రాజగోపాల్ రెడ్డికి ఈసీ నోటీసులు

రాజగోపాల్ రెడ్డికి ఈసీ నోటీసులు

బ్యాంక్ ఖాతాల్లోకి నగదు బదిలీపై టీఆర్ఎస్ నేత ఫిర్యాదుకు స్పందన

ఇయ్యాల సాయంత్రం 4 గంటల వరకు వివరణ ఇవ్వాలని ఆదేశం 

న్యూఢిల్లీ, వెలుగు: మునుగోడు బైపోల్ లో బీజీపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన రాజగోపాల్ రెడ్డి కి కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) నోటీసులు ఇచ్చింది. ఆయన కుటుంబ సభ్యులకు చెందిన సుశీ ఇన్ఫ్రా అండ్ మైనింగ్ లిమిటెడ్ కు సంబంధించిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ ఖాతా నుంచి ఈ నెల 14, 18, 29న పెద్ద మొత్తంలో నగదు బదిలీ జరిగిందని టీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ సోమ భరత్ కుమార్ శనివారం ఈసీఐకి ఫిర్యాదు చేశారు.

దాదాపు రూ.5.24 కోట్లను మునుగోడు నియోజకవర్గంలోని  23 మందికి చెందిన బ్యాంక్ ఖాతాలకు ట్రాన్స్ ఫర్ చేసినట్లు అందులో పేర్కొన్నారు. ఈ నగదుతో ఓటర్లను ప్రభావితం చేసేందుకు యత్నిస్తున్నట్లు ఆరోపించారు. ఈ వ్యవహారంపై స్పందించిన ఈసీ ప్రిన్సిపల్ సెక్రటరీ అవినాష్ కుమార్.. రాజగోపాల్ రెడ్డికి నోటీసులు జారీ చేశారు. బ్యాంక్ ఖాతాలకు నగదు బదిలీపై సోమవారం సాయంత్రం 4 గంటల లోపు వివరణ ఇవ్వాలని ఆదేశించారు.