
న్యూఢిల్లీ: రాజస్థాన్‌లోని కోటా-బురిడీలో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కోటా ఎయిర్‌పోర్ట్‌కు 440.06 హెక్టార్ల భూమి, రూ.1507 కోట్ల మంజూరుకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. అలాగే.. ఒడిశాలో కటక్-భువనేశ్వర్ 6 లేన్ల రింగ్ రోడ్డు నిర్మాణానికి కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. రూ.8307 కోట్ల వ్యయంతో భువనేశ్వర్ రింగ్‌రోడ్డు నిర్మాణాం చేపట్టానున్నారు.
ప్రధాని మోడీ అధ్యక్షతన మంగళవారం (ఆగస్ట్ 19) డిల్లీలో కేంద్ర కేబినెట్ భేటీ అయ్యింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు మంత్రి మండలి ఆమోద ముద్ర వేసింది. భేటీ అనంతరం కేబినెట్ నిర్ణయాలను మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు. రాజస్థాన్‌లోని కోటా-బురిడీలో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్, ఒడిశాలో కటక్-భువనేశ్వర్ 6 లేన్ల రింగ్ రోడ్డు నిర్మాణానికి కేబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పారు. కోట-బుండి గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాన్ని రూ.1507.00 కోట్ల అంచనా వ్యయంతో అభివృద్ధి చేయడానికి ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) చేసిన ప్రతిపాదనను కేబినెట్ ఆమోదించిందని తెలిపారు.
భారీగా పెరిగిన వాహనాల రద్దీని క్రమబద్దీకరించడానికి ఒడిశాలో కటక్-భువనేశ్వర్ మధ్య 6 లేన్ల రింగ్ రోడ్డు నిర్మాణానికి కేబినెట్ అప్రూవల్ తెలిపిందన్నారు. ఈ ప్రాజెక్ట్ కటక్, భువనేశ్వర్, ఖోర్ధా నగరాల నుండి ట్రాఫిక్‌ను మళ్లించడం ద్వారా ఒడిశా, ఇతర తూర్పు రాష్ట్రాలకు గణనీయమైన ప్రయోజనాన్ని అందిస్తుందని తెలిపారు. ఈ ప్రాజెక్ట్ సరుకు రవాణా సామర్థ్యాన్ని మరింత పెంచుతుందని.. అలాగే ఈ ప్రాంతంలో సామాజిక-ఆర్థిక వృద్ధిని పెంచుతుందని పేర్కొన్నారు.