20 వేలకే ఎలక్ట్రిక్‌ బైక్‌

20 వేలకే ఎలక్ట్రిక్‌ బైక్‌

హైదరాబాద్‌‌లో చదువుకున్న తుమ్మ రాకేశ్‌కుమార్‌‌ తండ్రి తిరుపతి సింగరేణిలో పనిచేసేవాడు. 2013లో ఆయన చనిపోవడంతో డిపెండెంట్‌‌ కింద రాకేశ్‌కు ఉద్యోగం ఇచ్చారు. ఇప్పుడు జీడికె 11వ బొగ్గు గనిలో జనరల్‌‌ మజ్దూర్‌‌గా డ్యూటీ చేస్తున్నాడు. అయితే.. పొద్దంతా గనిలో పని చేసినా.. సాయంత్రం ఇంటికి వచ్చినప్పటినుంచి ఎలక్ట్రిక్‌ వస్తువులతో చిన్న చిన్న ప్రయోగాలు చేస్తుంటాడు. ఎక్కువగా పిల్లలు ఆడుకునేందుకు కార్లు తయారుచేసేవాడు. అయితే ప్రస్తుతం పెట్రోల్‌‌ ధరలు పెరుగుతుండడం చూసి తనవంతుగా ఏదైనా చేయాలనుకున్నాడు. ఆ ఆలోచనల్లో నుంచి పుట్టిందే ఈ బైక్‌. బ్యాటరీతో నడిచే బైక్‌ తయారుచేయాలని నిర్ణయించుకున్న వెంటనే అందుకు కావాల్సిన వస్తువులు కొన్నాడు. 36 వోల్ట్‌‌ 350 వాట్స్‌‌ మోటర్‌‌, 42 వోల్ట్‌‌ 26 ఏహెచ్‌‌ బ్యాటరీ కొని, లోకల్‌ వెల్డింగ్‌‌ షాప్‌‌లో ఫ్రేమ్‌‌ తయారు చేయించి బిగించాడు. కోల్‌‌కతా, పూణె నుంచి ఆన్‌‌లైన్‌‌లో బ్రేక్స్‌‌, ఐసోలేటర్‌‌, టైర్లు, మరికొన్ని స్పేర్‌‌ పార్ట్స్‌‌ తెప్పించాడు. నెల రోజుల్లో కేవలం రూ.20 వేల ఖర్చుతో బ్యాటరీ బైక్‌‌ను తయారుచేశాడు. దీనికి గంట ఛార్జింగ్‌‌ పెడితే 70 కిలోమీటర్ల వరకు నడుస్తుంది. గంటకు 30 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. ఇప్పుడు ఈ బైక్‌‌ మీద రాకేశ్‌‌కుమార్‌‌ చెక్కర్లు కొడుతుంటే చూసిన వాళ్ళు ఔరా! అంటున్నారు. 

తక్కువ దూరం వెళ్ళేవాళ్ల కోసం.. 
ఇప్పుడున్న పరిస్థితుల్లో పెట్రోల్‌‌ ధరలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. అందుకే దీన్ని తయారు చేశా. ఆడవాళ్లు, కాలేజీస్టూడెంట్స్‌, వయసు పైబడినవాళ్లకు ఈ బ్యాటరీ బైక్‌‌ చాలా ఉపయోగపడుతుంది. తక్కువ దూరం వెళ్ళే వాళ్లకు ఇది మంచి ఆప్షన్‌. చదువుకునే రోజుల్లో ప్రాజెక్ట్‌‌ వర్క్‌‌ కింద ఇలాంటివి చేయాలనుకున్నా. కానీ.. కుదరలేదు. ఇప్పుడు ఉద్యోగం చేస్తూ ఖాళీ టైమ్‌‌లో ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌‌ తయారు చేస్తూ ఆ కోరిక తీర్చుకుంటున్నా అని చెప్పాడు రాకేశ్​కుమార్​. 
::: గోదావరిఖని, వెలుగు