నవంబర్​30న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు

 నవంబర్​30న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు
  • షెడ్యూల్​ను రిలీజ్​ చేసిన కేంద్ర ఎన్నికల సంఘం
  • తెలంగాణతోపాటు రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరాం, చత్తీస్​గఢ్​కు ఎన్నికలు
  • రాష్ట్రంలో 6,10,694 ఓట్ల తొలగింపు.. కొత్త ఓటర్లు 17,01,087 మంది
  • 80 ఏండ్లు పైబడినవాళ్లకు ఇంటి నుంచే ఓటు వేసే అవకాశం

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సెంట్రల్​ ఎలక్షన్​ కమిషన్​(ఈసీ) నగారా మోగించింది. తెలంగాణలో నవంబర్ 30న పోలింగ్​ జరగనుంది. డిసెంబర్​ 3న ఓట్ల లెక్కింపు ఉంటుంది. రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడ్డ తర్వాత అసెంబ్లీకి జరుగుతున్న మూడో ఎన్నిక ఇది. ప్రధాన పార్టీలు నువ్వా.. నేనా.. అన్నట్టు బరిలోకి దిగుతున్నాయి. 119 అసెంబ్లీ స్థానాలున్న తెలంగాణలో మొత్తం 3.17 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని ఈసీ వెల్లడించింది. నవంబర్​ 3న ఎన్నికల నోటిఫికేషన్​ విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు తెలంగాణతోపాటు మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరాం, చత్తీస్​గఢ్​ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్​ను ఢిల్లీలో సోమవారం చీఫ్​ ఎలక్షన్​ కమిషనర్​ (సీఈసీ) రాజీవ్ కుమార్ విడుదల చేశారు.

తెలంగాణ, రాజస్థాన్, మిజోరాం, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఎన్నికలు ఒకే దశలో నిర్వహించనున్నామని, చత్తీస్‌గఢ్ లో మాత్రం రెండు దశల్లో ఎన్నికలు ఉంటాయని ఆయన వివరించారు. ‘‘ఎన్నికల కోసం ఆరు నెలలుగా కసరత్తు చేశాం. వివిధ రాజకీయ పార్టీల నుంచి అభిప్రాయాలు సేకరించాం. ఐదు రాష్ట్రాల అధికారులు, పార్టీల నేతలతో చర్చలు జరిపాం. ఐదు రాష్ట్రాల్లో మొత్తం 679 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. దేశంలోని 1/6 వంతు(16.14 కోట్ల) మంది ఈ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. ఈ ఐదు రాష్ట్రాల్లో 60 లక్షల మంది తొలిసారి ఓటు హక్కు పొందారు. అన్ని రాష్ట్రాల్లో మహిళా ఓటర్ల సంఖ్య పెరిగింది. ఐదు రాష్ట్రాల్లో 1.77 లక్షల పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశాం’ అని ఆయన చెప్పారు. 

ఐదు రాష్ట్రాల్లో కలిపి 20,59,539 ఓట్లు తొలగించామని.. 57,89,227 మంది కొత్త ఓటర్లను జత చేశామని తెలిపారు. ఇందులో 18.37 లక్షల మంది 18- నుంచి 19 ఏండ్ల వయస్సు గల వారని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో 80 ఏండ్లు పైబడినవాళ్లకు ఇంటి నుంచి ఓటు వేసే అవకాశం కల్పించామని, ఫామ్​– డీ ద్వారా ఈ అవకాశం వినియోగించుకోవచ్చని తెలిపారు. ఐదు రాష్ట్రాల్లో వెంటనే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు. 

రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 3.17 కోట్లు

రాష్ట్రంలో 3,17,17,389 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 1.58 కోట్ల మంది పురుషులు, 1.58 కోట్ల మంది మహిళలు, 2,557 మంది థర్డ్ జెండర్లు ఉన్నారు. మొత్తం ఓటర్లలో 5,06,493 మంది దివ్యాంగులు.. 4,43,943 మంది సీనియర్ సిటిజన్స్ ఉన్నారు. 18 నుంచి 19 ఏండ్ల వయస్సు మధ్య గల వారు  3,35,043 మంది ఉన్నట్లు ఈసీ తెలిపింది. వివిధ కారణాల వల్ల 6,10,694 ఓట్లను ఈసీ తొలగించింది. కొత్తగా 17,01,087 మంది ఓటు హక్కు పొందారు. అడ్రస్ మార్పు, ఇతర కారణాల వల్ల 6,24,051 ఓట్లలో మాడిఫికేషన్స్ చేసింది. ముఖ్యంగా తెలంగాణలో చెంచు, కలం, తోటి అండ్ కొండ రెడ్డి గిరిజన జాతులకు చెందిన 39, 186 మంది కొత్త ఓటర్లు ఉండగా... 100 శాతం వీరితో ఓటర్ ఎన్ రోల్ మెంట్ చేసినట్లు ఈసీ తెలిపింది. తెలంగాణలో ఓటరు లింగ నిష్పత్తి పెరిగినట్లు సీఈసీ రాజీవ్ కుమార్ చెప్పారు.  2018 ఎన్నికల టైమ్​లో 982 గా ఉన్న నిష్పత్తి ఇప్పుడు 998కి చేరడం మంచి పరిణామం అని తెలిపారు. 

బార్డర్స్​లో 148 చెక్ పోస్ట్​0లు

ఎన్నికల దృష్ట్యా తెలంగాణ బార్డర్స్​లో 148 చెక్ పోస్ట్​లు ఏర్పాటు చేస్తున్నట్లు సీఈసీ రాజీవ్ కుమార్ వెల్లడించారు. ఇందులో స్థానిక పోలీసులు, ఫారెస్ట్, ఎక్సైజ్, ట్రాన్స్ పోర్ట్, ఇతర ఎన్ ఫోర్స్​మెంట్ విభాగాలు పనిచేస్తాయి. ముఖ్యంగా డ్రగ్స్, లిక్కర్, డబ్బు ప్రవాహాన్ని అడ్డుకునేలా కఠిన చర్యలు చేపడతామని సీఈసీ తెలిపారు. పట్టుబడిన వస్తువులు, డబ్బును వెంటనే ప్రజలకు తెలిపేలా తొలిసారి ఈఎస్ఎంఎస్ యాప్ ను అందుబాటులోకి తెచ్చారు. కార్గో ఫ్లైట్స్, అన్ షెడ్యూల్డ్ విమానాల రాకపోకలపై ఈసీ స్పెషల్​ ఫోకస్ పెట్టనుంది. రైల్వే కొరియర్స్, తపాల పార్సిల్స్ పైనా నిఘా ఉంటుంది.

తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ ఇట్లా..!

తెలంగాణలో 119 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో నవంబర్ 30న ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 3న నోటిఫికేషన్ విడుదల కానుంది. అదే రోజు నుంచి నామినేషన్లు మొదలవుతాయి. నవంబర్ 10 వరకు నామినేషన్లకు గడువు ఉంది. నామినేషన్ల పరిశీలన నవంబర్ 13న జరగనుంది.  ఉపసంహరణ గడువుగా నవంబర్ 15 విధించారు. నవంబర్ 30న పోలింగ్ జరగనుంది. ఓట్ల లెక్కింపు డిసెంబర్ 3న జరగనుంది. అదే రోజు ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. కాగా, 2018 లో సెప్టెంబర్ 6న రాష్ట్ర ప్రభుత్వాన్ని కేసీఆర్​ రద్దు చేయగా... అదే ఏడాది అక్టోబర్ 6న తెలంగాణ ఎన్నికల షెడ్యూల్​ను ఈసీ రిలీజ్ చేసింది. నవంబర్ 12 న నోటిపికేషన్ రిలీజ్ చేయగా... డిసెంబర్ 7 న ఎన్నికలు, కౌంటింగ్ చేపట్టింది. అయితే ఈసారి ఏడు రోజుల ముందుగానే పోలింగ్ జరగనుంది. గత ఎన్నికలతో పోలిస్తే ఈ సారి ఎనిమిది రోజులు ముందుగా కౌంటింగ్ జరగనుంది. కాగా ప్రస్తుత ప్రభుత్వ పదవీకాలం వచ్చే ఏడాది జనవరి 16తో ముగియనుంది. మొత్తం 119 అసెంబ్లీ స్థానాల్లో 88 జనరల్ కేటగిరీ కాగా, 19 ఎస్సీ, 12 ఎస్టీ రిజర్వుడు స్థానాలు ఉన్నాయి. 

35,356 పోలింగ్ స్టేషన్లు 

తెలంగాణలో 35,356 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు సీఈసీ రాజీవ్​కుమార్​ తెలిపారు. ఇందులో పట్టణ ప్రాంతాల్లో 14,464, గ్రామీణ ప్రాంతాల్లో 20,892 పోలింగ్ స్టేషన్లు ఉంటాయి. ప్రత్యేకంగా మహిళలు నిర్వహించే పోలింగ్ బూత్ లు (పింక్ బూత్ లు) 597, మోడల్ పోలింగ్ కేంద్రాలు 644, వృద్ధుల కోసం 120 బూత్ లు ఉంటాయని సీఈసీ వివరించారు. ఐదు రాష్ట్రాల్లో కలిపి 1.77 లక్షల పోలింగ్​ కేంద్రాలు ఏర్పాటు చేస్తుండగా.. 1.01 లక్షల కేంద్రాల్లో వెబ్​ కాస్టింగ్​ ఉంటుంది. ఇందులో తెలంగాణలోనే అత్యధికంగా  27, 798 (78శాతం) కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్  ఉంటుంది.  

రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు కౌంట్​డౌన్​ షురూ అయింది. కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్​ను రిలీజ్​ చేసింది. ఆ వెంటనే కోడ్​ అమలులోకి వచ్చింది. హ్యాట్రిక్​ కోసం బీఆర్​ఎస్​.. అధికారం కోసం బీజేపీ, కాంగ్రెస్​ హోరాహోరీగా తలపడుతున్నాయి. ఇప్పటికే గ్రౌండ్​లెవల్​లో అన్ని పార్టీలు తమ వ్యూహాలకు పదునుపెట్టాయి. ఇప్పుడు షెడ్యూల్​ రావడంతో ఇక ప్రచారాలు జోరందుకోనున్నాయి. ఇటు ఎన్నికల హడావుడితోపాటు అటు దసరా, దీపావళి పండుగలు కూడా ఇదే టైమ్​లో వస్తుండటంతో రాష్ట్రం మొత్తం సందడిగా మారనుంది. 

కేవైసీ యాప్​లో అభ్యర్థుల క్రిమినల్ కేసుల డేటా

తమ నియోజక వర్గంలో బరిలో ఉన్న అభ్యర్థిపై నమోదైన కేసుల వివరాలను ‘నో యువర్ క్యాండిడేట్ (కేవైసీ)’ యాప్ ద్వారా తెలుసుకోవచ్చని సీఈసీ రాజీవ్ కుమార్ తెలిపారు. ఈ యాప్ సహాయంతో ఓటర్లు సమర్థవంతమైన నేతను ఎన్నుకొనే అవకాశం ఉంటుందని ఆయన చెప్పారు. క్రిమినల్ కేసులు ఉన్న అభ్యర్థులు కనీసం మూడుసార్లు న్యూస్ పేపర్, టీవీ చానల్స్ ద్వారా ఓటర్లకు కేసుల వివరాలు తెలపాలని స్పష్టం చేశారు. అంతేకాకుండా పార్టీ వెబ్ సైట్స్ లో ఆ డేటాను పొందుపరచాలని పేర్కొన్నారు.

మిజోరంలో నవంబర్ 7న 

40 సీట్లున్న మిజోరం అసెంబ్లీ ఎన్నికలు ఒకే దశలో నవంబర్ 7న జరగనున్నాయి. ఈ రాష్ట్రంలో 8,51,895 మంది ఓటర్లు ఉన్నారు. 1,276 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. అక్టోబర్​ 13న నోటిఫికేషన్​ రానుంది.  డిసెంబర్​ 3న ఫలితాలు వెలువడనున్నాయి. 40 అసెంబ్లీ స్థానాల్లో 1 జనరల్ కేటగిరీ కాగా, 39 ఎస్టీ రిజర్వుడు స్థానాలు ఉన్నాయి. మిజోరం అసెంబ్లీ గడువు డిసెంబర్ 17న ముగియనుంది.

చత్తీస్‌‌‌‌‌‌‌‌గఢ్​లో ​నవంబర్​ 7, 17

90 సీట్లున్న చత్తీస్‌‌‌‌‌‌‌‌గఢ్ అసెంబ్లీ ఎన్నికలు రెండు దశల్లో జరగనున్నాయి. నవంబర్​ 7న తొలి దశ  పోలింగ్, నవంబర్​ 17న రెండో దశ పోలింగ్​ జరుగనుంది. చత్తీస్​గఢ్​లో 2,03,60,240 మంది ఓటర్లు ఉన్నారు. మొత్తం 24,109 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. అక్టోబర్​ 13న నోటిఫికేషన్​ రానుంది. డిసెంబర్​ 3న ఓట్ల లెక్కింపు ఉంటుంది.  90 అసెంబ్లీ స్థానాల్లో 51 సీట్లు జనరల్ కేటగిరీ కాగా, 10 ఎస్సీ, 29 ఎస్టీ రిజర్వుడు స్థానాలు ఉన్నాయి. చత్తీస్‌‌‌‌‌‌‌‌గఢ్ అసెంబ్లీ గడువు జనవరి 3తో ముగియనుంది.

మధ్యప్రదేశ్​లో నవంబర్ 17న 

230 స్థానాలు ఉన్న మధ్యప్రదేశ్‌‌‌‌‌‌‌‌ అసెంబ్లీ ఎన్నికలు ఒకే దశలో నవంబర్​ 17న జరగనున్నాయి.  అక్టోబర్​ 21న నోటిఫికేషన్​ రానుంది. 5,60,60,925 మంది ఓటర్లు ఉన్నారు.  మొత్తం 64,523 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు.  డిసెంబర్​ 3న ఫలితాలు రానున్నాయి.  230 అసెంబ్లీ స్థానాల్లో 148 జనరల్ కేటగిరీ కాగా, 35 ఎస్సీ,
47 ఎస్టీ రిజర్వుడు స్థానాలు ఉన్నాయి. మధ్యప్రదేశ్ అసెంబ్లీ గడువు జనవరి 6తో ముగియనుంది.

రాజస్థాన్‌‌‌‌‌‌‌‌లో నవంబర్ 23న

200 స్థానాలు ఉన్న రాజస్థాన్‌‌‌‌‌‌‌‌లో అసెంబ్లీ ఎన్నికలు ఒకే దశలో నిర్వహించనున్నారు. అక్టోబర్​ 20న నోటిఫికేషన్​ రానుంది. నవంబర్​ 23న పోలింగ్​ జరగనుంది. రాజస్థాన్‌‌‌‌‌‌‌‌లో 5,25,38,655 మంది ఓటర్లు ఉన్నారు.‌‌‌‌‌‌‌‌ 51,756 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. డిసెంబర్​ 3న ఫలితాలు వెలువడనున్నాయి.  200 అసెంబ్లీ స్థానాల్లో 141 జనరల్ కేటగిరీ కాగా, 25 ఎస్సీ, 34 ఎస్టీ రిజర్వుడు స్థానాలు ఉన్నాయి. రాజస్థాన్ అసెంబ్లీ గడువు జనవరి 14తో ముగియనుంది.