
రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు ముహూర్తం ఖరారైంది. 131 మున్సిపాలిటీలకు ఈ నెల 30న ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించినట్లు తెలిసింది. ఈ ఎన్నికలను ఒకే విడతలో పూర్తి చేసేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆగస్టు 2న ఫలితాలు ప్రకటించి, 4న కొత్త పాలకవర్గాలతో ప్రమాణం చేయించడంతో ఎన్నికల ప్రకియను పూర్తి చేయాలని అధికారులు నిర్ణయించినట్లు సమాచారం. మున్సిపల్ ఎన్నికలపై శనివారం సీఎస్ ఎస్‌కే జోషి, డీజీపీ మహేందర్ రెడ్డి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ శ్రీదేవి, ఇతర ఉన్నతాధికారులతో రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ వి.నాగిరెడ్డి సమావేశం నిర్వహించారు. ఇందులో వార్డుల రిజర్వేషన్లు, ఓటర్ల జాబితా తయారీ, శాంతిభద్రతలు, కిందిస్థాయిలో శాఖల సన్నద్ధతపై చర్చించినట్లు తెలిసింది. ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నట్టు అన్ని శాఖల అధికారులు వెల్లడించడంతో ఈ నెల 30న ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. వార్డుల రిజర్వేషన్, తుది ఓటరు జాబితా ప్రచురణను ఈ నెల14వ తేదీలోగా పూర్తి చేసి 15 లేదా 16న షెడ్యూల్ ప్రకటించే అవకాశమున్నట్లు తెలిసింది.
ఓటరు జాబితా ప్రచురణ షెడ్యూల్ కుదింపు
ఎన్నికలను జూలైలో నిర్వహించేందుకు ఓటర్ల జాబితా ప్రచురణపై రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ నెల 2న ప్రకటించిన షెడ్యూల్‌లోనూ మార్పులు చేశారు. 12వ తేదీ నుంచి 18 వరకు ప్రకటించిన ఓటరు జాబితా షెడ్యూల్‌ను14వ తేదీకి కుదించారు. తాజా షెడ్యూల్ ప్రకారం.. ఈ నెల10న ముసాయిదా ఓటరు జాబితా ప్రదర్శన, 12వ తేదీ వరకు అభ్యంతరాల స్వీకరణ, 13న అభ్యంతరాలపై విచారణ, 14న తుది ఓటరు జాబితా ప్రచురణ ఉంటుంది. ఇవే తేదీల్లో మున్సిపల్ శాఖ అధికారులు కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్ల జాబితాను ప్రదర్శించి, అభ్యంతరాలను స్వీకరించి, తుది జాబితాను ప్రకటించనున్నారు. అలాగే 11న జిల్లా ఎన్నికల అధికారులు జిల్లా స్థాయిలో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించనున్నారు.