8 మంది మావోయిస్టుల లొంగుబాటు..రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా వెల్లడి

8 మంది మావోయిస్టుల లొంగుబాటు..రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా వెల్లడి

గోదావరిఖని, వెలుగు : తెలంగాణ, చత్తీస్ గఢ్ కు చెందిన మిలీషియా, కొరియర్, సాంస్కృతిక విభాగం, లోకల్ కమిటీకి చెందిన 8 మంది మావోయిస్టులు శనివారం గోదావరిఖనిలో రామగుండం పోలీస్​కమిషనర్​అంబర్​ కిషోర్​ఝా ఎదుట లొంగిపోయారు. 

వీరిలో జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం చెగ్యాం గ్రామానికి చెందిన ధర్మాజీ శ్రీకాంత్,​ చత్తీస్ గఢ్​ లోని బీజాపూర్​ జిల్లా గంగులూరు పీఎస్ పరిధి గంపూర్​గ్రామానికి చెందిన పోడియం కమురు, ముడియం జోగ, ముడియం భీమా, కుంజుం ఉంగా, ముడియం సుక్రం, ముడియం మంగు, కుంజం లక్కె ఉన్నారు.

 2019 నుంచి ధర్మాజీ శ్రీకాంత్​మావోయిస్టు కొరియర్​ఉన్నారు. 2024లో వాజేడు పోలీసులు అరెస్ట్​ చేయగా, 2025 మార్చిలో జైలు నుంచి విడుదలయ్యాడు. మళ్లీ మావోయిస్టు పార్టీలో చేరి మెంబర్​గా పదోన్నతి పొందాడు. ఈయన తెలంగాణకు చెందిన కీలకనేతలు కంకణాల రాజిరెడ్డి, ఆజాద్​, దామోదర్​కు కొరియర్​గా వ్యవహరించాడు. 

పొడియం కమురు మిలీషియా కమాండర్​గా ఉండి, కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం పీఎస్ పరిధిలో 2024లో అరెస్ట్​అయ్యాడు. 2025 మార్చిలో విడుదలై తిరిగి మావోయిస్టు కార్యకలాపాల్లో పాల్గొన్నాడు. మిగిలిన ఆరుగురు చేతన నాట్య మండలి, మిలీషియా, జంగిల్​ కమిటీ మెంబర్లుగా, స్థానికంగా సమాచార సేకరణలో కొరియర్లుగా వ్యవహరించారు. రివార్డు కింద వీరికి రూ.25 వేల చొప్పున నగదు చెక్కులను సీపీ అంబర్​కిషోర్​ఝా అందించారు.