డిప్యూటీ సీఎం భట్టి ఆర్డర్స్.. హైదరాబాద్ సిటీ చుట్టూ.. విద్యుత్‌ స్తంభాలపై కేబుల్‌ వైర్లను పీకేస్తున్నారు !

డిప్యూటీ సీఎం భట్టి ఆర్డర్స్.. హైదరాబాద్ సిటీ చుట్టూ.. విద్యుత్‌ స్తంభాలపై కేబుల్‌ వైర్లను పీకేస్తున్నారు !

హైదరాబాద్: విద్యుత్‌ స్తంభాలపై కేబుల్‌ వైర్లను తొలగించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. కేబుల్‌ వైర్లు యుద్ధ ప్రాతిపదికన తొలగించాలని భట్టి ఆదేశించడంతో విద్యుత్ శాఖ రంగంలోకి దిగింది. మేడ్చల్ జిల్లా కీసరలో కరెంట్ స్తంభాలకు ఉన్న కేబుల్ వైర్లను విద్యుత్ అధికారులు కట్ చేయించేసే పనిలో ఉన్నారు. మేడ్చల్ పరిధిలో ఒక్కసారిగా ఇంటర్ నెట్ సేవలు నిలిచిపోయాయి. వైఫై కనెక్షన్లు ఉన్నట్టుండి ట్రబుల్ ఇవ్వడంతో ఏం జరిగిందో అర్థం కాక పబ్లిక్ మొబైల్ ఇంటర్ నెట్ వాడుతున్నారు. అనుమతి లేకుండా విద్యుత్‌ కనెక్షన్లు ఏర్పాటు చేసుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని డిప్యూటీ సీఎం భట్టి ఇప్పటికే హెచ్చరించారు. 

ఏడాది సమయం ఇచ్చినా ఆపరేటర్లు స్పందించలేదని, ప్రజల ప్రాణాలతో చెలగాటం సరైంది కాదని.. చూస్తూ ఊరుకోమని -డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హెచ్చరించారు. కేబుల్ తీగలను కట్ చేస్తుండటంపై నిరసన వ్యక్తం చేస్తూ హైదరాబాద్లో కేబుల్ ఆపరేటర్లు ఆందోళనకు దిగారు. రామంతాపూర్ ఘటనకు కేబుల్ వైర్లు కారణం కాదని, కేబుల్ వైర్లలో విద్యుత్ ప్రసారం కాదని ఆపరేటర్లు చెప్పారు. కేబుల్ వైర్లు తొలగిస్తే లక్షల మంది ఉపాధి కోల్పోతారని, వర్క్ ఫ్రం హోం చేస్తున్న ఉద్యోగులు ఇబ్బంది పడతారని TGSPDCL కార్యాలయం ఎదుట కేబుల్ ఆపరేటర్లు ధర్నాకు దిగారు.
 
కేబుల్ వైర్ల వల్లే రామంతాపూర్ దుర్ఘటన జరిగిందని విద్యుత్ శాఖ సీఎండీ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. రామంతాపూర్ పరిధిలో శ్రీకృష్ణుడి ఊరేగింపు రథానికి ఆగస్టు 17న రాత్రి 12 గంటలకు విద్యుత్ తీగలు తగలడంతో ప్రమాదం జరిగింది. రాత్రి శోభాయాత్ర ముగిసిన తర్వాత రథాన్ని తీసుకెళ్లే జీపు మొరాయించడంతో యువకులు స్వయంగా లాక్కొని వెళ్లారు. 

Also read:-హైదరాబాద్ సిటీలో ఇంటర్నెట్ కల్లోలం: వైర్ల కటింగ్‎తో వ్యాపారులు, కస్టమర్ల ఆందోళన

హై టెన్షన్ వైర్ల నుంచి కిందికి ఒక వైర్ వేలాడుతుండడంతో రథానికి తాకి నిప్పు రవ్వలు వచ్చాయి. రథాన్ని పట్టుకున్న వాళ్లంతా ఒక్కసారిగా దూరంగా పడిపోయారు. రథం పట్టుకొని లాక్కెళుతున్న వారికి  కరెంట్ షాక్ కొట్టింది. పోలీసులు స్పాట్ కు వచ్చిన తర్వాత వారి వాహనంలో అందరినీ హాస్పిటల్ కి తరలించారు. అయితే  హాస్పిటల్ వెళ్లేలోపే ఐదుగురు చనిపోయారని వైద్యులు చెప్పారు. ఈ ఘటనలో మొత్తం ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.