కాశ్మీర్, హర్యానాలో ఎన్నికల నగారా

కాశ్మీర్, హర్యానాలో ఎన్నికల నగారా
  • అసెంబ్లీ ఎలక్షన్స్​కు షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ 
  • జమ్మూకాశ్మీర్​లో మూడు విడతల్లో సెప్టెంబర్ 18, 25.. అక్టోబర్ 1న పోలింగ్ 
  • హర్యానాలో ఒకే విడతలో అక్టోబర్ 1న ఎలక్షన్స్  
  • అక్టోబర్ 4న రిజల్ట్

న్యూఢిల్లీ:  కేంద్ర పాలిత ప్రాంతం జమ్మూకాశ్మీర్, హర్యానా రాష్ట్రాల్లో ఎన్నికల నగారా మోగింది. ఈ రెండు చోట్ల అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు ఎలక్షన్ కమిషన్ (ఈసీ) శుక్రవారం షెడ్యూల్ విడుదల చేసింది. 90 సీట్లు ఉన్న జమ్మూకాశ్మీర్ లో మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్టు ఈసీ తెలిపింది. మొదటి విడతలో సెప్టెంబర్ 18న 24 సీట్లకు, రెండో విడతలో సెప్టెంబర్ 25న 26 సీట్లకు, మూడో విడతలో అక్టోబర్ 1న 40 సీట్లకు ఎన్నికలు నిర్వహించనున్నట్టు చెప్పింది.

ఇక హర్యానాలోనూ 90 సీట్లు ఉండగా, ఇక్కడ ఒకే విడతలో అక్టోబర్ 1న అన్ని స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్టు వెల్లడించింది. రెండు చోట్ల ఫలితాలను ఒకేసారి అక్టోబర్ 4న విడుదల చేయనున్నట్టు ప్రకటించింది. కాగా, జమ్మూకాశ్మీర్ లో సెప్టెంబర్ 30లోగా అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అలాగే హర్యానా అసెంబ్లీ గడువు నవంబర్ 3న ముగియనుంది. దీంతో ఈ రెండు చోట్ల ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ ఏర్పాట్లు చేసింది. వీటితో పాటే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా.. వాటిని తర్వాత నిర్వహించాలని ఈసీ నిర్ణయించింది. మహారాష్ట్ర, జార్ఖండ్, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి నిర్వహించే అవకాశం ఉంది.

ఇదీ షెడ్యూల్...  

జమ్మూకాశ్మీర్​లో మొదటి విడత ఎన్నికలకు ఈ నెల 20న నోటిఫికేషన్ ఇస్తారు. 27 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 28న నామినేషన్లు పరిశీలిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు 30 వరకు అవకాశం కల్పిస్తారు. సెప్టెంబర్ 18న పోలింగ్ నిర్వహిస్తారు. రెండో విడత ఎన్నికలకు ఈ నెల 29న నోటిఫికేషన్ ఇస్తారు. సెప్టెంబర్ 5 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 6న నామినేషన్లు పరిశీలిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు 9 వరకు అవకాశం కల్పిస్తారు. 25న పోలింగ్ నిర్వహిస్తారు.

మూడో విడత ఎన్నికలకు సెప్టెంబర్ 5న నోటిఫికేషన్ ఇస్తారు. 12 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 13న నామినేషన్లు పరిశీలిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు 17 వరకు అవకాశం కల్పిస్తారు. అక్టోబర్ 1న పోలింగ్ నిర్వహిస్తారు. హర్యానాలో సెప్టెంబర్ 5న నోటిఫికేషన్ ఇస్తారు. 12 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 13న నామినేషన్ల పరిశీలన, 16 వరకు ఉపసంహరణకు అవకాశం కల్పిస్తారు. అక్టోబర్ 1న పోలింగ్ నిర్వహిస్తారు. కాగా, జమ్మూకాశ్మీర్, హర్యానా ఎన్నికల ఫలితాలను ఒకేసారి అక్టోబర్ 4న విడుదల చేస్తారు.

జమ్మూకాశ్మీర్​లో పదేండ్ల తర్వాత ఎన్నికలు.. 

జమ్మూకాశ్మీర్​లో పదేండ్ల తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారి జరుగుతున్న ఎన్నికలివి. చివరిసారి 2014లో ఎన్నికలు జరిగాయి. కేంద్రం 2019లో ఆర్టికల్ 370ని రద్దు చేసి, జమ్మూకాశ్మీర్​కు ఉన్న ప్రత్యేక హోదాను తొలగించింది. దీనిపై సుప్రీంలో పిటిషన్లు దాఖలయ్యాయి.

వీటిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. ఆర్టికల్ 370 రద్దును సమర్థిస్తూ 2023 డిసెంబర్ లో తీర్పు ఇచ్చింది. 2024 సెప్టెంబర్ 30లోగా జమ్మూకాశ్మీర్​లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది.