రసవత్తరంగా ‘మా’ ఎన్నికలు

రసవత్తరంగా ‘మా’ ఎన్నికలు

హైదరాబాద్: ఈసారి మూవీ ఆర్టిస్ట్స్‌‌‌‌ అసోసియేషన్ (మా) ఎన్నికలు మరింత ఆసక్తికరంగా ఉండబోతున్నాయి. ప్రెసిడెంట్ పదవికి ఇప్పటికే నలుగురు అభ్యర్థుల పేర్లు బయటికి రావడంతో అందరి దృష్టి అటువైపు మళ్లింది. మంచు విష్ణు, ప్రకాష్‌‌‌‌ రాజ్‌‌‌‌ ముందే పోటీకి రెడీ అయ్యారు. ఆ తర్వాత జీవితా రాజశేఖర్ పేరు తెరపైకొచ్చింది. తాజాగా నేనూ యుద్ధానికి సిద్ధమంటూ సీనియర్ నటి హేమ రంగంలోకి దిగింది. దాంతో ఈసారి పోటీ గట్టిగానే ఉండబోతోందని అర్థమయ్యింది. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌‌ ఏర్పడి చాలా ఏళ్లయ్యింది. దీనికి మొదటి అధ్యక్షుడిగా చిరంజీవి పనిచేశారు. ఆ తర్వాత మోహన్ బాబు, నాగార్జున, మురళీమోహన్, నాగబాబు, రాజేంద్రప్రసాద్, శివాజీరాజా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. గత ఎలక్షన్స్‌‌‌‌లో నరేశ్ ఎన్నికయ్యారు. అయితే నాలుగేళ్ల నుంచి రకరకాల వివాదాలతో ‘మా’ ఎన్నికలు ఇంట్రస్టింగ్​గా మారాయి. అందుకే ఈసారి నలుగురు పోటీకి దిగడం ఆసక్తిని రేపుతోంది. రీసెంట్‌‌‌‌గా ఓ ఇంటర్వ్యూలో ప్రకాష్ రాజ్‌‌‌‌కు బహిరంగంగా మద్దతు తెలిపారు నాగబాబు. ‘మా అసోసియేషన్‌‌‌‌ను నడిపించగల అర్హత ప్రకాష్‌‌‌‌ రాజ్‌‌‌‌కు ఉందని మేం నమ్ముతున్నాం. తను వస్తే ఒక పాజిటివ్ మార్పు తెస్తాడు’ అన్నారాయన. 

పదవి కోసం కాదు, కలసి పని చేయడం కోసం పోటీ చేస్తానని, ఆల్రెడీ ఈ విషయం గురించి చిరంజీవితో మాట్లాడితే ఆయన ఎంకరేజ్ చేశారని ప్రకాష్‌‌‌‌ రాజ్‌‌‌‌ కూడా చెప్పారు. దాంతో ప్రెసిడెంట్ అయ్యే చాన్సెస్‌‌‌‌ ప్రకాష్‌‌‌‌ రాజ్‌‌‌‌కే ఎక్కువ ఉన్నాయంటున్నారు. అయితే ఆయన తెలుగువాడు కాదు కనుక ఈ పోటీలో పాల్గొనడం కరెక్ట్ కాదనే పాయింట్‌‌‌‌ను ఆల్రెడీ కొందరు లేవనెత్తుతున్నారు. ఇటీవల మోహన్ బాబు, మంచు విష్ణు కూడా సూపర్‌స్టార్ కృష్ణను కలసి ఎన్నికల విషయం గురించి చర్చించారు. గత నాలుగేళ్లలా కాకుండా గొడవలకు దూరంగా 'మా'ను ఉంచాలన్నదే తమ లక్ష్యమని అభ్యర్థులందరూ చెబుతున్నారు. అయితే ఈసారి పోటీ చూస్తుంటే కిందటిసారి కన్నా రసవత్తరంగా మారేందుకు ఎక్కువ అవకాశాలున్నట్టు కనిపిస్తోంది. మరి మున్ముందు ఏం జరగబోతోందో, ఇంకెంతమంది పోటీకి దిగబోతున్నారో, చివరికి ఎవరు అధ్యక్ష పీఠం ఎక్కుతారో వేచి చూడాల్సిందే!