- గ్రామ, మండల, బ్లాక్ కమిటీలకు కొత్త ముఖాలు
- మండల స్థాయి లీడర్లకు ప్రమోషన్లు
- వారంలో పూర్తి స్థాయి కమిటీల ఏర్పాటు
నాగర్కర్నూల్, వెలుగు : జిల్లా కాంగ్రెస్ కమిటీలకు పూర్తిస్థాయిలో కొత్త కార్యవర్గాన్ని నియమించేందుకు కసరత్తు మొదలైంది. ఇటీవల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులను టీపీసీసీ నాయకత్వం నియమించింది. నాగర్కర్నూల్ డీసీసీ అధ్యక్షుడు, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్వంశీకృష్ణ అమెరికా పర్యటనలో ఉండటంతో గడువులోగా కమిటీ ఎంపిక పూర్తి కాలేదు. మూడు రోజుల క్రితం అమెరికా నుంచి తిరిగొచ్చిన ఆయన ఈ వారంలో పూర్తిస్థాయి కమిటీ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. మున్సిపోల్స్ కు ముందే గ్రామ, మండల, బ్లాక్, డీసీసీ కమిటీతోపాటు అనుబంధ విభాగాలకు కమిటీల నియామకం పూర్తి చేస్తామన్నారు.
డీసీసీలో ప్లేస్కోసం పైరవీలు..
కాంగ్రెస్అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో జిల్లా కాంగ్రెస్ కమిటీ ఏర్పాటు చేస్తున్నారు. మండల పార్టీ అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, జిల్లా ప్రధాన కార్యదర్శులు, జిల్లా అధికార ప్రతినిధుల పదవులకు డిమాండ్ పెరిగింది. జిల్లా కాంగ్రెస్అధ్యక్ష బాధ్యతలు నిర్వహిస్తున్న అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ మండల పార్టీ అధ్యక్షుల నియామకం కోసం ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు సూచించిన పేర్లను దాదాపుగా ఫైనల్ చేశారు.
డీసీసీలోఎంత మందికి స్థానం..
జిల్లా కాంగ్రెస్కమిటీలో ఆరుగురు ఉపాధ్యక్షులు, 12 మంది ప్రధాన కార్యదర్శులు, 30 మంది కార్యదర్శులు, 30 మంది సహాయ కార్యదర్శులు, కోశాధికారిని నియమిస్తారు. ఆరుగురు బ్లాక్ కాంగ్రెస్అధ్యక్షులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళా, కిసాన్, సేవాదళ్ విభాగాలకు సభ్యులను ఎంపిక చేస్తారు.
పాత అధ్యక్షులకు ప్రమోషన్...
గతంలో మండల పార్టీ అధ్యక్షులుగా పనిచేసిన వారిని జిల్లా కాంగ్రెస్ కమిటీలోకి ప్రమోట్ చేస్తామని డాక్టర్వంశీకృష్ణ తెలిపారు. మండల పార్టీ అధ్యక్షులతోపాటు మండల వర్కింగ్ ప్రసిడెంట్లను నియమిస్తారు. దాదాపు 120 మందితో మండల, బ్లాక్, డీసీసీ ఏర్పాటు అవుతుంది. ప్రజాప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత నూతన కమిటీ సభ్యులపై ఉంటుంది.
