రైతుబంధుకు ఓకే .. సర్కారుకు పర్మిషన్ ఇచ్చిన ఎన్నికల సంఘం

రైతుబంధుకు ఓకే ..  సర్కారుకు పర్మిషన్ ఇచ్చిన ఎన్నికల సంఘం
  • సర్కారుకు పర్మిషన్ ఇచ్చిన ఎన్నికల సంఘం
  • శుక్రవారం నుంచే రైతుల ఖాతాల్లో జమ చేయొచ్చు
  • డీబీటీ చేస్తే ఓటర్లపై ప్రభావం పడదని వెల్లడి
  • రుణమాఫీ, ప్రభుత్వ ఉద్యోగుల డీఏల చెల్లింపులకు ఇంకా అనుమతి రాలే

హైదరాబాద్, వెలుగు: రైతుబంధు పంపిణీకి ఎలక్షన్ కమిషన్ (ఈసీ) గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చింది. ఈ నెల 24వ తేదీ నుంచి అంటే శుక్రవారం నుంచే రైతుల ఖాతాల్లో రబీ పెట్టుబడి సాయం జమ చేసుకోవచ్చని చెప్పింది. డీబీటీ (డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్​ఫర్) చేస్తున్నందున రైతుబంధు ప్రభావం ఓటర్లపై ఉండదని తెలిపింది. రాష్ట్రంలో యాసంగి సీజన్‌కు రైతుబంధు సాయం పంపిణీపై ప్రభుత్వం ఇటీవల ఎలక్షన్ కమిషన్ అనుమతి కోరింది. 

దీనిపై స్పందించిన ఈసీ.. ఎప్పుడు రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తారు? ఇది ఏ రకంగా ఓటర్లపై ప్రభావం చూపదో చెప్పాలని కోరింది. దీంతో 2018 ఎన్నికల సందర్భంగా కూడా పెట్టుబడి సాయం రైతులకు అందించామని.. అప్పుడు ఈసీ అనుమతించిందని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలకు సంబంధం లేకుండా నేరుగా రైతుల బ్యాంకు అకౌంట్లలో రైతుబంధు నగదు జమ అవుతుందని.. ఇది ఓటర్లపై ప్రభావం చూపదని వివరించింది. 

ఈ నెల 24వ తేదీ నుంచి పెట్టుబడి సాయం పంపిణీకి అనుమతించాలని కోరింది. తాజాగా బదులిచ్చిన ఈసీ.. రైతుబంధు పంపిణీకి ఓకే చెప్పింది. మరోవైపు రుణమాఫీకి, ప్రభుత్వ ఉద్యోగుల డీఏల చెల్లింపులకు ఈసీ నుంచి ఇంకా అనుమతి రాలేదు. 

నాలుగేండ్లుగా జనవరిలోనే పంపిణీ

రాష్ట్ర ప్రభుత్వం నాలుగేండ్లుగా డిసెంబర్ చివరలో రైతుబంధు పంపిణీ మొదలుపెట్టి జనవరిలో పూర్తి చేస్తున్నది. 2022 రబీకి సంబంధించిన పెట్టుబడి సాయాన్ని నాడు ఫిబ్రవరిలో కూడా వేసింది. ఈసారి ఎన్నికల నేపథ్యంలో నవంబర్​లో సరిగ్గా పోలింగ్​కు ముందే ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైందని ప్రతిపక్షాలు ముందు నుంచే ఆరోపిస్తూ వచ్చాయి. ఈ మేరకు రైతుబంధు పంపిణీని నామినేషన్ల కంటే ముందే చేయాలని.. లేదంటే పోలింగ్ తరువాత ఇచ్చేలా చూడాలని ఈసీని కాంగ్రెస్ నేతలు కోరారు. 

రైతుబంధు పంపిణీ అనేది నగదు జమ వ్యవహారమని.. దాంతో ఓటర్లు ప్రభావితం అవుతారని తెలిపింది. నిజానికి అప్పటికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి రైతుబంధుపై ఎలాంటి ప్రపోజల్ కూడా ఈసీకి వెళ్లలేదు. ఇటీవల రబీ పెట్టుబడి సాయంపై వ్యవసాయ శాఖ కార్యదర్శి, సీఎస్ తరపున ఈసీ అనుమతి కోరుతూ ప్రపోజల్స్ పంపారు. 

వ్యవసాయ శాఖ ప్రకటనతో గందరగోళం 

రైతుబంధు పంపిణీపై వ్యవసాయ శాఖ నుంచి విడుదలైన ప్రకటన గందరగోళానికి దారితీసింది. ఈ నెల 25, 26 ,27 తేదీల్లో బ్యాంకు హాలిడేస్ ఉన్నాయని, ఈ నెల 29, 30 తేదీల్లో రైతుబంధు పంపిణీకి ఎన్నికల కమిషన్ అనుమతించలేదని వ్యవసాయ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో రైతు బంధు సాయం పంపిణీని 28న ఒక్క రోజుకే పరిమితం చేస్తారా? లేదా 29, 30 తేదీల్లో కూడా వేస్తారా? అనే దానిపై కన్ఫ్యూజన్ నెలకొంది.

5 ఎకరాల్లోపు రైతులకే?

రైతుబంధు కింద ఎకరాకు రూ.5 వేల చొప్పున కోటి 50 లక్షల ఎకరాలకు సాయం అందించాల్సి ఉన్నది. దీనికి రూ.7,500 కోట్లు అవుతుంది. ప్రస్తుతం రాష్ట్ర సర్కారును నిధుల కొరత వెంటాడుతున్నది. కొన్ని రోజులుగా ఆర్థిక శాఖ నుంచి చెల్లింపులన్నీ కాంట్రాక్టర్లకే వెళ్తున్నాయని, దీంతో ఖజానా దాదాపు జీరోకు చేరుకున్నదని తెలుస్తున్నది. అప్పులు తీసుకునే అవకాశం లేకపోవడం, రిజిస్ర్టేషన్ల ఆదాయం తగ్గడం, ఎక్సైజ్ రాబడి పెరగకపోవడంతో నిధులు ఎట్లా సర్దాలనే దానిపై ఆర్థిక శాఖ మల్లగుల్లాలు పడుతున్నది. 

ఈ నేపథ్యంలో 5 ఎకరాల్లోపు రైతులకు మాత్రమే పోలింగ్ తేదీ నాటికి రైతుబంధు సాయం అందించేలా సర్కారు ప్లాన్ చేసినట్లు సమాచారం. ఇందుకు రూ.4 వేల కోట్లు సరిపోతాయని, దాదాపు 75 శాతం నుంచి 80 శాతం అంటే 50 లక్షల నుంచి 60 లక్షల మంది రైతులకు పెట్టుబడి సాయం అందుతుందని లెక్కలు వేసుకుంటున్నట్లు తెలుస్తున్నది. మిగతా వాళ్లకు తర్వాత ఇవ్వొచ్చని భావిస్తున్నట్లు సమాచారం.