వర్షాలతో విద్యుత్ శాఖ అలర్ట్

వర్షాలతో విద్యుత్ శాఖ అలర్ట్
  • వర్షాలతో విద్యుత్ శాఖ అలర్ట్
  • ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు

హైదరాబాద్‌‌, వెలుగు: రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో విద్యుత్ శాఖ అప్రమత్తమైంది. కరెంట్ సరఫరాకు అంతరాయం కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని అధికారులను డిస్కంల సీఎండీలు ఆదేశించారు. వర్షాలతో పొంచి ఉన్న విద్యుత్‌‌ ప్రమాదాలపై ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. వరదల కారణంగా నీట మునిగిన ప్రాంతాల్లో ముందు జాగ్రత్త చర్యగా డిస్ట్రిబ్యూటరీ ట్రాన్స్ ఫార్మర్లకు కరెంటు సరఫరా నిలిపివేస్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్‌‌, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురవడంతో చాలాచోట్ల ఇండ్లలోకి వరద చేరింది. ఆయా ప్రాంతాల్లో కరెంట్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. కొన్ని ప్రాంతాల్లో ముందు జాగ్రత్త చర్యగా అధికారులు సరఫరాను నిలిపివేశారు. ‘‘రోడ్లపై, బిల్డింగులపై తెగి పడ్డ తీగల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ ఫార్మర్లు, సర్వీస్ వైర్ల దగ్గర జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇబ్బందులుంటే వెంటనే ఫిర్యాదు చేయాలి. పట్టణాల్లోని అపార్ట్ మెంట్ల సెల్లార్లలోకి వరద చేరినా, కరెంట్ వోల్టేజ్​లో మార్పులు ఉన్నా విద్యుత్ శాఖకు తెలియజేయాలి” అని అధికారులు కోరారు. 

పడిపోయిన విద్యుత్‌‌ డిమాండ్‌‌

వర్షాలతో వాతావరణం చల్లబడడంతో రాష్ట్రంలో విద్యుత్‌‌ డిమాండ్‌‌ తగ్గింది. ఈ నెల ప్రారంభంలో 9,339 మెగావాట్ల విద్యుత్‌‌ డిమాండ్‌‌ ఉండగా, శుక్రవారం నాటికి 8,367 మెగావాట్లకు, శనివారం 6 వేల మెగావాట్లకు పడిపోయింది. సమస్యలుంటే ఫిర్యాదు చేయండి.. విద్యుత్ సంబంధిత ఫిర్యాదుల కోసం స్కాడా ఆధ్వర్యంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగితే 1912 /100/ స్థానిక ఫ్యూజ్ ఆఫ్ కాల్ ఆఫీస్​కు ఫోన్ చేయొచ్చు. హైదరాబాద్‌‌ కేంద్రంగా ఉన్న సదరన్‌‌ డిస్కం పరిధిలో 73820 72104, 73820 72106, 73820 71574 నంబర్లకు... వరంగల్‌‌ కేంద్రంగా ఉన్న నార్తర్న్‌‌ డిస్కం పరిధిలో 94408 11244, 94408 11245 నంబర్లకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయొచ్చు. ఇవే కాకుండా విద్యుత్‌‌ సంస్థల మొబైల్ యాప్, వెబ్ సైట్, ట్విట్టర్, ఫేస్ బుక్ వంటి సోషల్ మీడియా ద్వారాను సమస్యలను విద్యుత్ సంస్థల దృష్టికి తీసుకువచ్చేందుకు అవకాశం కల్పించినట్లు సదరన్‌‌ డిస్కం సీఎండీ జి.రఘుమా రెడ్డి , నార్తర్న్‌‌ డిస్కం సీఎండీ గోపాల్‌‌రావు తెలిపారు.