
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల ఉద్యోగుల వేతనాల నుంచి వృద్ధ తల్లిదండ్రుల ఖాతాల్లో నేరుగా డబ్బు జమచేసే ఆలోచనను ప్రస్తావించారు. అయితే, ఈ ఆలోచన ఒక చిన్న పరిష్కారం మాత్రమే. వాస్తవానికి దేశంలో, ముఖ్యంగా తెలంగాణలో ఎందరో వృద్ధులు ఆకలితో, ఒంటరితనంతో, నిస్సహాయతతో అలమటిస్తున్నారు. వారికి కేవలం ఆర్థిక సహాయం కాదు, అంతకుమించి ప్రభుత్వ ఆసరా, అండ కావాలి. ఈ విపత్కర పరిస్థితుల్లో, ముఖ్యమంత్రే రాష్ట్రంలోని వృద్ధులందరికీ 'పెద్ద కొడుకు'గా మారి, ప్రజా సంక్షేమంలో కొత్త ఒరవడిని సృష్టించాలి.
భారతదేశంలో వృద్ధ జనాభా వేగంగా పెరుగుతోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం, దేశంలో దాదాపు 10.4 కోట్ల మంది వృద్ధులు (60 ఏండ్లు పైబడినవారు) ఉండగా, 2021 నాటికి ఈ సంఖ్య 13.8 కోట్లకు చేరినట్టు అంచనా. తెలంగాణ విషయానికి వస్తే, 2011లో 30 లక్షల మందికి పైగా వృద్ధులు ఉండగా, ఈ దశాబ్దంలో ఆ సంఖ్య గణనీయంగా పెరిగి ఉంటుందని భావిస్తున్నారు. ఈ వృద్ధుల్లో చాలామందికి ఆర్థిక భద్రత లేదు. ఉద్యోగ విరమణ తర్వాత పెన్షన్ లేనివారు, పిల్లల నిర్లక్ష్యానికి గురైనవారు, ఎటువంటి ఆస్తులు లేనివారు నిత్యం ఆకలితో, అనారోగ్యాలతో పోరాడుతున్నారు. పల్లెల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది.
వృద్ధాప్యం, అనారోగ్యం కారణంగా పనిచేయలేని వారు, ఒంటరిగా నివసించేవారు కనీసం పూట గడవక పస్తులు ఉంటున్నారు. కొడుకులున్నప్పటికీ, నలుగురిలో గౌరవంగా బతకలేకపోతున్నామని, వారి నిర్లక్ష్యానికి గురై మానసిక క్షోభ అనుభవిస్తున్నామని ఎందరో వృద్ధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పట్టణాల్లోనైతే, పిల్లలు వేరే ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసుకుంటూ తల్లిదండ్రులను ఒంటరిగా వదిలేయడం సర్వసాధారణంగా మారింది.
వారికి తోడులేక, సరైన వైద్యం అందక, ఒక్కపూట అన్నం కోసం కూడా ఇతరులపై ఆధారపడాల్సిన దుస్థితి నెలకొంది. పాతగృహాలలో ఒంటరిగా జీవనం సాగించే వృద్ధులు, ఎవరైనా వచ్చి ఒక గ్లాసు నీళ్లు ఇచ్చేవారైనా లేరని చెప్పే మాటలు మనసును కలచివేస్తాయి. ఈ దుర్భర పరిస్థితుల వెనుక ఆర్థిక కారణాలతోపాటు, కుటుంబ బంధాలు బలహీనపడడం, పాశ్చాత్య సంస్కృతి ప్రభావం, నైతిక విలువలు లోపించడం వంటివి ప్రధాన కారణాలు.
సీఎం పెద్ద కొడుకుగా మారాల్సిన ఆవశ్యకత
ఈ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వంటి నాయకులు వృద్ధుల సంక్షేమానికి మరింత విస్తృతమైన, మానవీయ కోణంలో ఆలోచించడం అత్యవసరం. వేతనాల్లో కొంతశాతం తల్లిదండ్రుల ఖాతాల్లో జమ చేయడం అనేది ఒక చిన్నపాటి ఊరట మాత్రమే. అంతకంటే మిన్నగా, ప్రభుత్వమే వృద్ధులందరికీ పెద్ద కొడుకుగా మారాలి. వారి బాధ్యతను స్వీకరించాలి. దీనికోసం, కొన్ని విప్లవాత్మకమైన పథకాలు, చర్యలు తీసుకోవాలి.
గ్రామానికొక ఆదర్శ వృద్ధాశ్రమం: అనాథ వృద్ధులు, నిరాశ్రయులైన పేద తల్లిదండ్రుల కోసం ప్రతి గ్రామంలో లేదా కనీసం ప్రతి మండలంలో ఒక ఆదర్శ వృద్ధాశ్రమాన్ని ప్రభుత్వమే నిర్మించాలి. ఈ ఆశ్రమాలు కేవలం ఆశ్రయం కల్పించడమే కాకుండా, వారికి నాణ్యమైన ఆహారం, వైద్య సంరక్షణ, మానసిక ఉల్లాసం కోసం వినోద కార్యక్రమాలు, ఆధ్యాత్మిక వాతావరణాన్ని అందించాలి. ఈ ఆశ్రమాలను స్వచ్ఛంద సంస్థలు, స్థానిక ప్రజల భాగస్వామ్యంతో నిర్వహించాలి.
ప్రత్యేక వృద్ధాప్య పింఛన్ పథకం: ప్రస్తుతం ఉన్న వృద్ధాప్య పింఛన్లను పెంచి, ద్రవ్యోల్బణానికి అనుగుణంగా ప్రతి సంవత్సరం పెరిగేవిధంగా ఒక పటిష్టమైన వ్యవస్థను రూపొందించాలి. ఏ వృద్ధుడు కూడా ఆకలితో అలమటించకుండా, కనీస జీవన ప్రమాణాలు అందుకునేలా ఈ పింఛన్ ఉండాలి.
ఉచిత వైద్య సేవలు, ఆరోగ్య బీమా: వృద్ధులందరికీ ఉచిత ఆరోగ్య బీమా పథకాన్ని విస్తృతపరచాలి. వారికి అవసరమైన మందులు, ఆసుపత్రి ఖర్చులు, శస్త్రచికిత్సలు ప్రభుత్వమే భరించాలి. ప్రతి జిల్లా ఆసుపత్రిలో వృద్ధుల కోసం ప్రత్యేక వార్డులు, వైద్య నిపుణులను నియమించాలి.
మానసిక మద్దతు కేంద్రాలు: ఒంటరిగా జీవించే వృద్ధుల కోసం గ్రామస్థాయిలో మానసిక మద్దతు కేంద్రాలను ఏర్పాటు చేయాలి. ఇందులో కౌన్సెలర్లు, సామాజిక కార్యకర్తలు వారి సమస్యలను విని, మానసిక ధైర్యాన్ని అందించాలి. తరచుగా వారిని సందర్శించి, యోగక్షేమాలు తెలుసుకునే వ్యవస్థను ఏర్పాటు చేయాలి.
సామాజిక భద్రతా దళాలు: వృద్ధుల పట్ల నిర్లక్ష్యం, హింస జరిగితే వెంటనే స్పందించేలా ఒక ప్రత్యేక సామాజిక భద్రతా దళాన్ని ఏర్పాటు చేయాలి. ఇది వృద్ధుల ఫిర్యాదులను స్వీకరించి, అవసరమైన చర్యలు తీసుకునేలా చూడాలి. ఈ దళానికి చట్టపరమైన అధికారాలు ఉండాలి. కాగా, సమాజంలో పెద్దలను గౌరవించడం, తల్లిదండ్రుల బాధ్యత గురించి బుద్ధుడి బోధనలు, ఇతర మహనీయుల ఇతిహాసాల నుంచి విద్యాలయాల్లో బోధించాలి. ఇది విలువలను పెంపొందించడంలో సహాయపడుతుంది.
ప్రజా సంక్షేమంలో కొత్త ఒరవడి తేవాలి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చూపిన ఈ ఆలోచన ఒక చిన్న ముందడుగు మాత్రమే. దీనిని ఒక మహోద్యమంగా మార్చి వృద్ధుల సంరక్షణను ప్రభుత్వ ప్రధాన లక్ష్యాలలో ఒకటిగా చేయాలి. ఈ చర్యలు కేవలం వృద్ధులకు మేలు చేయడమే కాకుండా, ప్రజా సంక్షేమంలో ఒక కొత్త ఒరవడిని సృష్టిస్తాయి. ఇది ప్రభుత్వానికి ప్రజల్లో మంచిపేరు తీసుకురావడమే కాకుండా, భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలుస్తుంది.
తమ జీవితాలను దేశంకోసం, కుటుంబం కోసం ధారపోసిన వృద్ధులను గౌరవంగా చూసుకోవడం కనీస ధర్మం. ముఖ్యమంత్రి నిజంగా రాష్ట్రానికి పెద్ద కొడుకుగా మారాలనుకుంటే కేవలం ఆర్థిక సహాయం గురించి కాకుండా, వృద్ధుల ఆత్మగౌరవాన్ని, మానసిక ప్రశాంతతను కాపాడే సమగ్ర పథకాలను రూపొందించాలి. అప్పుడే ఏ తల్లిదండ్రులు కూడా తమ కన్నబిడ్డల నిర్లక్ష్యానికి గురై, ఆకలితో, ఆవేదనతో అలమటించకుండా, గౌరవంగా, సంతోషంగా జీవించగలుగుతారు. ఇది నిజమైన ప్రజా సంక్షేమ రాజ్య స్థాపనకు పునాది వేస్తుంది.
- మేకల ఎల్లయ్య, సీనియర్ జర్నలిస్ట్