- 45 రోజుల్లో చెప్పకుంటే అనర్హత వేటు వేయనున్న ఎన్నికల సంఘం
- గెలిచినా, ఓడినా కానీ అభ్యర్థులపై చర్యలు తప్పవు
- 2019 ఎన్నికల సమయంలో 360 మందిపై వేటు
యాదాద్రి, వెలుగు : పంచాయతీ ఎన్నికల్లో గెలిచినా.. ఓడినా కానీ.. అభ్యర్థులు లెక్క చెప్పకుంటే రాష్ట్ర ఎన్నికల సంఘం వేటు వేయనుంది. వేటు పడిన అభ్యర్థులు మూడేండ్ల పాటు ఏ ఎన్నిక జరిగినా పోటీ చేయడానికి అర్హత ఉండదు.
రూల్స్ మేరకు ఖర్చు ఇలా..
పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఎన్నికల సంఘం సూచించిన నిబంధనల మేరకు ఖర్చు చేయాలి. వేటికి ఎంత ఖర్చు చేయాలో కూడా సంఘమే రేట్లు నిర్ణయిస్తుంది. 5 వేల ఓట్లకంటే ఎక్కువ ఉన్న పంచాయతీల్లో సర్పంచ్‌లుగా పోటీ చేసే వారు రూ. 2.50 లక్షలు, వార్డు మెంబర్లు రూ. 50 వేలు ఖర్చు చేయాలి. చిన్న పంచాయతీలు అయితే సర్పంచ్ అభ్యర్థులు రూ. 1.50 లక్షలు, వార్డు మెంబర్లు రూ. 30 వేలు ఖర్చు చేయాలి. పోటీ చేస్తున్న అభ్యర్థుల ఖర్చులకు సంబంధించి ఎప్పటికప్పుడు ప్రత్యేక అధికారులు పర్యవేక్షణ చేస్తారు.
45 రోజుల్లో ఖర్చు లెక్కలు
ఎన్నికలు ఫలితాల తర్వాత గెలిచినా.. ఓడినా సదరు అభ్యర్థులు తాము చేసిన ఖర్చుకు సంబంధించిన లెక్కలను 45 రోజుల్లోగా ఎన్నికల సంఘానికి అందించాల్సి ఉంటుంది. లెక్క చెప్పని వారిపై ఎన్నికల సంఘం అనర్హత వేటు వేస్తుంది. గెలిచిన వారు లెక్క చెప్పకుంటే పదవి నుంచి తొలగిస్తుంది.
గతంలో 360 మందిపై వేటు
2019లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో జిల్లాలో 421 పంచాయతీలు ఉన్నాయి. సర్పంచ్, వార్డు మెంబర్లుగా పోటీ చేసిన వారిలో గెలిచిన వారు లెక్కలు వెల్లడించారు. సర్పంచ్, వార్డు మెంబర్లుగా పోటీ చేసి ఓడిపోయిన వారు తాము చేసిన ఖర్చు లెక్క చెప్పలేదు. దీంతో వారిపై 2020 డిసెంబర్ లో ఎన్నికల సంఘం వేటు వేసింది. ఇలా అనర్హతకు గురైనవారిలో సర్పంచ్ అభ్యర్థులు 128 మంది, వార్డు మెంబర్ అభ్యర్థులు 231 మంది ఉన్నారు. సర్పంచ్అభ్యర్థుల్లో ఎక్కువగా బీబీనగర్ మండలానికి చెందిన వారే ఉన్నారు.
