- ప్రభుత్వానికి రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సిఫార్సు
బషీర్‌బాగ్, వెలుగు : రిమాండ్‌లో ఉన్న ఖైదీ చనిపోవడంతో అతడి ఫ్యామిలీకి రూ. 5 లక్షల పరిహారం చెల్లించాలని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. 2017లో నిజామాబాద్ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీ మక్కల హన్మంతు టెలిఫోన్ వైర్‌తో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై హన్మంతు తండ్రి లక్ష్మణ్ అదే ఏడాది రాష్ట్ర మానవహక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశాడు.
మెజిస్టీరియల్ విచారణ రిపోర్ట్, ఫోరెన్సిక్ నివేదికల ఆధారంగా కమిషన్ విచారణ జరిపింది. జైలులో దొరికిన టెలిఫోన్ వైర్ కారణంగానే హన్మంతు ఉరి వేసుకున్నట్లు నిర్ధారించింది. ఈ ఘటనలో జైలు అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని కమిషన్ చైర్మన్ జస్టిస్ షమీమ్ అక్తర్ అభిప్రాయపడ్డారు.
రిమాండ్‌లో ఉన్న ఖైదీల ప్రాణరక్షణ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంటుందని, ఆర్టికల్ 21 ప్రకారం అండర్ ట్రయల్ ఖైదీలకు జీవించే హక్కు వర్తిస్తుందని కమిషన్ పేర్కొంది. మరణించిన వ్యక్తి కుటుంబానికి రూ. 5 లక్షల నష్టపరిహారాన్ని చెల్లించాలన్న సిఫార్సులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కమిషన్ జారీ చేసింది.
