మహారాష్ట్ర సీఎంగా ఏక్ నాథ్ షిండే

మహారాష్ట్ర సీఎంగా ఏక్ నాథ్ షిండే

ఉత్కంఠ వీడింది. కొన్ని రోజులుగా కొనసాగుతున్న హై డ్రామాకు తెరపడింది.  మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రి ఎవరన్నది తేలిపోయింది. శివసేన రెబల్ నేత ఏక్నాథ్ షిండే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ రోజు రాత్రి 7.30గంటలకు గవర్నర్ కోశ్యారీ ఆయనతో ప్రమాణం చేయించనున్నారు. ఇవాళ కేవలం షిండే మాత్రమే ప్రమాణస్వీకారం చేస్తారని బీజేపీ నేత, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ప్రకటించారు. త్వరలోనే చర్చించి కేబినెట్ కూర్పుపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. వాస్తవానికి దేవేంద్ర ఫడ్నవిస్ సీఎంగా బాధ్యతలు చేపడతారని ప్రచారం జరిగింది. అయితే అనూహ్యంగా షిండే తెరపైకి వచ్చారు. 

ప్రభుత్వానికి బయటి నుంచి మద్దతు: ఫడ్నవీస్
గవర్నర్ ను కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఫడ్నవీస్..2019లో బీజేపీ, శివసేన కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆశించామని అన్నారు. అయితే ఉద్దవ్ ఠాక్రే మాత్రం కాంగ్రెస్ తో జతకట్టారని వాపోయారు. బాల్ ఠాక్రే సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఉద్ధవ్ ఠాక్రే వ్యవహరించారని, ఆయన సొంత పార్టీ ఎమ్మెల్యేల కన్నా ఎన్సీపీ, కాంగ్రెస్ నేతల మాటలకే ప్రాధాన్యం ఇచ్చారని అన్నారు. ఆ కారణంగానే ఎమ్మెల్యేలు తమ గళాన్ని బలంగా వినిపించారని, దాన్ని తిరుగుబాటు అనలేమని స్పష్టం చేశారు. ఏక్ నాథ్ షిండేకు తమ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని తేల్చి చెప్పారు. ప్రభుత్వానికి బయట నుంచే మద్దతు ఇస్తామని ఫడ్నవీస్ స్పష్టం చేశారు. మహా వికాస్ అఘాడీ ప్రభుత్వ పాలనలో రెండున్నరేళ్లుగా బ్రేకులు పడిన అభివృద్ధి ఇప్పుడు ఎక్స్ ప్రెస్ వేగంతో పరుగులు పెడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 

బాల్ ఠాక్రే ఆలోచనలు ముందుకు తీసుకెళ్తాం : ఏక్ నాథ్ షిండే
శివసేనకు చెందిన 40 మందితో పాటు స్వతంత్రులతో కలుపుకొని మొత్తం 50 మంది ఎమ్మెల్యేలు ఒక్కటిగా ఉన్నామని ఏక్ నాథ్ షిండే ప్రకటించారు. తమకు ఎలాంటి స్వార్థం లేదని, బాల్ ఠాక్రే ఆలోచనలు ముందుకు తీసుకెళ్తామని చెప్పారు. పదవుల కోసం తాము ఈ నిర్ణయం తీసుకోలేదని షిండే అన్నారు. రాష్ట్ర ప్రజలుఎదుర్కొంటున్న సమస్యల గురించి ఎన్నిసార్లు ఉద్ధవ్ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. బాల్ ఠాక్రే శివ సైనికులకు మద్దతిస్తామన్న దేవేంద్ర ఫడ్నవీస్ కు షిండే ధన్యవాదాలు తెలిపారు. 120 మంది సభ్యుల మద్దతున్నా ముఖ్యమంత్రి పదవి వదులుకోవడం సాధారణ విషయం కాదని ప్రశంసించారు. ప్రధాని మోడీ, అమిత్ షా, నడ్డాలకు కృతజ్ఞతలు తెలిపిన ఏక్ నాథ్ షిండే తనను నమ్మిన ఎమ్మెల్యేలకుఎలాంటి నష్టం కలగకుండా చూసుకుంటానని మాట ఇచ్చారు.