లాండ్రీలు, సెలూన్లపైకరెంటు చార్జీల మోత

లాండ్రీలు, సెలూన్లపైకరెంటు చార్జీల మోత

రాష్ట్రంలో రెప్పపాటు కూడా కోతల్లేకుండా కరెంట్ సరఫరా చేస్తున్నామని, 24 గంటలు వ్యవసాయానికి, రజకులకు, నాయీ బ్రాహ్మణులకు ఉచిత విద్యుత్ ఇస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం.. సబ్సిడీల నష్టాన్ని మాత్రం డిస్కమ్​లకు చెల్లించడం లేదు. మిషన్ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టు పంప్ హౌస్​ల కరెంట్ బిల్లులతో పాటు వివిధ ప్రభుత్వ శాఖల నుంచి వేల కోట్ల రూపాయల బిల్లులు పేరుకుపోయాయి. నష్టాలకు కారణమైన బకాయిల్లో ప్రభుత్వం చెల్లించాల్సిన సబ్సిడీతోపాటు వివిధ ప్రభుత్వ శాఖల నుంచి రావాల్సిన 54 శాతం పెండింగ్ బిల్లులు ఉన్నాయి. అందుకే ఈ లోటును పూడ్చుకునేందుకు డిస్కమ్​లు ఏసీడీ డ్యూ, ఎరియర్స్, డెవలప్ మెంట్ చార్జీల్లాంటి రకరకాల మార్గాలు వెతుకుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

వరంగల్ ప్రతినిధి, వెలుగు:  
కుల వృత్తిని నమ్ముకున్న రజకులు, నాయీ బ్రాహ్మణులకు రాష్ట్ర సర్కార్ షాక్ ఇస్తోంది. ఈ వర్గాలకు 250 యూనిట్ల వరకు కరెంట్ ఫ్రీ అంటూనే ఏసీడీ డ్యూ, ఎరియర్స్ అంటూ చార్జీల మోత మోగిస్తోంది. ఈ ఏడాదిలో ఒకసారి కనెక్టెడ్ లోడ్ పెరిగిందంటూ డెవలప్ మెంట్ చార్జీలు, అడ్వాన్స్ కన్జంప్షన్ డిమాండ్(ఏసీడీ) డ్యూ పేరిట ఒక్కో ఇంటి కనెక్షన్ పై రూ.3 వేల నుంచి రూ.5 వేలు బాదిన ఎన్పీడీసీఎల్ ఈ సారి లాండ్రీ షాపులు, సెలూన్లపై పడింది. రెండు నెలలుగా ఈ షాపులకు వస్తున్న కరెంట్ బిల్లులు రజకులు, నాయీ బ్రాహ్మణులను వణికిస్తున్నాయి. ఉచిత కరెంట్ ఇస్తున్నామని ఊదరగొట్టడం ఎందుకు? ఇలా ఏదో ఒక పేరుతో బిల్లులు వేయడం ఎందుకని వారు వాపోతున్నారు. అదనపు చార్జీల పేరిట భారీగా వడ్డిస్తుండటంతో లబోదిబోమంటున్నారు.   

ఏడాదిన్నరకే ఉచితానికి మంగళం  
రజకులు, నాయీ బ్రాహ్మణులకు ప్రభుత్వం లాండ్రీలు, ధోబీ ఘాట్లు, సెలూన్లకు ప్రతి నెలా 250 యూనిట్ల విద్యుత్‌‌ వరకు సబ్సిడీ ఇస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా 2 లక్షల మంది రజకులు, 70 వేల మంది నాయీ బ్రాహ్మణులకు లబ్ధి చేకూరుతుందని అంచనా వేశారు. అయితే ఎన్పీడీసీఎల్‌‌ పరిధిలో ఈ షాపులకు ఇప్పుడు ఏసీడీ, ఎరియర్స్ పేరిట చార్జీలు విధించడం ద్వారా ఉచితానికి మరో రూపంలో మంగళం పాడుతోందని రజక, నాయీబ్రాహ్మణ నేతలు ఆరోపిస్తున్నారు. 

ఏసీడీ చార్జీల పేరిట వసూళ్లు  
సాధారణంగా ఎవరైనా కన్జూమర్ కరెంట్ బిల్లు ఎగ్గొడితే.. ఏసీడీ చార్జీల రూపంలో ముందే వసూలు చేసిన సెక్యూరిటీ డిపాజిట్ ను బిల్లుగా అడ్జస్ట్ చేయడం వల్ల డిస్కంలకు ఎలాంటి నష్టం ఉండదు. అయితే, ఈ విధానం లక్షల్లో బిల్లులు వచ్చే ఇండస్ట్రీస్, సంస్థలకే వర్తించేది. కానీ, దీనిని ఈ ఏడాది డొమెస్టిక్ కనెక్షన్లకు కూడా వర్తింపజేసిన విద్యుత్ పంపిణీ సంస్థలు.. ఈ సారి లాండ్రీలు, సెలూన్లకు అమలు చేస్తున్నాయి. ఫ్రీ కరెంట్ అని ప్రకటించాక.. బిల్లు ఎగ్గొట్టడమనే ప్రశ్నే రాదని, అయినా ఏసీడీ చార్జీలు ఎందుకు వసూలు చేస్తున్నారని రజకులు, నాయీ బ్రాహ్మణులు ప్రశ్నిస్తున్నారు.  

నెలలో కొందరికి చొప్పున చార్జీలు  
ఏసీడీ డ్యూస్, ఎరియర్స్ వసూళ్లలో విద్యుత్ సంస్థలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. ఒక ప్రాంతం అందరికీ ఒకే నెలలో ఈ చార్జీలు కలిపితే ఆయా అసోసియేషన్ల నుంచి వ్యతిరేకత వస్తుందని, ఆందోళనకు దిగుతారని ఒక నెలలో కొందరికి.. మరొక నెలలో మరికొందరికి చార్జీలు వేస్తుండడం గమనార్హం. ఇది విడతలవారీగా ఏడాదిపాటు సాగుతూనే ఉంటుందని ఎన్పీడీసీఎల్ కు చెందిన ఓ ఉన్నతాధికారి వెల్లడించారు.