ఎన్నికల్లో డబ్బు, మద్యం .. పంపిణీపై నిఘా

ఎన్నికల్లో డబ్బు, మద్యం .. పంపిణీపై నిఘా
  • వచ్చే ఎలక్షన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అభ్యర్థుల ఖర్చులపై ఫోకస్‌‌‌‌‌‌‌‌ పెట్టండి
  • రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి ఎలక్షన్‌‌‌‌‌‌‌‌ కమిషన్‌‌‌‌‌‌‌‌ ఆదేశం
  • అభ్యర్థులపై నజర్​ పెట్టాలని సూచన

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తుండటంతో డబ్బు, మద్యం ప్రవాహంపై ఎలక్షన్ కమిషన్ స్పెషల్‌‌‌‌‌‌‌‌ ఫోకస్‌‌‌‌‌‌‌‌ పెట్టింది. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ)ని అప్రమత్తం చేసింది. మద్యం, డబ్బు పంపిణీపై గత ఉప ఎన్నికల సమయంలో వందల ఫిర్యాదులు వచ్చాయని, ఈసారి కూడా వేల కోట్ల రూపాయాలతో ప్రజలను మభ్యపెట్టే అవకాశం ఉందని రిపోర్ట్‌‌‌‌‌‌‌‌లు ఉన్నాయని చెప్పింది. దీంతో ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పరిస్థితిని కంట్రోల్ చేయాల్సిందేనని స్పష్టం చేసినట్లు తెలిసింది. అందుకోసం ఇప్పటి నుంచే నిఘా పెంచుతోంది. 

రానున్న రోజుల్లో ఎన్నికలు జరగనున్న అన్ని రాష్ట్రాల్లో ఓటర్లను మద్యం, డబ్బు పంపిణీ, తదితరాలపై ఈసీ స్పెషల్ ఫోకస్​ పెట్టింది. అందులో భాగంగా తెలంగాణలో పరిస్థితి తీవ్రత ఎక్కువగా ఉందని, అందుకోసం ఏం చేయాలనే దానిపై యాక్షన్ ప్లాన్ రూపొందించాలని ఆదేశించింది. సీఈఓ కార్యాలయంతో పాటు ఇతర ఐటీ, ఈడీ ఆఫీస్‌‌‌‌‌‌‌‌లకు చెందిన ఆఫీసర్లను ఇన్‌‌‌‌‌‌‌‌వాల్వ్ చేస్తూ డబ్బు, మద్యాన్ని కట్టడి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. 

రంగంలోకి ఎన్‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌‌‌‌‌మెంట్ ఏజెన్సీలు..

రాష్ట్రంలో ఇటీవల జరిగిన మునుగోడు, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో సుమారు వివిధ రాజకీయ పార్టీలు రూ.400 కోట్ల నుంచి రూ. 500 కోట్లు ఖర్చు చేశాయని అంచనా. దీంతో ఈసారి కేంద్ర ఎన్నికల సంఘం ఈ వ్యవహారాన్ని చాలా సీరియస్‌‌‌‌‌‌‌‌గా తీసుకుంది. నగదు ప్రవాహానికి అడ్డుకట్ట వేసేందుకు సుమారు 20కి పైగా ఎన్‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ ఏజెన్సీలకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో అన్ని వ్యవస్థలు కలిసి పని చేస్తేనే డబ్బు ప్రవాహానికి అడ్డుకట్ట వేయొచ్చని ఈసీ అభిప్రాయపడింది. అందులో భాగంగా అన్ని శాఖల అధికారులతో ఎలక్షన్​ కమిషన్​ సమన్వయం చేసుకుంటున్నది. 

సీక్రెట్ టీమ్స్‌‌‌‌‌‌‌‌తో మానిటరింగ్​

సాధారణంగా ఎన్నికల ఖర్చును షెడ్యూల్ తర్వాత నుంచి పరిగణనలోకి తీసుకుంటారు. నోటిఫికేషన్ తర్వాత నామినేషన్ల టైం నుంచి అభ్యర్థుల ఖర్చును లెక్కిస్తారు. అయితే ఈసారి అందుకు భిన్నంగా ముందు నుంచే ఎవరెవరు ఎక్కడి నుంచి నిధులు సమకూర్చుకుంటున్నారు? ఎవరి దగ్గర దాచి పంచుతున్నారు? ఎలా ఖర్చు చేస్తున్నారు? అనేది దానిపై దృష్టి పెట్టనున్నారు. ఇందుకోసం సీక్రెట్ టీమ్స్‌‌‌‌‌‌‌‌ను అపాయింట్ చేస్తున్నట్లు తెలిసింది. రెండు నియోజకవర్గాలకో టీం పని చేయనుంది. 

పార్టీల నుంచి పోటీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ వచ్చినోళ్లపై, పోటీలో ఎవరు ఉండాలనుకుంటున్నారో వారి వివరాలను సేకరిస్తున్నట్లు సమాచారం. మద్యం అమ్మకాలు కూడా ఎంత మేర ఉండాలి? మద్యం డిపోలు, వైన్స్‌‌‌‌‌‌‌‌లలో సేల్స్ రిజిస్టర్లు మెయింటెయిన్​ చేసేలా చర్యలు తీసుకోనున్నారు. సీసీ కెమెరాలతో మానిటరింగ్ చేపట్టనున్నారు.