బీఆర్ఎస్ సస్పెండ్ చేసిన కాసేపటికే కవిత బ్యానర్ దహనం

బీఆర్ఎస్ సస్పెండ్ చేసిన కాసేపటికే కవిత బ్యానర్ దహనం

హైదరాబాద్: కల్వకుంట్ల కవితను బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసిన గంటలు కూడా గడవక ముందే బీఆర్ఎస్ నాయకులు కవిత బ్యానర్ ను దహనం చేశారు. హుస్నాబాద్ మల్లె చెట్టు చౌరస్తాలో బీఆర్ఎస్ నాయకులు కవితకు వ్యతిరేకంగా ఆందోళన నిర్వహించారు. హరీశ్ రావుపై కవిత చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ బీఆర్ఎస్ నాయకులు ఆమె బ్యానర్ ను దహనం చేశారు. కవిత బీజేపీ నాయకులకు అమ్ముడు పోయినట్లు వ్యవహరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ నాయకులను కించపరిచేలా ప్రవర్తిస్తే సహించబోమని కవితను బీఆర్ఎస్ నాయకులు హెచ్చరించారు. 

ఎమ్మెల్సీ కవితను బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. సస్పెండ్ చేస్తూ బీఆర్ఎస్ అధికారికంగా ఒక నోట్ కూడా విడుదల చేసింది. బీఆర్ఎస్ పార్టీ అధికారిక ‘ఎక్స్’ ఖాతాలో ఈ లేఖను పోస్ట్ చేసింది. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీగా కొనసాగుతున్న కవితకు, ఆ పార్టీకి కొంత కాలంగా గ్యాప్ పెరిగింది. ముఖ్యంగా బీఆర్ఎస్లో కీలకంగా ఉన్న కేటీఆర్, హరీష్ రావు, సంతోష్లతో అస్సలు పొసగడం లేదని తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చ నడిచింది.

బీఆర్ఎస్లోని అంతర్గత వ్యవహారాలపై కవిత బహిరంగంగానే విమర్శలు చేస్తూ వచ్చారు. బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేసేందుకు ప్రయత్నాలు జరిగాయని ఆమె చేసిన ఆరోపణలు గులాబీ పార్టీలో గుబులు రేపాయి. హరీష్ రావు, సంతోష్ అవినీతి అనకొండలని.. ఈ ఇద్దరి వెనుక రేవంత్ రెడ్డి ఉన్నాడని కవిత చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ పార్టీలో పెను దుమారం రేపాయి. కాళేశ్వరం అవినీతి మరక తన తండ్రి కేసీఆర్ కు అంటడానికి హరీష్ రావు, సంతోష్ కారణమని కవిత చేసిన వ్యాఖ్యలతో బీఆర్ఎస్ అధిష్టానం ఆమెపై వేటు వేసింది.