త్వరలో కరెంటు చార్జీల పెంపు

త్వరలో కరెంటు చార్జీల పెంపు
  • ప్రతిపాదనలు సిద్ధం చేసిన విద్యుత్ పంపిణీ సంస్థలు
  • డొమెస్టిక్‌‌ కేటగిరీలో యూనిట్‌‌కి 50 పైసలు పెంపు?
  • 200 యూనిట్లు దాటితే రూ.1
  • కమర్షియల్, హెచ్‌‌టీ కేటగిరీలకు మరింత ఎక్కువ
  • సీఎం ఆమోదం తర్వాత అమల్లోకి!

హైదరాబాద్‌‌, వెలుగు: కరెంట్ చార్జీలు పెంచేందుకు విద్యుత్ పంపిణీ సంస్థలు రెడీ అయ్యాయి. అగ్రిగేట్‌‌ రెవెన్యూ రిక్వైర్‌‌మెంట్‌‌ (ఏఆర్‌‌ఆర్‌‌) టారీఫ్‌‌ ప్రతిపాదనలకు నవంబరు 30తో గడువు ముగియనుండటంతో ఈయేడు ఆదాయం, వ్యయ అవసరాలకు సంబంధించి రిపోర్టులు సిద్ధం చేశాయి. డొమెస్టిక్‌‌, కమర్షియల్‌‌, హెచ్‌‌టీ.. ఇలా అన్ని కేటగిరీల చార్జీలు పెంచాలని డిస్కమ్‌‌లు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సీఎం కేసీఆర్‌‌ ఆమోదం కోసం అధికారులు ఎదురు చూస్తున్నారు. త్వరలోనే కొత్త చార్జీలు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. 
కమర్షియల్, హెచ్‌‌టీ (ఇండస్ట్రియల్), డొమెస్టిక్ కేటగిరీల చార్జీలను డిస్కమ్‌‌లు పెంచనున్నాయి. ఇండ్లకు సంబంధించిన విద్యుత్‌‌ చార్జీల్లో 0–50 యూనిట్ల దాకా ఒక్కో యూనిట్‌‌కు రూ.1.45, 51–100 యూనిట్ల దాకా రూ.2.60, 0–100 యూనిట్ల వరకు రూ.3.30, 101–200 యూనిట్ల వరకు రూ.4.30 ప్రస్తుతం వసూలు చేస్తున్నారు. ఈ కేటగిరీల్లో ఇండ్లకు ప్రతి యూనిట్‌‌కు రూ.50 పైసలు పెంచాలని ప్రతిపాదన చేసినట్లు సమాచారం. అంతకంటే ఎక్కువ కరెంటు ఉపయోగించే వినియోగదారులకు యూనిట్‌‌కు రూ.1 వరకు, కమర్షియల్‌‌, ఇండస్ట్రియల్‌‌ వినియోగదారులకు ఇంకా ఎక్కువే పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. స్లాబ్‌‌లను కూడా మార్చే అవకాశం ఉందని డిస్కంల వర్గాలు చెబుతున్నాయి. కాగా, 2016-–17 ఫైనాన్షియల్‌‌ ఇయర్‌‌‌‌లో పెంచిన కరెంటు చార్జీలే ఇప్పటిదాకా కొనసాగుతున్నాయి. అప్పుడు డొమెస్టిక్‌‌ చార్జీలు మినహా కమర్షియల్‌‌, హెచ్‌‌టీ కనెక్షన్లకు చార్జీలు పెంచారు. ఇప్పుడు అన్ని కేటగిరీల చార్జీలను పెంచే అవకాశం ఉంది.
నాలుగేళ్ల ఏఆర్‌‌ఆర్‌‌ ప్రతిపాదనలు ఒకేసారి
మూడేళ్లుగా విద్యుత్‌‌ సంస్థలు ఏఆర్‌‌ఆర్‌‌ ప్రతిపాదనలు ఇవ్వడం లేదు. చివరిసారిగా 2018-–19లో మాత్రమే విద్యుత్‌‌ నియంత్రణ మండలి(ఈఆర్‌‌సీ)కి ఏఆర్‌‌ఆర్‌‌ ఫైల్‌‌ చేశాయి. 2019-–20, 2020-–21, 2021–-22 ఫైనాన్షియల్‌‌ ఇయర్‌‌లో ఫైల్‌‌ దాఖలు చేయాల్సి ఉంది. తాజాగా వచ్చే ఫైనాన్షియల్‌‌ ఇయర్‌‌ 2022–-23కు దాఖలు చేయడానికి నవంబరు 30 వరకే గడువు ఉంది. ఇప్పుడు ఒకే సారి నాలుగేళ్ల ఏఆర్‌‌ఆర్‌‌లు సమర్పించాల్సి ఉంది.