కరోనా ఐసోలేషన్ సెంటర్ నుంచి ఆరుగురు కరోనా రోగులు, ఇద్దరు కరోనా అనుమానితులు పరారయ్యారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఈ సంఘటన జరిగింది. రాజేంద్రనగర్ లో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ సెంటర్ లో బుధవారం రాత్రి ఆస్పత్రి సిబ్బంది, సెక్యూరిటీ గార్డ్‌ల కళ్లుగప్పి.. గోడ దూకి పారిపోయారు. ఈ ఘటనపై సమాచారం అందించిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగిన పారిపోయిన వారి కోసం గాలిస్తున్నారు. ఈ క్రమంలో ముగ్గురు పేషెంట్లు చిక్కారు. వారిని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ముందుజాగ్రత్తగా ఆ ఆస్పత్రి ముందు సెక్యూరిటీ పెంచారు. ఆ ముగ్గురు కరోనా రోగుల్లో ఇద్దరు బీహార్‌లోని సమస్తిపూర్ వాసులు కాగా.. మరొకరు రాజస్థాన్‌లోని కోటాకు చెందిన వ్యక్తి ఉన్నారు. పరారీలో ఉన్న మిగిలిన ఐదు మంది కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి గాలిస్తున్నారు పోలీసులు. ఆ ఐదుగురు వ్యక్తులు యూపీలోని రాంపూర్ జిల్లాలకు చెందిన వారిగా గుర్తించారు. ఈ నేపథ్యంలో యూపీ అధికారులను సైతం అప్రమత్తం చేశారు.

