Asia Cup 2025: చివరి 7 మ్యాచ్‌ల్లో 67 పరుగులు.. ఆసియా కప్‌కు గోల్డెన్ ఛాన్స్ అంటే ఇతనిదే

Asia Cup 2025: చివరి 7 మ్యాచ్‌ల్లో 67 పరుగులు.. ఆసియా కప్‌కు గోల్డెన్ ఛాన్స్ అంటే ఇతనిదే

టీమిండియా ఫినిషర్ గా పేరు తెచ్చుకున్న రింకూ సింగ్ కు ఆసియా కప్ లో చోటు దక్కించుకున్నాడు. పేలవ ఫామ్ లో ఉన్న రింకుకి చోటు దక్కడం కాస్త ఆశ్చర్యానికి గురి చేసింది. ఎందుకంటే రింకూ టీ20 రికార్డ్ ఏడాది నుంచి ఘోరంగా ఉంది. ఫినిషర్ గా రింకూకు సెలక్టర్లు మరొక అవకాశాన్ని ఇచ్చినట్టు తెలుస్తోంది. అయ్యర్, జైశ్వాల్ సూపర్ ఫామ్ లో ఉన్న వీరికి దక్కని అవకాశం ఈ ఉత్తర ప్రదేశ్ ఆటగాడికి దక్కింది. 2023 ఐపీఎల్ సీజన్ లో రింకూ సింగ్ ఒక్కసారిగా స్టార్ ఆటగాడి లిస్టులోకి చేరాడు. ఇన్నింగ్స్‌ చివరి ఓవర్‌లో వరుసగా ఐదు సిక్స్‌లు కొట్టి కోల్‌కతా జట్టును గెలిపించి ఒక్కసారిగా వైరల్‌గా మారిపోయాడు. 

ఈ ప్రదర్శనతో అనూహ్యంగా టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చి తనకు తాను నిరూపించుకున్నాడు. నిలకడగా ఆడుతూనే వేగంగా పరుగులు చేస్తూ ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించాడు. ఐపీఎల్ లో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు తరపున ఎన్నో మ్యాచ్ లు గెలిపించిన రింకూ.. భారత జట్టులోనూ అంతే నిలకడగా రాణించాడు. ఇండియా తరపున తొలి 19 ఇన్నింగ్స్ ల్లో 59.87 సగటు..175.45 అద్భుతమైన స్ట్రైక్-రేట్‌తో 479 పరుగులు చేశాడు. వీటిలో మూడు  హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అయితే 2024 నుంచి రింకూ కెరీర్ ఒక్కసారిగా దిగజారిపోయింది. ఒకవైపు ఐపీఎల్ లో ఘోరంగా విఫలం కావడంతో పాటు మరోవైపు భారత జట్టులోనూ తన పేలవ ఫామ్ ను కొనసాగించాడు. 

రింకూ సింగ్ చివరి 7 టీ20 మ్యాచ్ లు చూసుకుంటే 13.40 సగటుతో కేవలం 67 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అతని స్ట్రైక్ రేట్ (101.51) కూడా దారుణంగా ఉంది. సౌతాఫ్రికా టూర్ లో 9.33 సగటుతో 28 పరుగులు మాత్రమే చేశాడు. వరుసగా తుది జట్టులో అవకాశాలిస్తున్నా ఉపయోగించుకోలేకపోయాడు. ఐపీఎల్ ప్రదర్శన చూసుకున్నా దారుణంగా ఉంది. చివరి రెండు సీజన్ లలో ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేదు. 2024లో 18.66 సగటుతో 168 పరుగులు మాత్రమే చేశాడు. ఐపీఎల్ 2025 సీజన్ లో 29.42 యావరేజ్ తో కేవలం 206 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. ఆసియా కప్ రింకూకు చివరి ఛాన్స్. ఈ టోర్నీలో రింకూ నిరూపించుకోకపోతే అతని టీ20 కెరీర్ ప్రమాదంలో పడే అవకాశం ఉంది.