ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ ఉంటేనే విద్యుత్ కనెక్షన్.. ఓ కేసులో హైకోర్టు కీలక తీర్పు

ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ ఉంటేనే విద్యుత్ కనెక్షన్.. ఓ కేసులో హైకోర్టు కీలక తీర్పు

హైదరాబాద్, వెలుగు: బహుళ అంతస్తుల భవనాలకు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ లేకుండా విద్యుత్, నీరు, డ్రైనేజీ కనెక్షన్లు ఇవ్వడానికి వీల్లేదని హైకోర్టు తీర్పు వెలువరించింది.  తాను ఐదు అంతస్తుల భవనాన్ని జీహెచ్‌‌ఎంసీ అనుమతులతో నిర్మించానని.. అయితే, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ లేనందుకు టీజీఎస్పీడీసీఎల్ తనకు విద్యుత్ కనెక్షన్ నిరాకరించిందని హైదరాబాద్‌‌ నాంపల్లికి చెందిన మహమ్మద్ ఆరిఫ్ రిజ్వాన్ హైకోర్టును ఆశ్రయించాడు. ఈ పిటిషన్ ను విద్యుత్ కనెక్షన్ విచారించారు. పిటిషనర్ తరఫు అడ్వకేట్ వాదిస్తూ..గతంలో కొన్ని కేసుల్లో  ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ తర్వాత సమర్పిస్తామనే హామీతో తాత్కాలిక విద్యుత్ కనెక్షన్లు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించిన ఉత్తర్వులను ఉటంకించారు.

అయితే, టీజీఎస్పీడీసీఎల్ తరఫు అడ్వకేట్ వాదిస్తూ.. గతంలో ఇలాంటి హామీలతో విద్యుత్ కనెక్షన్లు పొందిన వారిలో చాలా మంది ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ సమర్పించలేదని, దీనిని దుర్వినియోగం చేస్తున్నారని వాదించారు. జస్టిస్ నగేశ్ భీమపాక.స్పందిస్తూ...బిల్డర్లు ప్లాన్ ప్రకారమే ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ లేకుండా హామీలతో విద్యుత్, నీరు, డ్రైనేజీ కనెక్షన్లు పొంది, తర్వాత ఆ అక్రమ నిర్మాణాలను విక్రయిస్తున్నారని తెలిపారు. సుప్రీం కోర్టు మార్గదర్శకాల ప్రకారం..ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ లేని భవనాలకు విద్యుత్, నీరు, డ్రైనేజీ కనెక్షన్లు ఇవ్వకూడదన్నారు. కాబట్టి అక్యుపెన్సీ సర్టిఫికెట్‌‌ తరువాత సమర్పిస్తామన్న హామీపై విద్యుత్తు కనెక్షన్‌‌ ఇవ్వాలనే ఉత్తర్వులు జారీ చేయబోమని స్పష్టం చేశారు. పిటిషనర్‌‌ ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌‌తీసుకున్నాకే విద్యుత్‌‌ కనెక్షన్‌‌ పొందాలని తీర్పు వెలువరించారు.