మహిళా ఓటర్లే ఎక్కువ.. లోక్ సభ ఎన్నికలకు ఫైనల్

మహిళా ఓటర్లే ఎక్కువ.. లోక్ సభ ఎన్నికలకు ఫైనల్

హైదరాబాద్, వెలుగు: లోక్ సభ ఎన్నికలకు సంబంధించిన ఫైనల్ ఓటర్ లిస్ట్​ను ఎన్నికల కమిషన్ సీఈవో వికాస్ రాజ్ రిలీజ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 3,30,37,113 మంది ఓటర్లు ఉన్నట్టు ప్రకటించారు. వీరిలో పురుషులు 1,64,47,132 మంది, మహిళలు 1,65,87,244 మంది ఉన్నట్లు ప్రకటనలో వెల్లడించారు. పురుషుల కంటే మహిళా ఓటర్లు 1,40,112 మంది ఎక్కువ ఉన్నట్టు వివరించారు. 2,737 మంది థర్డ్ జెండర్స్ ఉండగా, 15,378 మంది సర్వీస్ ఓటర్లు, 3,399 ఓవర్సీస్ ఓటర్లు ఉన్నారు. 7,19,104 ఓటర్లను యాడ్ చేసి.. 5,26,867 ఓట్లను తొలగించినట్లు సీఈవో పేర్కొన్నారు. 4,21,521 ఓట్లలో కరెక్షన్ చేశారు. 80 ఏండ్లకు పైబడిన ఓటర్లు 4,54,230 మంది ఉన్నారు. దివ్యాంగులు 5,28,405 మంది ఓటర్లు ఉన్నారు. ఫైనల్ ఓటర్ లిస్ట్ ఖరారు చేసే టైమ్ జనవరి 22 వరకు వచ్చిన ఓటర్ ఎన్ రోల్ మెంట్ అప్లికేషన్లు పరిగణనలోకి తీసుకున్నామని సీఈవో స్పష్టం చేశారు. ఈ ఏడాది జనవరి 1 నాటికి 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలని సూచించారు. ఈసీఐ వెబ్ సైట్ లేదా ఓటర్ హెల్ప్ లైన్ యాప్ లో పోలింగ్ స్టేషన్, ఓటు వివరాలు చెక్ చేసుకోవాలని పేర్కొన్నారు. ఏదైనా తప్పులు ఉంటే కరెక్షన్ చేసుకునేందుకు ఫాం 8 ద్వారా అప్లై చేసుకోవాలని సూచించారు.

గ్రేటర్​లో కోటి దాటిన ఓటర్లు

గ్రేటర్ హైదరాబాద్​లో ఓటర్ల సంఖ్య కోటి దాటింది. 1,00,36,007 మంది ఓటర్లు ఉన్నారు. గతేడాది నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల ముందు అక్టోబర్ 4న ఎన్నికల సంఘం విడుదల చేసిన లెక్కల ప్రకారం.. గ్రేటర్ లోని 25 నియోజకవర్గాల్లో 95 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఇప్పుడు వారి సంఖ్య కోటి దాటింది. వీరిలో 52,47,597 మంది పురుషులు, 47,87,082 మంది మహిళలు, 1,328 ఇతరులు ఉన్నారు. హైదరాబాద్ జిల్లాకు సంబంధించి 45,70,138 మంది ఓటర్లున్నారు. ఇందులో పురుషులు 23,30,574 మంది, మహిళలు 22,39,240 మంది, ఇతరులు 324 మంది ఉన్నారు. గ్రేటర్ పరిధిలోకి వచ్చే మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలోని కూకట్ పల్లి, మల్కాజిగిరి, ఉప్పల్, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల్లో మొత్తం 22,17,717 మంది ఓటర్లు ఉండగా.. వీరిలో 11,46,854 మంది పురుష ఓటర్లు, 10,70,533 మంది మహిళా ఓటర్లున్నారు. ఇతరులు 498 మంది ఉన్నారు. గ్రేటర్ లోకి వచ్చే రంగారెడ్డిలోని మహేశ్వరం, ఎల్బీనగర్, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, ఇబ్రహీంపట్నం ఐదు నియోజకవర్గాల్లో మొత్తం 28,40,733 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 14,73,112 మంది, మహిళలు 13,67,200 మంది, ఇతరులు 421 మంది ఉన్నారు. అలాగే, సంగారెడ్డి జిల్లాలోని పఠాన్ చెరు నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 4,07,419 మంది ఉండగా, వీరిలో పురుషులు 2,09,757 మంది, మహిళలు 1,97,577, ఇతరులు 85 మంది ఉన్నారు.