
- పంచముఖ ఆంజనేయస్వామి ఆలయంలో ముగిసిన వేడుకలు
- హాజరైన చినజీయర్ స్వామి
- ఆలయ నిర్మాణానికి రూ.1.16 లక్షలు అందజేత
కోల్‌బెల్ట్, వెలుగు: మందమర్రి పంచముఖ హనుమాన్ ఆలయ రజతోత్సవాల్లో భాగంగా సీతారాముల కల్యాణాన్ని గురువారం కనులపండువగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన శ్రీత్రిదండి రామానుజ చినజీయర్ స్వామి, శ్రీ దేవానంద రామానుజ స్వామి సమక్షంలో వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య కల్యాణాన్ని సంప్రదాయబద్ధంగా జరిపారు. ఈ సందర్భంగా చినజీయర్ స్వామి మాట్లాడుతూ.. దేవుడి పట్ల భక్తిభావం పెంచుకోవాని, ప్రాణుల పట్ల దయాగుణం కనబర్చాలన్నారు. హనుమంతుడి జీవిత చరిత్రను అనుసరించాలని సూచించారు.
రజతోత్సవాల సందర్భంగా ఆలయంలో ఆరు రోజుల పాటు నిర్వహించిన వేడుకలు ముగిశాయి. చివరి రోజు జరిగిన సీతారాముల కల్యాణ వేడుకలను భక్తులు వేలాదిగా తరలివచ్చారు. సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు, సింగరేణి డైరెక్టర్(ఈఎం) సత్యనారాయణ, మందమర్రి ఏరియా జీఎం జి.దేవేందర్, సోలార్‌ఎనర్జీ జీఎం జానకీరామ్, ఆలయ ధర్మకర్త కల్వకుంట్ల సురేందర్ రావు కుటుంబ సభ్యులు, బీజేపీ జిల్లా మాజీ ప్రెసిడెంట్ రాఘునాథ్ వెరబెల్లి, పలువురు రాజకీయ, ఆఫీసర్లు పూజల్లో పాల్గొన్నారు.
కోదండరామాలయం, బొక్కలగుట్ట ఆలయాల సందర్శన
మందమర్రి మండలం ఊరుమందమర్రిలో కొత్తగా నిర్మించిన కోదండరామాలయాన్ని, బొక్కలగుట్టలోని బాలాజీ వెంకటేశ్వరస్వామి, హనుమాన్ ఆలయాలను చినజీయర్ స్వామి, దేవానంద రామానుజ స్వామి సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. బొక్కలగుట్ట రుష్యమూక పర్వతంపై ఉన్న వెంకటేశ్వరస్వామి ఆలయం ఆర్చ్ నిర్మాణానికి భూమిపూజ చేశారు. తమ వంతుగా రూ.1.16 లక్షలు అందించారు.