ఈద్ ముబారక్: భక్తి శ్రద్ధలతో రంజాన్ ప్రార్థనలు

ఈద్ ముబారక్: భక్తి శ్రద్ధలతో రంజాన్ ప్రార్థనలు

నెలవంక దర్శనమివ్వటంతో… రంజాన్ సంబరాల్లో మునిగిపోయారు ముస్లింలు. మసీదులు ప్రత్యేక అలంకరణలతో కళకళలాడుతున్నాయి. చిన్నా.. పెద్ద అందరూ.. ఈద్ ను ఘనంగా జరుపుకొంటున్నారు..రంజాన్ ముస్లింలకు పవిత్రమైన నెల. చాంద్రమాన కేలండర్ ప్రకారం తొమ్మిదో నెల. ఈ నెలలోనే పవిత్ర ఖురాన్ భువిపై అవతరించిందని చెబుతారు. నెలంతా ఉపవాస దీక్షలతో ఉన్న ముస్లీంలు చివరి రోజు నెలవంక దర్శనమివ్వటంతో ఈద్ ను జరుపుకొంటున్నారు.

రంజాన్ సందర్భంగా జకాత్, ఫిత్రాలను నిర్వహిస్తారు ముస్లీంలు. పేదరికంలో ఉన్న వారికి సాయం చేయడమే వీటి లక్ష్యం. ఈద్  రోజు…. బంధుమిత్రులతో పాటు ఇతర మతాలకు చెందిన వారిని కూడా  ఇళ్లకు ఆహ్వానిస్తారు. సేమ్యా, షీర్ ఖుర్మా వంటి ఫుడ్ ఐటమ్స్ తో నోరు తీపి చేస్తారు. మత సామరస్యాన్ని చాటుతారు.

రంజాన్ పండుగ సందర్భంగా అర్ధరాత్రి వరకు షాపింగ్ చేశారు…. ముస్లీంలు. షాపింగ్ లతో చార్మినార్, మక్కా మసీద్ ప్రాంతాలలో సందడి నెలకొంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు పోలీసులు.

రంజాన్ సందర్భంగా ఈద్గాలు, మసీదులు ప్రత్యేక ప్రార్థనలతో సందడిగా మారాయి. చారిత్రక ఈద్గా మీరాలం, మాదన్నపేట ఈద్గా ఖదీమ్, గోల్కొండ, శేరిలింగంపల్లి, మక్కా మసీదు, నాంపల్లిలోని షాహీ మస్జీద్  బాగేమాలతో పాటు సుమారు 120 మసీదులను సుందరంగా అలంకరించారు. ఈద్  ప్రార్థనల సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

నగరంలోని ఈద్గాల దగ్గర GHMC అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మీరాలం ఈద్గా, మక్కా మసీదు దగ్గర ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టారు. పోలీసు శాఖ సమన్వయంతో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు చేపడుతున్నారు.