భద్రాచల సీతారామస్వామి కల్యాణం లైవ్ టెలికాస్ట్కు ఈసీ గ్రీన్ సిగ్నల్

భద్రాచల సీతారామస్వామి కల్యాణం లైవ్ టెలికాస్ట్కు ఈసీ గ్రీన్ సిగ్నల్

శ్రీరాముడి భక్తులకు ఎన్నికల సంఘం గుడ్ న్యూస్ చెప్పింది.  భద్రాచలం శ్రీ సీతారామస్వామి కల్యాణం ప్రత్యక్ష ప్రసారానికి ఈసీ అనుమతిచ్చింది.  రేపటి కల్యాణ మహోత్సవం లైవ్‌ ఇచ్చేందుకు ప్రభుత్వానికి ఈసీ అనుమతిచ్చింది.  ఎన్నికల కోడ్ కారణంగా కళ్యాణ వేడుకను ప్రసారం చేయకూడదని ఏప్రిల్ 04న ఈసీ ఆంక్షలు విధించింది.  

గత 40 ఏళ్లుగా ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నామని  దేవాదాయ శాఖ,  నేతలు ఈసీ నిర్ణయంపై అభ్యంతరం తెలిపారు. మంత్రి కొండా సురేఖ సైతం ఈసీకి లేఖ రాశారు.  దీంతో   ఎన్నికల సంఘం ప్రత్యక్ష ప్రసారానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.  అయితే  శ్రీసీతారాములవారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించడానికి సీఎం రేవంత్‌కు ఈసీ అనుమతి నిరాకరించింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఇది సాధ్యం కాదని పేర్కొంది.

భద్రాచలంలోని శ్రీసీతారాముల కళ్యాణానికి ముహూర్తం ఖరారైంది. రేపు మధ్యాహ్నం 12 గంటలకు కళ్యాణోత్సవం నిర్వహించనున్నారు. ప్రభుత్వం తరఫున సీఎస్ శాంతికుమారి స్వామివారికి ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు అందించనున్నారు.  ఇదిలా ఉంటే.. శ్రీరామ నవమి రోజు సీతారాముల కల్యాణాన్ని తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేశారు. భక్తుల కోసం తాగునీరు, మజ్జిగ ప్యాకెట్లతోపాటు చలువ పందిళ్లు వేశారు.