- పరిశ్రమలు, కన్స్ట్రక్షన్ సెట్లలో ఇన్స్పెక్షన్ కోసం వాడకం
- డెవలప్ చేసిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న ఇండియా ఏఐ సమిట్ లో రోబో డాగ్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. అది శునకంలా నడుస్తుంది. ఇంజినీర్ లాగా ఆలోచిస్తుంది. పరిశ్రమలు, వేర్ హౌసెస్, మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్లు, కన్ స్ట్రక్షన్ సైట్లు, డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వంటి ప్రాంతాల్లో వినియోగం కోసం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఈ రోబోను అభివృద్ధి చేసింది. పని ప్రాంతాల్లో ఇప్పటికీ మ్యాన్యువల్ గానే పర్యవేక్షణ చేస్తున్నారు. దీంతో కొన్నిసార్లు తప్పిదాలు జరగడం, ప్రమాదాలు చోటుచేసుకోవడం వంటి ఘటనలు సంభవిస్తున్నాయి.
ఇలాంటి వాటిని నివారించడానికి ఈ రోబో డాగ్ ను ఆవిష్కరించారు. ఇది ఎగుడుదిగుడు ఉపరితలాల్లోనూ నడుస్తుంది. మెట్లు ఎక్కుతుంది. కష్టమైన జోన్లలోనూ వెళ్లి అప్పగించిన పనిచేస్తుంది. కంప్రెసర్లు, ఎలక్ట్రికల్ ప్యానెల్స్, పవర్ డిస్ట్రిబ్యూషన్ యూనిట్లు వంటి క్రిటికల్ ఎక్విప్ మెంట్లను ఇది రీడ్ చేస్తుంది. కంప్రెసర్ లో ఏమన్నా లోపం తలెత్తితే, తనంతట తానే రీరూట్ చేసుకుని అందుకు కారణాన్ని కనుగొంటుంది. తర్వాత టెక్నీషియన్ ను అలర్ట్ చేస్తుంది. అలాగే, సిస్టమ్ లో ఏమన్నా లోపం తలెత్తితే.. వెంటనే మెయింటెనెన్స్ అలర్ట్ జారీ చేస్తుంది. దీంతో అందుబాటులో ఉన్న టెక్నీషియన్లకు సమాచారం అంది వెంటనే వారు ఘటనా స్థలానికి చేరుకుని తగిన చర్యలు తీసుకోవడానికి వీలు కలుగుతుంది. అయితే, వర్కర్లను రీప్లేస్ చేయడం ఈ రోబో ఉద్దేశం కాదు. ప్రమాదకరమైన ప్రాంతాల్లో సమస్య తలెత్తితే మనుషులను కాకుండా రోబోతో సమస్యను పరిష్కరించడానికే దీనిని అభివృద్ధి చేశారు.
