
హైదరాబాద్: చీటింగ్ కేసులో అరెస్ట్ అయిన శ్రవణ్ రావును సీసీఎస్ పోలీసులు కస్టడీలోకి తీసుకోనున్నారు. రూ.6.50 కోట్లు తీసుకొని తనను మోసం చేశాడని శ్రవణ్ రావుపై ఆకర్ష్ కృష్ణ అనే వ్యక్తి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో అరెస్ట్ అయ్యి జ్యుడిషియల్ రిమాండ్లో భాగంగా ప్రస్తుతం చంచల్ గూడ జైల్లో ఉన్న శ్రవణ్ రావును కస్టడీకి ఇవ్వాలని సీసీఎస్ పోలీసులు కోరారు.
కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు రాబట్టేందుకు నిందితుడు శ్రవణ్ రావును ఐదు రోజులు తమ కస్టడీకి ఇవ్వాలని ఈ మేరకు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై శుక్రవారం (మే 23) విచారణ చేపట్టిన నాంపల్లి కోర్టు.. కేవలం ఒక్క రోజు మాత్రమే పోలీస్ కస్టడీకి ఇచ్చేందుకు అనుమతించింది.
తిరిగి సాయంత్రం 5:30 గంటలకు నిందితుడిని కోర్టులో హాజరు పర్చాలని పోలీసులను ఆదేశించింది. దీంతో చంచల్ గూడ జైల్లో ఉన్న శ్రవణ్ రావును పోలీసులు కస్టడీలోకి తీసుకుని ఇంటరాగేట్ చేయనున్నారు. కాగా, తెలంగాణ పాలిటిక్స్ ను షేక్ చేసిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కూడా శ్రవణ్ రావు కీలక నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. ఈ కేసులో కూడా ఆయన సిట్ విచారణ ఎదుర్కొంటున్నారు.