
- మా భూములను అక్రమంగా పట్టా చేయించుకున్నారు
- న్యాయం చేయాలని గ్రీవెన్స్‌లో ఆఫీసర్లను వేడుకున్న వృద్ధులు
మంచిర్యాల/కాగజ్‌నగర్, వెలుగు : ‘మేము బతికుండగానే చనిపోయినట్లు ఫేక్ సర్టిఫికెట్లు తయారు చేసి మా భూములు పట్టా చేసుకున్నరు.. మా భూములు మాకు ఇప్పించి న్యాయం చేయండి’ అంటూ ఇద్దరు వృద్ధులు సోమవారం గ్రీవెన్స్‌లో కలెక్టర్లకు మొర పెట్టుకున్నారు. ఈ ఘటనలు మంచిర్యాల కలెక్టరేట్, కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ ఆఫీస్ వద్ద జరిగాయి. వివరాల్లోకి వెళ్తే... మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం గద్దెరాగడికి చెందిన కుర్మ రామక్కకు పిల్లలు పుట్టకపోవడంతో ఆమె భర్త మల్లయ్య మరో వివాహం చేసుకున్నాడు.
ఆమెకు కొడుకు గురువయ్య, కూతురు ఉన్నారు. తన పేరిట ఉన్న పట్టా భూములను రామక్కతో పాటు రెండో భార్య సమానంగా పంచుకోవాలని మల్లయ్య పెద్దల సమక్షంలో ఒప్పంద పత్రాలు రాయించాడు. తర్వాత 2012 జూన్ 19న మల్లయ్య చనిపోయాడు. అప్పటి నుంచి రామక్క మంచిర్యాల జాఫర్‌నగర్‌లోని తన అక్క కొడుకు వద్ద ఉంటోంది. అయితే రామక్క చనిపోయిందంటూ ఫేక్ సర్టిఫికెట్ సృష్టించిన గురువయ్య తండ్రి పేరిట ఉన్న మొత్తం భూమిని తన పేరిట విరాసత్ చేయించుకున్నాడు. ఈ విషయం తెలిసిన రామక్క తన భర్త రాసిన అగ్రిమెంట్ ప్రకారం.. తనకు భూమిలో వాటా ఇవ్వాలని కోరినా గురువయ్య పట్టించుకోలేదు. దీంతో సోమవారం కలెక్టరేట్‌కు వచ్చి కలెక్టర్ కుమార్ దీపక్‌ను కలిసి.. తనకు న్యాయం చేయాలని వేడుకుంది.
కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ ఆఫీస్ ఎదుట వృద్ధురాలు ఆందోళన
తాను చనిపోయినట్లు కొందరు వ్యక్తులు ఫేక్ సర్టిఫికెట్లు సృష్టించి తన పేరిట ఉన్న భూమిని కాజేశారని ఓ వృద్ధురాలు సోమవారం కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ ఆఫీస్ ఎదుట ధర్నాకు దిగింది. ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం డబ్బా గ్రామానికి చెందిన సోంబాయికి అదే గ్రామంలో సర్వే నంబర్ 14లో 24 గుంటల భూమి ఉంది. భర్త చనిపోవడంతో ముగ్గురు కూతుళ్లతో కలిసి చింతగూడ గ్రామంలో ఉంటోంది. ఈ క్రమంలో గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు సోంబాయి భూమిని పట్టా చేయించుకున్నారు.
ఈ విషయం తెలిసిన ఆమె తన భూమిని ఇతరుల పేరున పట్టా ఎలా చేశారని ఆఫీసర్లను ప్రశ్నించగా... సోంబాయి చనిపోయినట్లు రికార్డుల్లో నమోదు కావడం వల్లే పట్టా మార్పిడి జరిగిందని ఆఫీసర్లు తెలిపారు. దీంతో సోమవారం కూతుళ్లతో కలిసి కాగజ్‌నగర్ సబ్‌కలెక్టర్ ఆఫీస్ వద్దకు చేరుకొని అక్కడే బైఠాయించింది. విషయం తెలుసుకున్న సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా వృద్ధురాలి వద్దకు వచ్చి మాట్లాడి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. వృద్ధురాలికి సీపీఎం నాయకులు ముంజం ఆనంద్ మద్దతు పలికారు.