పొలంలో మంటలు ఆర్పబోయి.. వృద్ధుడు సజీవ దహనం..మంచిర్యాల జిల్లా తిమ్మాపూర్ లో ఘటన

పొలంలో మంటలు ఆర్పబోయి.. వృద్ధుడు సజీవ దహనం..మంచిర్యాల జిల్లా తిమ్మాపూర్ లో ఘటన

జన్నారం రూరల్, వెలుగు: మంచిర్యాల జిల్లా జన్నారం మండలం తిమ్మాపూర్​ గ్రామంలో మంగళవారం మంటలను ఆర్పబోయి ఓ వృద్ధుడు సజీవ దహనమయ్యాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రేగుంట పోశం(70) తన పొలం పక్కనే ఉన్న వరి కొయ్యలకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టగా మంటలను ఆర్పే క్రమంలో ప్రమాదవశాత్తు గట్టుపై నుంచి మంటల్లో పడిపోయాడు. మంటల్లో నుంచి బయటకు రాలేక అక్కడికక్కడే చనిపోయాడు. మృతుడి కొడుకు రేగుంట ప్రదీప్​ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. 

కాలిన గాయాలతో చికిత్స పొందుతూ..

సుల్తానాబాద్: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్  మండలం మియాపూర్  గ్రామంలో మంటలు ఆర్పేందుకు వెళ్లి గాయపడిన తోటపల్లి పోచయ్య(63) చనిపోయాడు. గత నెల 29న వరి కొయ్యలను గుర్తు తెలియని వ్యక్తులు తగులబెట్టగా, మంటలు పోచయ్య పొలంలోకి వ్యాపించాయి. 

మంటలను ఆర్పేందుకు యత్నించిన అతడు మంటలు అంటుకొని తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు పోచయ్యను సుల్తానాబాద్  ప్రభుత్వ ఆసుపత్రికి, అక్కడి నుంచి కరీంనగర్ కు షిఫ్ట్  చేశారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం చనిపోయాడు. మృతుడి భార్య వజ్రమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చంద్రకుమార్  తెలిపారు.