
ఢిల్లీ: తెలంగాణకు సరిపడా యూరియా సరఫరా చేయకపోవడం వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారని, తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పెద్ద పల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ లోక్ సభలో నిరసన తెలిపారు. తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు ఇవాళ లోక్ సభలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ‘యూరియా తగ్గింది.. తెలంగాణ రైతులకు సమస్య పెరిగింది’ అనే ప్లకార్డు పట్టుకొని పోడియం వైపు దూసుకెళ్లారు. ఈ క్రమంలో ఎంపీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో కాసేపు సభ వాయిదా పడింది.
అనంతరం ఎంపీలు పార్లమెంటు ఆవరణలో వయనాడ్ ఎంపీ, ఏఐసీసీ అగ్రనేత ప్రియాంక గాంధీతో కలిసి ఆందోళన చేశారు. రాష్ట్రానికి తక్షణం యూరియా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాజ్యసభలోని బీఆర్ఎస్ ఎంపీలు, లోక్ సభలో ఉన్న బీజేపీ ఎంపీలు స్పందించపోవడం గమనార్హం.