, వరంగల్ లో కొన్ని ప్రాంతాలు, ఖమ్మం జిల్లా, ఆదిలాబాద్ జిల్లాలో పెద్ద ఎత్తున వర్షాలు కురిశాయన్నారు. చాలా గ్రామాలకు రవాణా సౌకర్యాలు బంద్ అయ్యాయయన్నారు .ఇంత పెద్ద ఎత్తున తక్కువ కాలంలో వర్షం పడటం అరుదుగా జరుగుతుందన్నారు. తెగిపోయిన చెరువులు, మునిగిపోయిన పంటపొలాలు, కూలిపోయిన ఇళ్ళ విషయంలో ఇప్పటికే కలెక్టర్ ఆధ్వర్యంలో ఇరిగేషన్, వ్యవసాయ ,రెవెన్యూ అధికారులు పర్యటించి జరిగిన నష్టం అంచనాలు వేస్తున్నారన్నారు. వరద తగ్గిన తర్వాత జరిగిన నష్టంపై సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ఇప్పుడు వెంటనే ఇబ్బంది పడుతున్న ప్రజలందరికీ ఆహారం, కావలసిన సహకారాలు అందిస్తామన్నారు. రైతాంగానికి జరిగిన పంట నష్టంపై సీఎం నిర్ణయం తీసుకుంటారన్నారు.