గుడిహత్నూర్ లో అంగట్లో అంగన్‌వాడీ గుడ్లు

గుడిహత్నూర్ లో అంగట్లో అంగన్‌వాడీ గుడ్లు

గుడిహత్నూర్, వెలుగు: అంగన్‌వాడీల ద్వారా గవర్నమెంట్‌ గర్భిణులు, బాలింతలు, చిన్నారుల కోసం సప్లయ్‌ చేస్తున్న గుడ్లు పర్యవేక్షణ లేక పక్కదారి పడుతున్నాయి. గుడ్లను లబ్ధిదారులకు అందించకుండా మార్కెట్లో అమ్ముకుంటున్నారు. గుడ్లపై స్టాంపులు వేస్తున్నప్పటికీ ఆ గుడ్లు ఓ కిరాణా దుకాణంలో దర్శనమిచ్చాయి. గుడిహత్నూర్‌ మండల కేంద్రం వడ్డెర కాలనీకి చెందిన ఓ మహిళ అక్కడి  కిరాణా షాపులో గుడ్లు కొనుగోలు చేయగా.. దుకాణాదారుడు అంగన్‌వాడీ స్టాంపు ఉన్న గుడ్లు ఇచ్చాడు. 

దీంతో ఈ గుడ్లు ఎక్కడివంటూ సదరు మహిళ ఆ దుకాణదారున్ని నిలదీసింది. దీంతో పలువురు మహిళలు అక్కడికి చేరుకొని గత కొన్ని రోజులుగా తమకు గుడ్లు అందడం లేదని, కిరాణా షాపులో అమ్మకానికి ఎలా వచ్చాయని ప్రశ్నించారు. విషయం తెలుసుకున్న ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ పద్మ అక్కడికి చేరుకొని దుకాణదారుడిని వాకబు చేసింది. అంగన్‌వాడీలు, ఆయాలు సమ్మెలో ఉన్నారని.. జరిగిన ఘటనపై పూర్తి విచారణ జరిపి ఆఫీసర్లకు నివేదిక అందించి తగిన చర్యలు తీసుకుంటామని సూపర్‌వైజర్‌ తెలిపారు.