ఫిబ్రవరి 27నే 6 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు

ఫిబ్రవరి 27నే 6 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు

ఫిబ్రవరి 27న త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. వీటితో పాటు 5 రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న 6 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. మహారాష్ట్రలో (కస్బా పేట్, చించ్వాడ్) స్థానాల్లో రెండు ఉప ఎన్నికలు జరగనుండగా, అరుణాచల్ ప్రదేశ్, జార్ఖండ్, పశ్చిమబెంగాల్, తమిళనాడులోని అసెంబ్లీ స్థానాల్లో ఒక్కొక్కటి చొప్పున ఉప ఎన్నికలు జరగనున్నాయి. వీటితో పాటుగా క్రిమినల్ కేసులో దోషిగా తేలిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) సభ్యుడు మహ్మద్ ఫైజల్‌పై అనర్హత వేటు వేయడంతో ఖాళీ అయిన లక్షద్వీప్ లోక్‌సభ స్థానానికి ఫిబ్రవరి 27నే పోలింగ్ జరగనుంది. 

అరుణాచల్ ప్రదేశ్‌లోని లుమ్లా స్థానం నుంచి ఎమ్మెల్యేగా ఉన్న జంబే తాషి మరణంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. మమతాదేవిపై అనర్హత వేటు వేయడంతో జార్ఖండ్‌లోని రామ్‌గఢ్  అసెంబ్లీ స్థానం కూడా ఖాళీ అయింది. తమిళనాడులోని ఈరోడ్ (తూర్పు) స్థానం ప్రస్తుత ఎమ్మెల్యే ఇ తిరుమహన్ ఎవరా మరణంతో ఖాళీ అయింది. పశ్చిమబెంగాల్‌లోని సాగర్‌డిఘి అసెంబ్లీ స్థానం ప్రస్తుత ఎమ్మెల్యే సుబ్రతా సాహా మరణంతో ఖాళీ అయింది. అన్ని ఉప ఎన్నికలకు ఈనెల 31న నోటిఫికేషన్ విడుదల కానుంది. మార్చి 2వ తేదీనే  ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.