కామారెడ్డి జిల్లాలో ఎన్నికల స్టంట్స్ ​షురూ..

కామారెడ్డి జిల్లాలో ఎన్నికల స్టంట్స్ ​షురూ..

కామారెడ్డి , వెలుగు: జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఎన్నికల సందడి  మొదలైంది.  ఈ ఏడాది చివరలో  అసెంబ్లీ ఎన్నికలు జరగనుండడంతో ఓటర్ల దృష్టిలో పడేందుకు  పార్టీల లీడర్లు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.  ప్రధాన పార్టీల తరఫున బరిలో నిలవాలనుకుంటున్న ఆశావహులు  పండగలు, పబ్బాల పేరుతో పోటాపోటీగా పర్యటిస్తున్నారు. ఇదే అదునుగా భావిస్తున్న ఓటర్లు కుల సంఘాలుగా విడిపోయి కోరికల చిట్టాలు నేతల ముందు పెడుతున్నారు. దీంతో పోటీకి సిద్ధమవుతున్న వారికి కుల సంఘాల వారు ఏమేం కోరుతారో.. కాదంటే.. ఎటు మొగ్గు చూపుతారోనన్న దడ పట్టుకుంది.  జిల్లాలోని కామారెడ్డి,  ఎల్లారెడ్డి, బాన్స్​వాడ, జుక్కల్​ నియోజక వర్గాల్లో ఎన్నికల స్టంట్స్​షురూ అయ్యాయి.

లీడర్లు పల్లెల్లో కలియ తిరుగుతూ  ప్రతి అవకాశాన్ని తమకు అనుకూలంగా మార్చుకునేందుకే  ప్రయత్నిస్తున్నారు.   గ్రామ దేవతల పండుగలు,  కుల సంఘాల ఆధ్వర్యంలో   ఏ  ప్రోగ్రాం నిర్వహించినా..హాజరవుతున్నారు. ఒక వేళ హాజరు కాకుంటే ఎక్కడ తమకు ఆ వర్గం దూరమవుతుందోననే   భయం లీడర్లకు పట్టుకుంది.   అధికార బీఆర్ఎస్​,  కాంగ్రెస్, బీజేపీలకు చెందిన   కీలక లీడర్లు పల్లెల్లో ప్రతి పండగకు హాజరవుతున్నారు.  ఇదే అదునుగా  కుల సంఘాల ప్రతినిధులు   లీడర్ల ఎదుట  తమ సమస్యల్ని ఏకరువు పెడుతున్నారు.  మరి కొన్ని కుల సంఘాల పెద్దలు  లీడర్ల వద్దకే వచ్చి కమ్యూనిటీ బిల్డింగ్స్, కుల దేవతల గుడులు కట్టేందుకు  చందాలు ఇవ్వాలని కోరుతున్నారు.  ఆర్థికంగా భారమవుతున్నప్పటికీ  చందాలు ఇవ్వక తప్పడం లేదని ప్రధాన పార్టీకి చెందిన ఓ లీడర్​  వాపోయాడు.

ఒకరిని చూసి మరొకరు..

ఎల్లారెడ్డి నియోజక వర్గంలోని  ఓ ప్రధాన పార్టీకి చెందిన  లీడర్​ కొంత కాలంగా  కుల సంఘాలకు ,  ఆలయాల  నిర్మాణానికి చందాలు రాస్తున్నారు.  ఈయనను  చూసి  అదే పార్టీకి చెందిన మరో నేత కూడా రాయాల్సి వస్తోంది.   వీరిని చూసి మిగతా పార్టీల వాళ్లు  కూడా చేరదీయాల్సి వస్తోంది.   జుక్కల నియోజక వర్గంలో  ఓ పార్టీ నుంచి  పోటీ చేయడానికి  ఉత్సాహం చూపుతున్న  కొత్త లీడర్​ స్థానికులను ఆకట్టుకునేందుకు   ప్రయత్నాలు షురూ చేశారు.  గ్రామాల్లో పర్యటిస్తూనే   గతంలో  ఎన్నడు లేని విధంగా కుల సంఘాల తరఫున నిర్మించే ఆలయాలకు విరివిగా చందాలు రాస్తున్నట్లు ప్రచారం సాగుతోంది.  బాన్స్​వాడ నియోజకవర్గంలో అయితే   ఏకంగా కుల సంఘాలకు ఫంక్షన్​ హాల్స్​ కట్టిస్తున్నారు. 

పరిస్థితి ఇదీ..

కామారెడ్డి నియోజకవర్గంలోని  ఓ గ్రామానికి ఇటీవల ప్రధాన పార్టీకి చెందిన కీలక లీడర్​పార్టీ  మీటింగ్​ కోసం వెళ్లారు.    మీటింగ్​ కంటే ముందే  ఐదారు కుల సంఘాల ప్రతినిధులు వచ్చి తమకు  కావాల్సిన  వాటిని  ముందుంచారు.  తమ కుల ధైవం ఆలయ నిర్మాణానికి  చందా రాయాలని  విన్నవించారు.  రూ.1 లక్షకు తక్కువ కాకుండా ఇవ్వాలని కోరారు.  ఒక్కో కుల సంఘంలో 150 నుంచి 250 వరకు ఓట్లు ఉన్నాయి. ఈ లెక్కన ఈ  ఒక్క గ్రామంలోనే   రూ.5 నుంచి 6 లక్షల వరకు చందాలు రాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరో గ్రామానికి చెందిన ఓ కుల సంఘం వాళ్లు ప్రధాన పార్టీలకు చెందిన  ముగ్గురు లీడర్లని కలిశారు. తమ కుల దేవత ఆలయం కోసం, కమ్యూనిటీ బిల్డింగ్​ కోసం చందాలు ఇవ్వాలని  కోరారు.  ఇలా అన్ని నియోజక వర్గాల నుంచి కుల సంఘాల ప్రతినిధులు వస్తుండడంతో లీడర్లకు ఏమి చేయాలో అర్థం కావడం లేదు. కుల సంఘాలతో పాటు  యూత్​ సంఘాల లీడర్లను కూడా ఇప్పటి నుంచే మచ్చిక  చేసుకోవాల్సిన  పరిస్థితి ఏర్పడిందని లీడర్లు వాపోతున్నారు.