మూడు మున్సి పాలిటీల్లో ఎన్నికలు

మూడు మున్సి పాలిటీల్లో ఎన్నికలు
  •     ఇబ్రహీంపట్నం, క్యాతనపల్లి, ఖానాపూర్​ ఎన్నికలకు షెడ్యూల్​ రిలీజ్​

హైదరాబాద్‌, వెలుగు: గతంలో వాయిదా పడిన మూడు మున్సిపాలిటీల్లో పాలకవర్గ ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది. ఈ నెల 4న చైర్​పర్సన్​, వైస్‌ చైర్​పర్సన్​ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ రాణి కుముదిని సోమవారం ఆదేశాలు జారీ చేశారు. ఇబ్రహీంపట్నం, క్యాతన్‌పల్లి, ఖానాపూర్‌ మున్సిపాలిటీలకు సంబంధించిన ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేస్తూ, ఆయా జిల్లాల కలెక్టర్లకు ఉత్తర్వులు పంపించారు. 

రాష్ట్రమంతటా ఫిబ్రవరి 11న పోలింగ్‌ జరగగా, 13న ఓట్ల లెక్కింపు చేపట్టారు. అనంతరం 16న కార్పొరేషన్లలో మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నికలు, మున్సిపాలిటీలలో చైర్​పర్సన్​, వైస్‌ చైర్​పర్సన్‌ ఎన్నికలు నిర్వహించారు. పార్టీల మధ్య తలెత్తిన వివాదాల కారణంగా 11 చోట్ల ఎన్నికలు వాయిదా పడ్డాయి. 

ఫిబ్రవరి 17న రెండోసారి ఎన్నికలు నిర్వహించినప్పటికీ, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం, మంచిర్యాల జిల్లా క్యాతన్‌పల్లి, నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌ మున్సిపాలిటీల్లో పాలకవర్గ ఎన్నికలు మరోసారి నిలిచిపోయాయి. ఈ మూడు మున్సిపాలిటీల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం మళ్లీ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఏప్రిల్‌ 2న నోటిఫికేషన్‌ విడుదల చేయాలని కమిషనర్‌ ఆదేశించారు. ఈ నెల 4న ఉదయం 11 గంటలకు ఎన్నికైన కౌన్సిలర్లతో ప్రమాణ స్వీకారం చేయించి, మధ్యాహ్నం 12.30 గంటలకు చైర్​పర్సన్​, వైస్‌ చైర్​పర్సన్​ ఎన్నికలు జరపాలని స్పష్టం చేశారు.