గ్రామ పంచాయతీలకు ఎన్నికలను నిర్వహించాలి : తమ్మినేని

గ్రామ పంచాయతీలకు ఎన్నికలను నిర్వహించాలి : తమ్మినేని

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని గ్రామపంచాయతీల కాలపరిమితి ఈ నెలాఖరుతో పూర్తవుతున్న నేపథ్యంలో తక్షణమే జీపీలకు ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని  సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కోరారు. పాలక వర్గాలను రద్దు చేసి స్పెషల్ ఆఫీసర్లను నియమించాలనే కాంగ్రెస్ సర్కారు ఆలోచన సరికాదని ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు ఎన్నుకున్న పాలకవర్గాల స్థానంలో ప్రత్యేక అధికారుల పాలనను సీపీఎం వ్యతిరేకిస్తుందని చెప్పారు.

73వ రాజ్యాంగ సవరణ ప్రకారం..  గ్రామ పంచాయతీలకు విధిగా ప్రతి ఐదేండ్లకొకసారి ఎన్నికలు జరపాలని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో సర్పంచులు అప్పులు చేసి గ్రామాల్లో వివిధ  అభివృద్ధి పనులు చేశారని వెల్లడించారు. ఆ బకాయిలను సర్కారు విడుదల చేయకపోవడంతో అప్పులు, వడ్డీలు చెల్లించలేక 28 మంది చనిపోయారని వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఎన్నికలు నిర్వహించి, గత బకాయిలను రిలీజ్ చేయాలని కోరారు.