కరెంట్ సమస్యలపై లోకల్ కోర్టుకు రండి! ..కస్టమర్ల కోసం టీజీఎన్పీడీసీఎల్ నిర్వహణ

కరెంట్ సమస్యలపై లోకల్ కోర్టుకు రండి! ..కస్టమర్ల కోసం టీజీఎన్పీడీసీఎల్ నిర్వహణ
  •     ఈ నెల 3  నుంచి 17 వరకు సర్కిళ్లలో ఏర్పాటు 
  •     విద్యుత్ సమస్యలపై ఫిర్యాదులు అందించాలి
  •     కన్స్యూమర్స్ గ్రీవెన్స్ రిడ్రసల్ ఫోరం ప్రకటన

హనుమకొండ, వెలుగు: టీజీఎన్పీడీసీఎల్ పరిధిలో వినియోగదారుల విద్యుత్ సమస్యల పరిష్కారానికి సర్కిళ్ల వారీగా లోకల్ కోర్టులు నిర్వహిస్తున్నట్లు కన్స్యూమర్స్ గ్రీవెన్స్ రిడ్రసల్ ఫోరం(సీజీఆర్ఎఫ్) చైర్మన్ ఎన్వీ. వేణుగోపాలాచారి తెలిపారు. ఇందుకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు.

 హనుమకొండ, కరీంనగర్, పెద్దపల్లి, జనగామ, ఖమ్మం సర్కిళ్ల పరిధిలో ఈనెల 3 నుంచి 17 వరకు లోకల్ కోర్టులు  కొనసాగుతాయని పేర్కొన్నారు. సర్కిళ్ల వారీగా ప్రకటించిన తేదీల్లో వినియోగదారులు ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు తమ సమస్యలను లోకల్ కోర్టుకు తెలుపవచ్చన్నారు.  విద్యుత్ సరఫరాలో అంతరాయాలు, వోల్టేజీ సమస్యలు,  మీటర్, బిల్లులో సమస్యలు, కొత్త సర్వీసులు, వివిధ సేవల జాప్యం, రిజెక్షన్స్, ఇతర సేవల్లో ఎలాంటి సమస్యలనైనా లోకల్ కోర్టు దృష్టికి తీసుకొస్తే, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. 

ఈ లోకల్ కోర్టులో  కన్స్యూమర్స్ గ్రీవెన్స్ రిడ్రసల్ ఫోరం మెంబర్ ఫైనాన్స్  దేవేందర్, టెక్నికల్ మెంబర్ రమేశ్ పాల్గొంటారన్నారు.  వినియోగదారుల సమస్యలకు పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటారని వివరించారు. 

 షెడ్యూల్ ఇలా...

ఈ నెల 3న కరీంనగర్ సర్కిల్ లో  హుజురాబాద్ డివిజన్ పరిధి జమ్మికుంట సబ్ డివిజన్, ఇల్లందకుంట సెక్షన్ ఆఫీస్ లో లోకల్ కోర్టు నిర్వహిస్తారు.  ఇల్లందకుంట, చల్లూర్,  జమ్మికుంట టౌన్, రూరల్, తనుగుల, వీణవంక మండలాల పరిధిలోకి వచ్చే వినియోగదారులు హాజరుకావాలి.
 ఈ నెల4న పెద్దపల్లి సర్కిల్ లో  మంథని డివిజన్ పరిధి ఎక్లాసపూర్  33/11 కేవీ సబ్  స్టేషన్  పరిధిలో  ఎక్లాసపూర్, బేగంపేట్, కమాన్ పూర్, మంథని టౌన్, ముత్తారం మండలాల వినియోగదారులు లోకల్ కోర్టు రావాలి.  

 ఈ నెల 9న హనుమకొండ సర్కిల్ లోని హనుమకొండ రూరల్ డివిజన్ పరిధిలోని ఐనవోలు 33/11 కేవీ సబ్ స్టేషన్ కు చెందిన ఐనవోలు, ధర్మసాగర్, పంథిని ప్రాంతాల వినియోగదారులు లోకల్ కోర్టుకు  హాజరుకావాలి. 

ఈనెల11న జనగామ సర్కిల్ పరిధి జనగామ డివిజన్,  రఘునాథపల్లి  సబ్ డివిజన్ పరిధిలోని నర్మెట్ట, కులీషాపుర్, రఘునాథపల్లి, తరిగొప్పుల  ప్రాంతాల వినియోగదారులకు నర్మెట్ట 33/11 కేవీ సబ్ స్టేషన్ లో జరిగే లోకల్ కోర్టుకు రావాలి.  

ఈనెల16న ఖమ్మం సర్కిల్ పరిధిలో ఖమ్మం డివిజన్, పెద్దగోపతి సబ్ డివిజన్ పరిధిలోని కొణిజెర్ల సెక్షన్ తనికెళ్ల రైతు వేదికలో  కొణిజెర్ల, చింతకాని, నాగులవంచ, పెద్దగోపతి ప్రాంతాల వినియోగదారులు లోకల్ కోర్టు హాజరుకావాలి.  

 ఈనెల17న ఖమ్మం సర్కిల్ పరిధిలోని  ఖమ్మం రూరల్ డివిజన్, ముదిగొండ సబ్ డివిజన్ పరిధిలోని ముదిగొండ, పమ్మి  ప్రాంతాల కన్స్యూమర్స్ కు 33/11 కేవీ ముదిగొండ సబ్ స్టేషన్ లో లోకల్ కోర్టు నిర్వహిస్తారు.