
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే ఎడ్యుకేషనల్ టెక్నాలజీ కంపెనీ ఏకలవ్య టీచర్స్ డే సందర్భంగాభారతదేశంలో మొట్టమొదటి ఎడ్యుకేషనల్ ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌ను ప్రారంభించింది. ఈ ప్లాట్‌ఫారమ్ ఆన్‌లైన్ లెర్నింగ్‌ను కొత్త స్థాయికి తీసుకువెళ్తుందని కంపెనీ తెలిపింది. టైమ్, ఆహాగురు వంటి ప్రముఖ విద్యా సంస్థల కంటెంట్‌తో పాటు, ఏకలవ్య సొంత కంటెంట్‌ను కూడా ఒకే సబ్‌స్క్రిప్షన్‌తో అందిస్తుంది.
సాధారణ ఎడ్-టెక్ విధానాలకు భిన్నంగా, విద్యార్థులు తమకు నచ్చిన గ్రేడ్, సబ్జెక్ట్, చాప్టర్‌లను తమకు ఇష్టమైన కంటెంట్ పార్ట్‌నర్ నుంచి ఎంచుకోవచ్చు. ఇది ‘నెట్‌ఫ్లిక్స్’ కాన్సెప్ట్‌ను పోలి ఉంటుంది. విద్యార్థి తమ ప్రస్తుత గ్రేడ్ కాన్సెప్ట్‌లలో బలహీనంగా ఉంటే, గత గ్రేడ్ పాఠాలను తిరిగి నేర్చుకునే అవకాశం ఉంటుంది.
ఏకలవ్య చైర్మన్ సంతోష్ రెడ్డి మాట్లాడుతూ, ఒక విద్యార్థి ప్రతిభను అతని పిన్‌కోడ్ నిర్ణయించకూడదని, దేశంలోని అత్యుత్తమ ఉపాధ్యాయుల బోధన ప్రతి విద్యార్థికి అందుబాటులో ఉంటుందని తెలిపారు. ప్రతి వీడియోను 16 దశల ప్రక్రియ ద్వారా రూపొందిస్తారు.
పరిశోధన, స్క్రిప్టింగ్, ఎడిటింగ్, యానిమేషన్ వంటి వాటిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. సీటీఓ నటరాజు మాట్లాడుతూ, నిరంతర వీడియో స్ట్రీమింగ్ కోసం గ్లోబల్ సీడీఎన్, అడాప్టివ్ బిట్‌రేట్ స్ట్రీమింగ్‌ను ఉపయోగిస్తున్నామని తెలిపారు. విద్యార్థుల డేటా, కంటెంట్ రక్షణకు సురక్షితమైన మార్గాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రతి విద్యార్థికి ప్రపంచ స్థాయి విద్యను అందుబాటు ధరలో, మెరుగైన నాణ్యతతో అందించడమే తమ లక్ష్యమని ఏకలవ్య వ్యవస్థాపకులు తెలిపారు.