
- 8 మంది అనుమానితుల అరెస్టు
చెన్నై: బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) తమిళనాడు చీఫ్ కె.ఆర్మ్‌స్ట్రాంగ్(52) హత్య కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. హత్య జరిగిన మూడు గంటల్లోనే ఎనిమిది మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నామని చెన్నై పోలీసు కమిషనర్ సందీప్ రాయ్ రాథోడ్ మీడియాకు శనివారం వెల్లడించారు. ఆర్మ్‌స్ట్రాంగ్ హత్య వెనక రాజకీయ కోణంలేదని చెప్పారు. దీన్ని ప్రతీకార హత్యగా అనుమానిస్తున్నట్లు తెలిపారు.
అయినప్పటికీ, అన్ని కోణాల్లో దర్యాప్తు జరుపుతామని వివరించారు. కేసు దర్యాప్తులో భాగంగా10 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని, అధికారులు వివిధ కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నారని వెల్లడించారు. అదుపులోకి తీసుకున్న వారిలో చాలామందిపై కేసులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. అసలైన నిందితులకు శిక్ష పడేలా అన్ని ప్రయత్నాలు చేస్తామన్నారు.
అసలేం జరిగిందంటే..
చెన్నై పెరంబూర్‌లో నివాసం ఉంటున్న ఆర్మ్ స్ట్రాంగ్.. శుక్రవారం రాత్రి 7.15 గంటలకు తన ఇంటి ముందు నిలబడి ఉన్నారు. అక్కడికి వచ్చిన కొందరు దుండగులు ఆయనపై కత్తితో దాడిచేసి పారిపోయారు. స్థానికులు వెంటనే ఆర్మ్ స్ట్రాంగ్‌ను అపోలో ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆయన ట్రీట్మెంట్ పొందుతూ కన్నుమూశారు. ఆర్మ్ స్ట్రాంగ్ తో పాటు ఉన్న మరో ఇద్దరిపై కూడా దాడి జరిగినట్లు తెలుస్తోంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. సీసీటీవీ ఫుటేజీలు, సెల్ ఫోన్ టవర్ లొకేషన్, ప్రత్యక్ష సాక్షుల ఆధారంగా ఎనిమిది మందిని అరెస్టు చేశారు.