905 పీఏసీఎస్​లకు 15న ఎన్నికలు

905 పీఏసీఎస్​లకు 15న ఎన్నికలు

మొత్తం 11,765 డైరెక్టర్​ పోస్టులు
నిధులు లేక ఒక పీఏసీఎస్​ ఎన్నికల నిలిపివేత
పూర్తయిన ఏర్పాట్లు.. ఎన్నికల నోటీసులు జారీ
సమానంగా ఓట్లు వస్తే లాటరీ ద్వారా ఎంపిక
ఏర్పాట్లపై ప్రిన్సిపల్‌‌ సెక్రటరీ పార్థసారథి సమీక్ష

హైదరాబాద్‌‌, వెలుగు: రాష్ట్రంలో 905 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల(పీఏసీఎస్‌‌)లోని 11,765 డైరెక్టర్​ పదవులకు సహకార ఎన్నికల అథారిటీ సోమవారం ఎన్నికల నోటీసులను జారీ చేసింది. వాస్తవానికి 906 పీఏసీఎస్​లకు ఎన్నికలు జరగాల్సి ఉండగా.. మహబూబాబాద్​లోని ఒక పీఏసీఎస్​కు ఎన్నిక నిర్వహించడంలేదు. నిధులు లేకపోవడమే ఇందుకు కారణమని అధికారులు తెలిపారు. ఈ నెల 6 నుంచి 8 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 9న నామినేషన్ల పరిశీలన, 10న నామినేషన్ల ఉపసంహరణ, అభ్యర్థుల తుది జాబితా, గుర్తు కేటాయింపు చేస్తారు. ఈ నెల 15న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ నిర్వహించి, వెంటనే ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటించనున్నారు. కోఆపరేటివ్​ ఎలక్షన్ల ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్లు, ఆర్డీవోలు, జిల్లా సహకార అధికారులతో వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి సి.పార్థసారథి, ఆ శాఖ కమిషనర్​ జనార్దన్​రెడ్డి, సహకార శాఖ కమిషనర్​ వీరబ్రహ్మయ్య, సహకార ఎన్నికల అథారిటీ అధికారులు వీడియో కాన్ఫరెన్స్​ నిర్వహించారు.

ప్రతి పీఏసీఎస్​కు 13 మంది చొప్పున 905 పీఏసీఎస్​ల్లో 11,765 డైరెక్టర్​ పోస్టులకు ఎన్నికలు జరగనున్నాయి. 13 డైరెక్టర్​ పోస్టుల్లో రెండు మహిళలకు, రెండు బీసీలకు, ఒకటి ఎస్సీ, ఎస్టీల్లో ఎవరో ఒకరికి రిజర్వ్​ చేశారు. మిగతావి అన్‌‌రిజర్వుడ్​గా ఉంటాయి. 11,765 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ఎన్నికల నిర్వహణకు 30 వేల మంది సిబ్బందికి మొదటి విడత శిక్షణ పూర్తి చేసినట్లు సహకార శాఖ వర్గాలు వెల్లడించాయి. కోఆపరేటివ్​ సొసైటీల్లో పోటీ చేయాలనుకునే క్యాండిడేట్లు ఎస్‌‌సీ, ఎస్‌‌టీలైతే రూ.500, బీసీలైతే రూ.750, ఇతరులు రూ.వెయ్యి నామినేషన్ ఫీజు చెల్లించాలి. 2018 డిసెంబర్ లోపు సొసైటీల్లో సభ్యత్వం నమోదైన వారికే ఓటింగ్‌‌ అవకాశం కల్పిస్తారు. పోటీ చేసిన క్యాండిడేట్లకు సమానంగా ఓట్లు వస్తే లాటరీ ద్వారా విజేతను ఎంపిక చేస్తారు.

మరిన్ని వార్తల కోసం..