నామినేషన్లు షురూ..యాదాద్రిలో సీపీఐతో కాంగ్రెస్, సీపీఎంతో బీఆర్ఎస్ పొత్తు

నామినేషన్లు షురూ..యాదాద్రిలో సీపీఐతో కాంగ్రెస్, సీపీఎంతో బీఆర్ఎస్  పొత్తు
  • యాదగిరిగుట్టలో రెండు ఇచ్చినా.. అభ్యర్థి లేక ఒక వార్డులోనే సీపీఐ పోటీ 
  • కొన్ని మున్సిపాలిటీల్లో అభ్యర్థుల ఎంపిక కంప్లీట్ 
  • మరికొన్నింటిలో కొనసాగుతున్న కసరత్తు  
  • బీఆర్ ఎస్, బీజేపీ పొత్తుపై నో క్లారిటీ 
  • యాదాద్రిలో 41, నల్గొండలో 44, సూర్యాపేటలో 23  నామినేషన్లు

యాదాద్రి, నల్గొండ, వెలుగు: ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎన్నికల వేడి మొదలైంది. మొదటి రోజు నామినేషన్లు నామమాత్రంగానే వచ్చాయి.  మొదటి రోజు కావడం, దశమి కావడంతో ఓ మోస్తారుగా నామినేషన్లు దాఖలయ్యాయి. కాంగ్రెస్​, బీఆర్​ఎస్​, బీజేపీ అభ్యర్థులు సహా ఇండిపెండెంట్లు కొన్ని చోట్ల నామినేషన్లు దాఖలు చేశారు.  గురువారం ఎక్కువగా నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉంది. 

ఉమ్మడి నల్గొండలో కార్పోరేషన్​, 17 మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరుగుతున్నాయి.  నల్గొండ కార్పొరేషన్ లో 11 నామినేషన్లు, దేవరకొండలో 10, చిట్యాలలో 9, నందికొండలో 6, చండూరులో 4, మిర్యాలగూడలో 4,  హాలియాలో ఒక్కటి పడలేదు.  

సూర్యాపేట మున్సిపాలిటీలో 13, కోదాడలో ఒకటి, తిరుమలగిరిలో 9, నేరేడుచర్లలో ఒకటి, హుజూర్​నగర్​లో ఒక్కటి పడలేదు.  యాదాద్రి జిల్లాలో ఆరు మున్సిపాలిటీలు ఉన్నాయి. యాదగిరిగుట్టలో 15, ఆలేరులో 10, భువనగిరిలో 5, చౌటుప్పల్​లో 6, మోత్కూరులో 3, పోచంపల్లిలో 2 నామినేషన్లు దాఖలయ్యాయి. 

ఆచితూచి అభ్యర్డుల ఎంపిక 

నామినేషన్ ప్రక్రియ మొదలు కావడంతో ప్రధాన పార్టీలు అభ్యర్థులను ఆచితూచి ఎంపిక చేసేందుకు కసరత్తు చేస్తున్నాయి. నల్గొండ కార్పొరేషన్ పరిధిలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి 45  డివిజన్ లకు సంబంధించిన క్యాండిడేట్లను ప్రకటించగా.. బీఆర్ఎస్ 18 మందితో మొదటి విడత అభ్యర్థుల లిస్ట్ ను మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ప్రకటించారు.

 ఇక మున్సిపాలిటీలలో కాంగ్రెస్ పార్టీ సర్వే ప్రకారంగా గెలిచే వారినే బరిలో నిలపాలని యోచిస్తున్నారు. యాదాద్రి జిల్లా భువనగిరిలో కాంగ్రెస్​ 15 వార్డులకు అభ్యర్థులను ప్రకటించిగా, బీఆర్​ఎస్​ 34 వార్డులకు అభ్యర్థులను ప్రకటించింది. ఆలేరులోని 12 వార్డులకు కాంగ్రెస్​, బీఆర్​ఎస్​ అభ్యర్థులను ప్రకటించగా, బీజేపీ మాత్రం ఆరు వార్డులకు అభ్యర్థులను ఎంపిక చేసింది. 

యాదాద్రిలో  కాంగ్రెస్​తో సీపీఐ, బీఆర్​ఎస్​తో సీపీఎం

యాదాద్రి జిల్లాలో కాంగ్రెస్​తో సీపీఐ, బీఆర్​ఎస్​తో సీపీఎం పొత్తు కుదుర్చుకున్నాయి. భువనగిరి మున్సిపాలిటీలో బీఆర్​ఎస్​ 34 వార్డుల్లో పోటీ చేస్తుండగా సీపీఎం ఒక్క సీటులో పోటీ చేస్తోంది. కాగా కాంగ్రెస్​తో సీపీఐ పొత్తు కుదుర్చుకుంది. భువనగిరి, పోచంపల్లి మున్సిపాలిటీల్లో ఒక్కో సీటు సీపీఐకి ఇచ్చేందుకు కాంగ్రెస్​ అంగీకరించింది. యాదగిరిగుట్టలో 12 వార్డులు ఉండగా సీపీఐకు రెండు వార్డులు ఇవ్వడానికి కాంగ్రెస్​ ఒప్పుకుంది.

 అయితే సీపీఐ నుంచి పోటీ చేయడానికి ఒక్కరే ముందుకు రావడంతో మిగిలిన 11 వార్డుల్లో కాంగ్రెస్​ పోటీ చేస్తోంది. ఆలేరులో కాంగ్రెస్​ 12 వార్డులకు అభ్యర్థులను  ఎంపిక  చేసినట్టు ఆ పార్టీ లీడర్లు చెబుతున్నారు. సీపీఐకి ఒక వార్డు ఇచ్చే విషయంలో చర్చలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. చౌటుప్పల్​లో బీఆర్​ఎస్​, బీజేపీ మధ్య అంతర్గత  పొత్తు పై చర్చలు సాగుతున్నట్టుగా ప్రచారం అవుతోంది. ఈ విషయంలో ఆయా పార్టీల నుంచి స్పష్టత రావడం లేదు.

నల్గొండ, సూర్యాపేటలో పొత్తులపై నో క్లారిటీ 

ఇదిలా ఉండగా మున్సిపల్ ఎన్నికలలో పొత్తులపై క్లారిటీ రావడానిక్ మరికొంత సమయం పట్టే అవకాశలు ఉన్నాయి. నామినేషన్లకు మరో రెండు రోజుల గడువు ఉండడంతో ప్రధాన పార్టీలు పొత్తులపై మంతనాలు జరుపుతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీతో సీపీఎం, సీపీఐ పార్టీలు సంప్రదింపులు చేయగా పొత్తుపై హై కమాండ్ నుండి ఆదేశాలు రాకపోవడంతో నిరీక్షిస్తున్నారు.

 నల్గొండ జిల్లాలో చిట్యాల, మిర్యాలగూడ మున్సిపాలిటీ లలో సీపీఎం పార్టీ టిక్కెట్లను ఆశిస్తుండగా దేవరకొండ మున్సిపాలిటీలో టికెట్ ఇవ్వాలని సీపీఐ పట్టుబట్టింది. సూర్యాపేట జిల్లాలో మాత్రం సీపీఎం సూర్యాపేట మున్సిపాలిటీ లో 10 సీట్లను డిమాండ్ చేస్తుండగా సీపీఐ మాత్రం సూర్యాపేట, కోదాడ, హుజూర్ నగర్ మున్సిపాలిటీలలో మూడు సీట్లను కోరుతున్నది. 

పొత్తు కుదరని పక్షంలో సీపీఎం బిఆర్ఎస్ పార్టీతో కలుపుకొని పోవాలని యోచిస్తుండగా  సిపిఐ మాత్రం ఒంటరిగా బరిలోకి దిగుతుందని ఆ పార్టీ నాయకులు చెప్తున్నారు. ఇక బీజేపీ మాత్రం  బిఆర్ఎస్ తో దోస్తీ కట్టేందుకు నాయకులు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రధానంగా నల్గొండ, దేవరకొండ, సూర్యాపేట మున్సిపాలిటీలలో బీజేపీ బలంగా ఉండగా ఈ సారి ఎలాగైనా ఎక్కువ సీట్లను గెలవాలన్న లక్ష్యంతో ముందుకుపోతున్నారు.