తెలంగాణలో రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 8 మంది మృతి

తెలంగాణలో రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 8 మంది మృతి
  • మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు
  • కర్నాటకలోని విజయపుర జిల్లాలో యాక్సిడెంట్
  • జోగులాంబ గద్వాలకు చెందిన దంపతులు, ఇద్దరు పిల్లలు మృతి
  • దైవ దర్శనానికి వెళ్తుండగా బస్సును ఢీకొట్టిన కారు
  • హయత్​నగర్​లో డీసీఎం, కారు ఢీకొని ముగ్గురు దుర్మరణం
  • మృతులంతా స్టూడెంట్లే

ఎల్బీనగర్/గద్వాల, వెలుగు: రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో మొత్తం 8 మంది చనిపోయారు. రంగారెడ్డి జిల్లా హయత్​నగర్​లోని కుంట్లూరులో డీసీఎం, కారు ఢీకొనడంతో ముగ్గురు మృతి చెందారు. చనిపోయినవాళ్లంతా స్టూడెంట్లే. కర్నాటకలోని విజయపుర జిల్లా మనగూలి దగ్గర జరిగిన యాక్సిడెంట్​లో జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన ఐదుగురు చనిపోయారు. మృతుల్లో ఒకే ఫ్యామిలీకి చెందిన నలుగురితో పాటు డ్రైవర్ ఉన్నారు. కర్నాటకలోని మురుడేశ్వర్ ఆలయానికి వెళ్తుండగా.. వీరు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి ప్రైవేట్ ట్రావెల్స్ ను ఢీకొట్టింది.రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ లోని కుంట్లూరు గ్రామానికి చెందిన నలుగురు స్టూడెంట్లు పిన్నింటి చంద్రసేనా రెడ్డి, చుంచు త్రినాథ్ రెడ్డి, చుంచు వర్షిత్ రెడ్డి, ఎలిమేటి పవన్ కల్యాణ్ రెడ్డి మంగళవారం రాత్రి పెద్దఅంబర్ పేటలో ఓ ఫంక్షన్ కు అటెండ్ అయ్యారు. ఆ తర్వాత సిటీ శివారులోని ఓ ఫామ్ హౌజ్ కు వెళ్లారు.

 రాత్రి అక్కడే బస చేశారు. బుధవారం  తెల్లవారుజామున కుంట్లూరు నుంచి పసుమాముల వైపు వెళ్తున్న డీసీఎం వ్యాన్, కారు నారాయణ కాలేజ్ సమీపంలో ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో త్రినాథ్ రెడ్డి (24), చుంచు వర్షిత్ రెడ్డి (23), చంద్రసేనా రెడ్డి (24) స్పాట్​లోనే చనిపోయారు. తీవ్రంగా గాయపడిన పవన్​కల్యాణ్ రెడ్డిని స్థానికులు హాస్పిటల్​కు తరలించారు. మృతులంతా ఇంటికి ఒకరే కొడుకులు. దీంతో కుంట్లూరు గ్రామంలో విషాదం నెలకొన్నది. వీళ్లంతా ఇటీవలే చదువులు పూర్తి చేసుకుని వ్యాపారాలు చేస్తున్నారు. తమ పిల్లలు మృతి చెందారన్న విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అయ్యారు. గాయపడిన పవన్ కల్యాణ్ రెడ్డి హెల్త్ కండీషన్ సీరియస్​గా ఉన్నట్లు సమాచారం. 

మృతుల కుటుంబాలకు మంత్రి పరామర్శ

మృతుల కుటుంబ సభ్యులను మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పరామర్శించారు. డెడ్​బాడీల వద్ద నివాళులర్పించారు. తల్లిదండ్రులను ఓదార్చి ధైర్యం చెప్పారు. ‘‘కారు నడిపేటప్పుడు ప్రతి ఒక్కరు సీటు బెల్టు పెట్టుకోవాలి. యువకులు ఓవర్ స్పీడ్​గా వెళ్లొద్దు. ఇంటి వద్ద ఉన్న పేరెంట్స్ గురించి ఆలోచించాలి. తల్లిదండ్రులకు కడుపుకోత మిగల్చొద్దు’’అని వెంకట్​రెడ్డి అన్నారు. రాష్ట్ర రోడ్డు డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్ రెడ్డి రాంరెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్​రెడ్డి రంగారెడ్డి, మాజీ కౌన్సిలర్ శ్రీనివాస్ గౌడ్ మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు.

జోగులాంబ గద్వాల జిల్లాలో విషాదం

జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం మల్లెందొడ్డి గ్రామానికి చెందిన భాస్కర్.. ఫ్యామిలీతో సహా కొన్నేండ్ల కిందే గద్వాల టౌన్ లోని బీసీ కాలనీకి షిఫ్ట్ అయ్యాడు. కర్నాటక కుర్తికిలోని కెనరా బ్యాంకులో క్యాషియర్​గా పని చేస్తున్నాడు. ఇటీవలే ఆయనకు హైదరాబాద్ ట్రాన్స్​ఫర్ అయింది. బుధవారం తెల్లవారుజామున భాస్కర్.. తన భార్య పవిత్ర, కొడుకులు అభిరామ్, ప్రవీణ్, కూతురు  జ్యోత్స్నతో కలిసి కర్నాటకలోని మురుడేశ్వర్ ఆలయానికి బయల్దేరాడు.

 విజయపుర జిల్లాలోని మనగూలికి చేరుకున్నారు. తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో వీరు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భాస్కర్ (40), పవిత్ర (38), అభిరామ్ (12), జ్యోత్స్న (14), డ్రైవర్ శివప్ప స్పాట్​లోనే చనిపోయారు. పదేండ్ల ప్రవీణ్​కు తీవ్ర గాయాలు కావడంతో అతన్ని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఒకే కుటుంబంలో నలుగురు చనిపోవడంతో గద్వాల టౌన్​లోని బీసీ కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి.