
కొండగట్టు/చొప్పదండి/ఇల్లందకుంట/ ముత్తారం, వెలుగు: పెద్ద హనుమాన్ జయంతి వేడుకలు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఘనంగా జరిగాయి. కొండగట్టులో మూడు రోజులుగా జరుగుతున్న పెద్దహనుమాన్ జయంతి ఉత్సవాలు గురువారం ముగిశాయి. చివరి రోజు హనుమాన్ మాలధారులు, భక్తులు భారీగా తరలిచ్చారు. మాలధారులు దీక్షను విరమించారు. చొప్పదండిలోని పోస్టాఫీసు సమీపంలోని హనుమాన్ దేవాలయంలో గురువారం ప్రత్యేక పూజలు చేపట్టారు. ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయం హనుమాన్ భక్తుల నామస్మరణతో మార్మోగింది.
వివిధ గ్రామాలకు చెందిన హనుమాన్ మాలధారులు ఇల్లందకుంట సీతారామచంద్రస్వామి ఆలయ ప్రాంగణంలోని హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి దీక్షను విరమించారు. జమ్మికుంట పట్టణంలోని భక్తాంజనేయ స్వామి దేవాలయం, పంచముఖ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేసినట్లు ఆలయ సీఈవో సుధాకర్ పేర్కొన్నారు. ముత్తారం మండలం లక్కారం, మైదంబండ గ్రామాల్లో హనుమాన్‌జయంతిని ఘనంగా నిర్వహించారు. మైదంబండలో శోభాయాత్ర నిర్వహించారు. అనంతరం దీక్ష విరమణకు భద్రాచలం బయలుదేరి వెళ్లారు.
కొండగట్టులో వృద్ధురాలికి అస్వస్థత
జగిత్యాల, వెలుగు: హనుమాన్ జయంతి సందర్భంగా కొండగట్టు ఆలయంలో అంజన్న దర్శనానికి వచ్చిన ఓ వృద్ధురాలు అస్వస్థతకు గురైంది. అక్కడే విధులు నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుల్ స్వరూప గమనించి ఆమెను ఎత్తుకొని సుమారు 100 మీటర్ల దూరంలో ఉన్న 108 అంబులెన్స్‌లోకి ఎక్కించింది. అనంతరం హాస్పిటల్‌కు
తరలించింది.